బియ్యపు గింజ సైజులో రోబో!

31 Jan, 2018 00:40 IST|Sakshi

శరీరంలోని వేర్వేరు అవయవాలకు నేరుగా మందులు అందించేందుకు వీలు కల్పించే ఓ బుల్లి రోబోను జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. కేవలం ఒక బియ్యపు గింజ సైజులో ఉండే ఈ రోబో గంతులేయడం మొదలుకొని పాకడం, ఎగబాకడం వంటి అన్ని రకాలుగా కదలగలగడం విశేషం. గొల్లభామ స్ఫూర్తితో తయారైన ఈ బుల్లి రోబోను శరీరం బయటి నుంచి అయస్కాంతాల నుంచి ఉపయోగించి నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స చేయకుండానే లోపలి అవయవాలకు మందులు అందించేందుకు ఈ రకమైన రోబోలు బాగా ఉపయోగపడతాయని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌కు చెందిన శాస్త్రవేత్త మెటిన్‌ సిట్టీ తెలిపారు.

నోటి ద్వారా లేదంటే ఏదైనా ఇతర ప్రాంతాల నుంచి శరీరంలోకి దీన్ని చొప్పించవచ్చునని అయస్కాంతాల సాయంతో కావాల్సిన చోటికి తీసుకెళ్లి అక్కడ మందులు వదిలేలా చేయవచ్చునని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తాము దీన్ని కృత్రిమంగా తయారు చేసిన కడుపు నమూనాలో, కోడి కణజాలంలో ప్రయోగించి చూశామని.. అన్ని రకాల పరిసరాల్లోనూ ఇది భేషుగ్గా పనిచేసిందని వివరించారు.   

మరిన్ని వార్తలు