రైట్ టర్న్

6 Oct, 2015 22:41 IST|Sakshi
రైట్ టర్న్

చక్రాలు తిరుగుతున్నాయి.
రోడ్డు... కారును హత్తుకుంది.
గమ్యం పిలుస్తోంది.
స్పీడు పెరిగింది.  
రేర్‌వ్యూ మిర్రర్‌లో పీడకల మాయమైపోతోంది.
ఇప్పుడు చక్రం తిప్పుతున్న చేతి గాజులు తాళం వేస్తున్నాయి.
ఒక మహిళ జీవితం ఎంత అందంగా ఉండాలనుకుంటామో
అంత అందంగా ఉంది.
ఎంత గౌరవంగా ఉండాలనుకుంటామో అంత ధీమాతో సాగుతోంది.
ఆమె టాక్సీలో పాసింజర్‌గా ఒక్కసారి ప్రయాణం చేసినా చాలు...
ఎవరికైనా జీవితంపై ఆసక్తి, జీవనయానానికి ఒక గమ్యం దొరుకుతుంది.
ఒకప్పుడు సెల్వి ఇలాంటి ఒక రోడ్డుమీదికి పరిగెట్టుకుంటూ వచ్చింది...
ఏ బండి కిందైనా పడి చనిపోదామని!
ఇప్పుడు అదే రోడ్డు, సెల్వి బండికి సలామ్ కొడుతోంది.
మనందరికీ ఒక ‘రైట్’ టర్న్ చూపిస్తోంది!

 
మైసూర్... తారు రోడ్డు మీద జర్క్స్ లేకుండా సాఫీగా సాగిపోతోంది ఓ టాక్సీ! వెనకసీట్లో ముప్పై పైబడిన యువకులు ఇద్దరు కూర్చుని ఉన్నారు. అందులో ఒకతను.. స్టీరింగ్ వీల్‌ని అలవోకగా తిప్పుతున్న ఆమె నల్లని, సన్నని, కోమలమైన వేళ్లనే చూస్తున్నాడు అబ్బురంగా! ఆ వేళ్లలో ఒడుపు ఉంది, నేర్పు ఉంది. పట్టువిడుపులు ఉన్నాయి.

ఆమె పేరు సెల్వి. వయసు 28! స్వస్థలం.. తమిళనాడు, కర్ణాటక బార్డర్‌లోని మారుమూల పల్లె! ఓ టాక్సీడ్రైవర్ గురించి చెప్పడానికా ఈ ఉపోద్ఘాతం అని పెదవి విరవకండి! సెల్వి కర్ణాటక రాష్ట్రంలోని మొదటి మహిళా టాక్సీడ్రైవర్. బస్, లారీ, ట్రక్ లాంటి భారీ వెహికిల్స్‌ని కూడా నడపగలదు.ఆమె మీద కెనడాకు చెందిన ఎలిసా పొలోస్కీ అనే ఫిల్మ్‌మేకర్ ‘డ్రైవింగ్ విత్ సెల్వి’ అనే డాక్యుమెంటరీ కూడా తీసింది. అయితే ఈ సాధికారతను సాధించడానికి సెల్వి ఎన్నో మలుపులు, ఇంకెన్నో స్పీడ్‌బ్రేకర్స్‌ని దాటాల్సి వచ్చింది.
 
రెండువేల సంవత్సరంలో...
తొమ్మిదో తరగతిలో ఉంది సెల్వి. భుజాన పుస్తకాల బ్యాగ్‌మోస్తూ తన భవిష్యత్ కలను స్నేహితులతో పంచుకుంటూ నడుస్తున్న సెల్వికి చెప్పారు స్నేహితులు తమ క్లాస్‌మేట్స్ ఇద్దరి పెళ్లిళ్లు కుదిరాయని, ఆ రోజు నుంచి వాళ్లు ఇక స్కూల్‌కి రాకపోవచ్చని. ఆ మాట విని హఠాత్తుగా ఆగిపోయింది ఆమె. ‘పెద్ద చదువులు, ఉద్యోగాలు లేకుండా కనీసి పదో తరగతి కూడా దాటకుండానే పెళ్లా? పాపం’ అనుకొని మళ్లీ నడకసాగించింది. ‘దేవుడా నాకు ఆ గతి పట్టకుండా చూస్తున్నావ్. రొంబ థాంక్స్’ అనుకుంది మనసులోనే. అదే సమయంలో సెల్వి ఇంట్లో ఆమె తల్లి, అన్న, మేనమామ సెల్వి పెళ్లికోసం సంబంధం మాట్లాడుతున్న విషయం ఆమెకు తెలియదు.. కనీసం ఆమె ఊహకు కూడా అందలేదు! అంది ఉంటే దేవుడికి అంతలా థ్యాంక్స్ చెప్పేది కాదేమో!
 
సాయంకాలం...
స్కూల్ నుంచి వచ్చిన సెల్వికి ఇంట్లో వాతావరణం అంతా కొత్తగా అనిపించింది. ఇత్తడి పళ్లెంలో చీర, జాకెట్టు గుడ్డ, పళ్లు, పూలు, స్వీట్లతో తాంబూలం ఉండడం, ఎన్నడూలేంది మేనమామ భార్య ఆప్యాయంగా పలకరించడం.. ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తమని దగ్గరికి తీసుకున్న పాపాన పోలేదు.. కానీ ఈ రోజేంటో స్కూల్‌నుంచి రాగానే భుజం మీదనుంచి బ్యాగ్ అయినా తీయలేదు తను ‘మా బంగారమే.. మా ఇంటి మహాలక్ష్మే’ అంటూ దగ్గరకి వచ్చి మెటికలు విరుస్తూ ఊపిరాడనంత గట్టిగా హత్తుకుంది అత్త. సెల్వి మనసు కీడు శంకించింది. అక్కడే బల్లమీద కూర్చోని చూస్తున్న తల్లి మొహంలో చిన్నపాటి కలవరం. తనకు నచ్చని విషయాన్ని చెప్పి ఎలా ఒప్పించాలా అన్నట్టుంది ఆమె వాలకం. ‘సెల్వి.. నీకు పెళ్లి కుదిరింది’ అకస్మాత్తుగా అంటూ అప్పటిదాకా ఉన్న ఇబ్బందిని బ్రేక్ చేశాడు సెల్వి అన్న. ‘నాకు పెళ్లేంటి?’ తన మనసు శంకించిన కీడు ఇదేనా అనుకుంటూ అడిగింది సెల్వి. ‘అవును.. మంచి సంబంధం. అబ్బాయికి వ్యాపారం ఉంది. పైగా అత్తావాళ్లకు తెలిసినవాళ్లు. మనకు నయాపైసా ఖర్చు కాకుండా పెళ్లి చేసుకుంటామన్నారు. అన్నయ్యకు ఉద్యోగమూ ఇప్పిస్తామన్నారు’ ఏ భావమూ లేకుండా, ఈ పెళ్లికి సెల్వి అనుమతి అవసరం అన్న భావనను జారవిడవకుండా చెప్పుకెళ్లింది సెల్వి తల్లి. ఆ రాత్రి మొదలు సెల్వి కొన్ని రాత్రులు ఏడ్చింది, మొత్తుకుంది, బతిమాలింది, బామాలింది పెళ్లివద్దని. కానీ ఎవరి చెవికీ ఎక్కలేదు. ఇంకెవరి మనసుకీ పట్టలేదు. తన క్లాస్‌మేట్స్ ఇద్దరిలాగే పదో తరగతి దాటకుండానే సెల్వి పెళ్లి అయిపోయింది.
 
అత్తింట్లో...
బాల్యవివాహానికి బలైన సెల్వికి అత్తింట్లో గృహ హింస ఎదురైంది. భర్తకు, ఆమెకు దాదాపు పదాహారేళ్ల వయసు తేడా. చీటికీమాటికీ కొట్టడం, నోటికొచ్చినట్టు తిట్టడం. ఇదే... అత్తింట్లో ఆమెకు భర్త ఇచ్చిన ఆదరణ. కాఫీ సరిగ్గా కలపలేదనే దగ్గర్నుంచి ఇల్లు సర్దడం రాదు అనే మిషను దాటి చివరకు పిల్లలు పుట్టలేదు అనేంత వరకు వెళ్లాయి అత్తింటి వేధింపులు. ఎంత సహనంగా ఉన్నా ప్రతి రోజూ ఆ సహనానికి పరీక్ష జరిగేది. అలా నాలుగేళ్లు గడిచాయి. అమ్మకు చెప్పి ఏడిస్తే ఈసడింపే కానీ ఓదార్పు దొరికేది కాదు. అన్న అసలు ఆమె బాధను తన చెవిదాకా రానిచ్చేవాడే కాదు. ‘ఏమైనా అదే నీ ఇల్లు. కష్టమైనా, నష్టమైనా అక్కడే భరించాలి. అసలు మేమున్నామనే విషయాన్నే మరిచిపో’ అంది అమ్మ ఒకరోజు. అత్తగారింట్లో వెతలకన్నా అమ్మ అన్న ఆ మాటే ఎక్కువ బాధించింది సెల్విని.
 
2004లో...
ఓ రోజు.. ఆత్మహత్య తప్ప తన సమస్యకు వేరే పరిష్కారం లేదని అత్తింటి గడపదాటి రోడ్డుమీదకు వచ్చింది. వేగంగా వస్తున్న బస్ కిందకు వెళ్లాలనుకుంది. ఆ క్షణంలో ఆమె మెదడు ఏం ఆలోచించించిదో మరి బస్ కిందకు వెళ్లాలనుకున్న ఆమె చెయ్యి ఎత్తి బస్ ఆపింది. సడెన్ బ్రేక్‌తో ఆగిన బస్‌లోకి ఎక్కేసింది. అది మైసూర్ బస్. అదే ఆమె ఆలోచనా గమ్యాన్ని, ప్రయాణ మార్గాన్నీ మార్చింది. బస్‌లో పక్కసీట్‌లోనే ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ సెల్వితో మాటలు కలిపింది. వివరాలు తెలుసుకొని ఆమెను సరాసరి మైసూర్‌లోని ‘ఒడనాడి’ విమెన్ రెఫ్యూజీ సంస్థకు తీసుకెళ్లింది. అక్కడ చేరిన సెల్వి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంకో వైపు ప్రైవేట్‌గా టెన్త్‌క్లాస్ పరీక్షకు హాజరైంది. డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు, టెన్త్‌లోనూ ఉత్తీర్ణత సాధించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఓ టాక్సీనీ కొనుక్కుంది. అలా కర్ణాటకలోనే ఫస్ట్ లేడీ టాక్సీ డ్రైవర్‌గా నిలిచింది.
 
 ఆత్మవిశ్వాసం...
 రోడ్డు మీద కారు ప్రయాణం సెల్విలో కొత్త విశ్వాసాన్నిచ్చింది. ఆత్మబలాన్ని పెంచింది. ఆ తెగువతో మైసూర్‌లోని స్త్రీలకు సంబంధించిన పలు స్వచ్ఛంద సంస్థలను కలవడం, వాళ్లతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు మహిళల అరోగ్య సమస్యల మీదా గొంతు విప్పింది. చేతనైన సహాయం చేస్తోంది. తనలాంటి ఇంకెంతో మంది నిరాశ్రయ మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణనిస్తోంది. కొద్ది కాలంలోనే సెల్వి ఇటు కర్ణాటకలోనూ, అటు తమిళనాడులోనూ ఫేమస్‌అయిపోయింది. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లోనూ సెల్వీ స్టోరీ చోటు సంపాదించుకుంది. అది చదివే కెనడియన్ ఫిల్మ్‌మేకర్ ఎలీసా పొలోస్కి సెల్వీ మీద డాక్యుమెంటరీ తీసింది. అది లండన్‌లోని రెయిన్‌డాన్స్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ అయి ప్రశంసలూ అందుకుంది. ‘బస్‌కింద పడదామని వచ్చిన నాకు చివరి నిమిషంలో అనిపించింది.. నేనేందుకు చావాలి? అని. బతికి నన్ను నేను వ్రూవ్ చేసుకోవాలనుకున్నా. అందుకే చేయి ఎత్తి బస్ ఆపాను. ఈ దేశంలో ఆడవాళ్లకు బాధలే ఉండాలి అన్న రూలేం లేదుకదా! సంతోషాన్ని ఒకరు ఇవ్వడమేంటి? మన ఆనందాన్ని మనమే వెదుక్కోవాలి. సంతోషపడే హక్కు మగవాళ్లకెంత ఉందో మనకూ అంతే ఉంది. దేనికీ తలవంచకుండా ఉంటే చాలు!’ అంటూ టాక్సీ యాక్స్‌లెటర్‌ని రైజ్ చేసింది సెల్వీ గమ్యంలో మరింత దూసుకుపోవడానికి సిద్ధమవుతూ!
 
సెల్వి జీవన ప్రయాణంలో ఆమెకు తోడైన ఒక వ్యక్తి ఆమె చేయి అందుకున్నాడు. ఇప్పుడు వాళ్లకిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని పైలట్‌ను చేయాలని, చిన్నమ్మాయిని డాక్టర్‌ని చేయాలని అనుకుంటోంది సెల్వి.
 

మరిన్ని వార్తలు