రోబో ఈగ

17 May, 2018 00:38 IST|Sakshi

‘రోబో’ సినిమా తెలుసు, ‘ఈగ’ సినిమా తెలుసు... ఇప్పుడు ‘రోబో ఈగ’ అనే కొత్త సినిమా రిలీజవుతోందేంటా అని అనుకుంటున్నారా? సినిమా కాదు గాని, నిజంగానే అసలు సిసలు ‘రోబో ఈగ’ను రిలీజ్‌ చేశారు... సారీ తయారు చేశారు వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఈగలా గాల్లోకి ఎగిరే ఈ రోబోకు ‘రోబో ఫ్లై’ అని నామకరణం కూడా చేశారు. ఇది చాలా తేలికైన రోబో. దీని బరువు టూత్‌పిక్‌ బరువు కంటే కాస్త ఎక్కువ. దీనికి అమర్చిన సర్క్యూట్‌ బోర్డు సాయంతో లేజర్‌ కిరణాలను విద్యుత్తుగా మార్చుకుని, వైర్‌లెస్‌ పద్ధతిలో గాలిలోకి ఎగరడం దీని ప్రత్యేకత.

ఇలా వైర్‌లెస్‌ పద్ధతిలో గాల్లోకి ఎగరగలిగే రోబో ఇప్పటి వరకు ఇదొక్కటి మాత్రమేనని దీని రూపకల్పనలో పాల్గొన్న శాస్త్రవేత్త సాయర్‌ పుల్లర్‌ తెలిపారు. దీనిపై ఉండే మైక్రో కంట్రోలర్‌ రెక్కలు కొట్టుకునే వేగాన్ని నియంత్రించేలా సందేశాలు పంపుతుందని, ఎక్కువసార్లు కొట్టుకునేందుకు ఒకరకంగా, ముందుకు వెళ్లేందుకు ఇంకోలా, గాలి అల పైకి రాగానే వేగాన్ని తగ్గించేందుకు మరోలా సందేశాలు పంపుతుందని ఆయన వివరించారు. గ్యాస్‌ లీకేజీలను, కర్మాగారాల నుంచి వెలువడే కలుషిత వాయువులను పసిగట్టడం మొదలుకొని, రకరకాల ప్రయోజనాల కోసం దీనిని వాడుకోవచ్చని తెలిపారు. 

మరిన్ని వార్తలు