రియల్టీపై రాబడి రావాలంటే..

26 Sep, 2014 23:38 IST|Sakshi
రియల్టీపై రాబడి రావాలంటే..
  • రియల్టీపై రాబడి రావాలంటే..
  • పెట్టిన పెట్టుబడి కాస్త సురక్షితంగా ఉండి.. కొంత మెరుగైన రాబడి అందించగలిగే అనువైన సాధనాల్లో స్థిరాస్తి కూడా ఒకటి. కొన్ని సందర్భాలు మినహా రియల్ ఎస్టేట్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండవు. అయితే, మంచి రాబడులు అందుకోవాలంటే ప్రాపర్టీ ఎంపికలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
         
    సిటీ మధ్యలో ప్రాపర్టీ తీసుకోవాలంటే వేతన జీవికి తలకు మించిన భారమే అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగినా ఏ చిన్న దాంతోనో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లోనైతే ప్రాపర్టీ కొంత చౌకగా.. కాస్త పెద్దదే  లభిస్తుంది. క్రమక్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న కొద్దీ రియల్టీ విలువ కూడా పెరిగి.. పెట్టిన పెట్టుబడిపై రాబడి మెరుగ్గా అందుకోవచ్చు.
         
    {పాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన మరో విషయం.. కీలకావసరాలైన సదుపాయాలు అందుబాటు దూరంలో ఉన్నాయా లేక సమీప భవిష్యత్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది. ఉదాహరణకు షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కులు, పిల్లల కోసం ప్లేగ్రౌండ్స్ మొదలైనవి ఉంటే ఆ ప్రాంతం వైపు చాలా మంది మొగ్గు చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఏరియాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఇటువంటి సదుపాయాలకు తగినంత స్థలం ఉంటుంది. ఇలాంటి ఆకర్షణలు వచ్చే కొద్దీ అక్కడి ప్రాపర్టీకి క్రమక్రమంగా విలువ పెరుగుతుంది. దీనివల్ల అక్కడి స్థిరాస్తి విలువా పెరుగుతుంది. అలాగే, స్కూళ్లు, ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
         

    నగరాల్లో ప్రస్తుతం చాలామందికి ఇల్లు ఈ మూల ఉంటే.. ఆఫీసు మరో మూల ఉంటోంది. ఫలితంగా రోజూ కిలోమీటర్లు, గంటల కొద్దీ ప్రయాణాలు తప్పడం లేదు. దీని వల్ల పెట్రోలు కోసం బోలెడంత వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే బస్సులు, ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూసి, ఎంపిక చేసుకోవడం ఉత్తమం. శివారు ప్రాంతాలకు కూడా మెట్రో రైళ్ల లాంటి రవాణా సాధనాలు వస్తున్నందున వాటికి సమీపంలోనివి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు, ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, కంపెనీలు మొదలైనవి ఉన్నా లేక వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాటిల్లో పనిచేసే ఉద్యోగులు దగ్గర్లో ఉండటానికి మొగ్గు చూపుతారు కాబట్టి.. అక్కడి రియల్టీ రేట్లూ పెరిగే అవకాశాలు ఉంటాయి.
     

>
మరిన్ని వార్తలు