ఏం చెప్పమంటావు తల్లీ?!

20 Jul, 2018 00:45 IST|Sakshi

చెట్టు నీడ

అది పరమ పవిత్రమైన కాబా ప్రాంతం. అక్కడ ఒక ఫకీరు తనకోసం ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. అందుకు కావలసిన ధనాన్ని సేకరించేందుకు బయలు దేరాడు. పగలంతా ప్రయాణం చేసి పొద్దుగూకే వేళకు రాబియా అనే ఒక పేదరాలి ఇంటికి చేరాడు. రాబియా ఫకీరుకు స్వాగత సత్కారాలు చేసింది. రుచికరంగా వంట చేసి భక్తిగా ఫకీరుకు తినిపించింది. తర్వాత ఒక చెక్క మంచంపై పరుపు, కంబళి పరిచింది. ఆయనను దానిపై పడుకోమని చెప్పి, తాను ఆ మంచం పక్కనే నేలపై శుభ్రం చేసుకుని ఒక దుప్పటి పరుచుకుని తన చేతులనే తలగడగా చేసుకుని కొద్దిసేపటికే గాఢనిద్రలోకి జారిపోయింది.  ఫకీరుకి మాత్రం ఎంతకూ నిద్రపట్టడం లేదు. కారణం అతనికి మెత్తటి పరుపుపై పడుకోవడం అదే మొదటిసారి. దాంతో పరుపు మీద అటూ ఇటూ దొర్లుతూ, తెల్లవారే సమయానికి చిన్న కునుకు తీశాడు. తెల్లవారగానే ఫకీరు ముఖం కడుక్కోడానికి ఏర్పాటు చేస్తూ, ‘రాత్రి ఇక్కడ సుఖంగా నిద్ర పట్టిందా బాబా?’ అనడిగింది రాబియా.

‘‘ఏం చెప్పమంటావు తల్లీ, నాకసలు నిద్రే పట్టలేదు. నేనున్న ప్రదేశంలో కటికనేలపై నడుం వాల్చగానే హాయిగా నిద్రలోకి ఒరిగిపోయేవాడిని. అటువంటిది, ఈ మెత్తటి పరుపు నా పాలిట రంపమై కంటికి కునుకులేకుండా చేసింది. నీవు మాత్రం నేలపై పడుకున్నా హాయిగా నిద్రపోయావు. అదెలా సాధ్యమైంది నీకు?’’ అనడిగాడామెను. ‘‘మహాత్మా! నా ఈ చిన్న కుటీరమే నాకు రాజమహలులా కనిపిస్తుంది. నా కుటీరంలో రోజూ ఒక భక్తుడైనా భోజనం చేస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. ఆ సంతృప్తితో నాకు నిద్రపట్టగానే, నేను పరుపుపై పడుకున్నానా, లేక నేలపై దుప్పటి పరుచుకుని పడుకున్నానా? అన్న ఆలోచనలే రావు. నేను పగలంతా ఏమేమి మంచి పనులు చేశానో గుర్తు చేసుకుంటూ, నా వల్ల ఎవరికైనా ఏమైనా అసౌకర్యం కలిగి ఉంటే, నన్ను క్షమించమని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండగానే ఎప్పుడు నిద్రపడుతుందో నాకే తెలియదు’’ అని చెప్పింది.  ఆ మాటలు వింటూ ఫకీరు కొద్దిసేపు ఏదో ఆలోచించాడు. వెంటనే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రాబియా ఆయనకు తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును ఇస్తూ ఆయనతో ‘‘బాబా! నేను కూడా మీతోపాటు ధనసేకరణకు మీ వెంట రానా?’’ అనడిగింది.  ‘‘తల్లీ! ప్రపంచంలో నిజమైన సుఖం ఎక్కడ ఉందో నాకు చక్కగా తెలియజేశావు. ఇప్పుడు నాకు ఏ ఆశ్రమంతోనూ పనిలేదు. అవసరం కూడా లేదు’’ అంటూ ఫకీరు తిరిగి వెళ్లిపోయాడు.


 

మరిన్ని వార్తలు