రోడ్డు చెప్పే కథ

29 Oct, 2019 00:17 IST|Sakshi

రోడ్‌ మూవీస్‌

కథలను హీరో చెప్తాడు. హీరోయిన్‌ చెప్తుంది. కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌ చెప్తాడు. కాని ఒక్కోసారి రోడ్‌ కూడా చెప్తుంది.కథ రోడ్‌ మీద నడుస్తుంది. రోడ్‌ కథలో పాత్ర అవుతుంది. హాలీవుడ్‌లో రోడ్‌ మూవీస్‌ ప్రత్యేకమైనవి.మన దేశంలో అలాంటి కథలు తక్కువ. కాని తీసిన రోడ్‌ మూవీస్‌ ప్రేక్షకులకు నచ్చాయి. నల్లరోడ్డు మీద తెల్ల అక్షరాలతో చెక్కిన కథలు ఇవి.

మనిషి ప్రయాణం చేస్తాడు. ఒక్కోసారి తెలిసిన గమ్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి తెలియని లక్ష్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి భౌతిక ప్రయాణం చేస్తాడు. మరోసారి ఆత్మిక ప్రయాణం చేస్తాడు. ఒక ప్రయాణంలో పరులను తెలుసుకుంటాడు. ఒక ప్రయాణంలో తనను తాను కనుక్కుంటాడు. ఈ మొత్తం ప్రయాణాల్లో ఎవరు తోడు ఉన్నా ఎవరు లేకపోయినా తప్పక ఉండే పాత్ర ఒకే ఒక్కటి.æరోడ్డు. ఆ రోడ్డుకు కథంతా తెలుసు లేదా అదే కథంతా మనకు చెప్తుంటుంది.

ఖైదీ
పదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఆ రోజు విడుదలవుతాడు కార్తి. సాయంత్రం బస్సెక్కి అనాథ శరణాలయంలో ఉన్న కూతురిని మరుసటిరోజు ఉదయం కలవాలి. కాని అతడి వాలకం చూసి పోలీసులు అనుమానంతో అరెస్ట్‌ చేస్తారు. అప్పటికే పోలీసులు మరోచోట దాదాపు 900 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకొని ఎస్‌.పి.ఆఫీస్‌లో దాచి ఉంటారు. వాటి కోసం మాదక ద్రవ్యాల ముఠా ఆ రాత్రి ఎస్‌.పి. ఆఫీస్‌ మీద దాడి చేయాలనుకుంటుంది. పోలీస్‌ ఆఫీసర్లందరూ ఒకచోట పార్టీ చేసుకుంటుంటే వారు తాగే మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుంది ముఠా.

ఆ మద్యం తాగి ఆఫీసర్లు చావు బతుకుల్లోకి వెళతారు. ఒక్క ఆఫీసరే మద్యం తాగక స్పృహలో ఉంటాడు. అతనికి గత్యంతరం లేక కార్తిని సాయం కోరతాడు. మీడియాకు తెలియకుండా పోలీసులందరికీ వేరే ఊరిలో ఉన్న ప్రయివేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించాలి. అలాగే ఎస్‌.పి. ఆఫీస్‌ మీద జరిగే దాడిని ఎదుర్కోవాలి. ఈ రెంటి కోసం మాత్రమే కాకుండా తన కూతురు కోసం కూడా కార్తి చేసే ప్రయాణమే ‘ఖైదీ’. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఆరేడు గంటల్లో జరిగే ఈ కథను ఎంతో బిగువుగా చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. దుర్మార్గం తన లక్ష్యాన్ని చేరే లోపల మంచే తన గమ్యానికి చేరుతుందని ఈ కథ చెబుతుంది. మానవోద్వేగాలు బయల్పడాలంటే మనిషికి ఒక గట్టి ప్రయాణం తగలాలని చెబుతుందీ సినిమా.

నిమజ్జనంతో మొదలయ్యి...
తెలుగులో ‘రోడ్డు ప్రయాణం’ ప్రధానాంశంగా వచ్చిన సినిమాలలో ‘నిమజ్జనం’ (1979) ను మొదట చెప్పుకోవాలి. ఇందులో మామగారి అస్తికలు గంగలో నిమజ్జనం చేయడానికి భర్తతోపాటు ఎడ్లబండిలో బయలు దేరుతుంది శారద. ఊరి నుంచి చాలా దూరంలో ఉన్న రైలుస్టేషన్‌కి ఎడ్లబండిలో ప్రయాణం చేయాలి. కాని బండివాడు శారద మీద కన్నేస్తాడు. అస్తికల కుండ నేల జారేలా చేసి భర్తను అది వెతుక్కుంటూ వెళ్లేలా చేసి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. ఈ విషయం ఆమె ఎవరితోనూ చెప్పుకోలేక గంగలో నిమజ్జనం సమయంలో నీట మునిగి ప్రాణాలు వదులుతుంది. తిరుగు ప్రయాణంలో ఒక్కడే వచ్చిన భర్తను చూసి బండివాడు భార్య గురించి వాకబు చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతాడు. పాపభీతితో, పశ్చాత్తాపంతో బండివాడు తాను చేసిన తప్పు ఒప్పుకొని ప్రాణం వొదులుతాడు. 

నాగార్జున ‘చైతన్య’– వర్మ ‘అనగనగా ఒకరోజు’
ప్రతాప్‌పోతన్‌ తీసిన ‘చైతన్య’ తెలుగులో పూర్తిస్థాయి రోడ్‌ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో మద్రాసు నుంచి గోవా వరకు ఒక ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో దొంగలు, స్మగ్లర్లు, పోలీసులు, హీరో, హీరోయిన్‌ అందరూ ఉంటారు. అయితే సరైన కథాంశమే లేదు. ఆ తర్వాత వచ్చిన ఎస్‌.వి. కృష్ణారెడ్డి ‘గన్‌ షాట్‌’(1996) ఒక సైకో నుంచి తప్పించుకోవడానికి హీరో అలీ చేసే రోడ్డు ప్రయాణం కూడా నిరాశ పరిచింది. కాని రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒకరోజు’ హిట్టయ్యింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంట ఒకరోజులో ఎన్ని అనూహ్య సంఘటనలు ఎదుర్కొందనేది కథ. శ్రీదేవి, వెంకటేశ్‌ల ‘క్షణక్షణం’ కూడా రోడ్‌ మూవీనే. సంబంధం లేని చోరీ కేసులో తామే నిందితులమని భావించి వీరు అడవుల్లోకి పారిపోతారు. ఆ తర్వాత సిటీకి ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణాల మధ్య జరిగే ప్రేమకథ ఇది. 

ఓయ్‌– గమ్యం
తాను ప్రేమించిన అమ్మాయి కేన్సర్‌ వల్ల మరి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నదని తెలిసిన అబ్బాయి ఆమె తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న కోరికలు కొన్నింటిని తీర్చడానికి ఆమెను తీసుకొని ప్రయాణం మొదలుపెడతాడు. సిద్ధార్థ, షామిలి నటించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కాని క్రిష్‌ తన తొలి సినిమాగా తీసిన రోడ్‌ మూవీ ‘గమ్యం’ ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందింది. ఒక ధనిక కుర్రవాడు శర్వానంద్‌ తన ప్రియురాలిని వెతుక్కుం టూ చేసే ప్రయాణం ఈ కథ. ఈ ప్రయాణంలో అతడు నిజమైన భారతదేశాన్ని కనుగొంటాడు. జనం ఎలా ఉన్నారో చూస్తాడు. ప్రజల కోసం అడవుల్లో ఉండి పని చేయడం కన్నా ప్రజల మధ్య ఉండి పని చేయడం మంచిదని గ్రహిస్తాడు. క్రిష్‌కు పేరు తెచ్చిన రోడ్‌ మూవీ ఇది.

ఖలేజా
త్రివిక్రమ్‌ తీసిన రోడ్‌ మూవీ ‘ఖలేజా’ కల్ట్‌ మూవీగా నిలిచింది. రిలీజైనప్పుడు కన్నా టీవీల్లో ఇది ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ‘గమ్యం’ ను పోలిన కథతో తయారైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మనిషి విలువలతో ప్రయాణం చెయ్యాలని చెబుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ కోసం సఫలమైన ప్రయాణం చేయాలని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చెబుతుంది. ఒక పిల్లవాడితో ఏర్పడిన అనుబంధంతో విలన్‌ భరతం పట్టడానికి సాయితేజ్‌ చేసిన ప్రయాణమే ‘సుప్రీమ్‌’.

ముగింపు: కథలన్నీ కంచికి చేరతాయని పెద్దల మాట. ఆ కంచికి చేరడంలో కొన్ని కథలు రోడ్డు మీద జారిపోయి ఉంటాయి. కంచికి పోతూ పోతూ మనకూ తారసపడుతూ ఉంటాయి. అందువల్ల మంచి కథ కోసం రోడ్డు మీద పడి వాటిని పట్టుకోవడంలో తప్పులేదు. రోడ్డుతోపాటు జరిగే ఈ సినీ ప్రయాణం కొనసాగాలి.
– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు