కీటోతో గుండెజబ్బుల ప్రమాదం...!

11 Mar, 2019 00:36 IST|Sakshi

ఈమధ్య కాలంలో పిండిపదార్థాలు తక్కువగా.. కొవ్వులెక్కువగా ఉండే ఆహారం తినడం ప్రాచుర్యం పొందుతున్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కీటో డైట్‌తో గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని హెచ్చరిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఆహారం ద్వారా అందే శక్తిలో 45 శాతం కంటే తక్కువ పిండి పదార్థాల నుంచి వస్తూంటే ఆర్టియల్‌ ఫైబ్రేషన్‌ గుండెజబ్బు వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు వీరు చెబుతున్నారు. ఆర్టియల్‌ ఫైబ్రేషన్‌ ఉన్న వారిలో గుండెపై కవాటాలు సంకోచ, వ్యాకోచాలు ఏకరీతిగా ఉండవు. ఫలితంగా అక్కడి నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది.  

కార్బోహైడ్రేట్ల స్థానంలో ఏ రకమైన కొవ్వులను చేర్చినా ఫలితాలు ఇలాగే ఉంటాయని సున్‌ యట్‌ సేన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త షియడాంగ్‌ ఝాంగ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. మరోవైపు అమెరికాకు చెందిన నార్త్‌వెల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు కూడా కీటో ఆహారంపై జరిగిన అధ్యయనంలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. దాదాపు 14 వేల మంది వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు. ఆర్టియల్‌ ఫైబ్రేషన్‌ వ్యాధి లక్షణాలు లేని వీరందరినీ 22 ఏళ్లపాటు పరిశీలించగా 1900 మంది వ్యాధిబారిన పడ్డారు. వాళ్లు తినే ఆహారాన్ని పరిశీలించినప్పుడు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి.. కొవ్వులు ఎక్కువగా ఉన్న వారికి ఈ గుండెజబ్బు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది.  

మరిన్ని వార్తలు