ఇంతుండీ పని చెయ్యాలా!

27 Sep, 2018 00:09 IST|Sakshi

చెట్టు నీడ

అమెరికా పారిశ్రామికవేత్త రాక్‌ ఫెల్లర్‌ వయస్సు మీదపడినప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. ఆయన ఓమారు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ యువకుడు గుర్తు పట్టి, ‘‘మీరు ధనవంతులు. ఏ లోటూ లేదు. అటువంటప్పుడు ఇంకా మీరెందుకు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు?’’ అని అడిగాడు. అప్పుడు రాక్‌ ఫెల్లర్‌.. ‘‘మీకో ప్రశ్న వేస్తాను. దానికి సమాధానం చెప్పండి’’ అని అన్నారు. ‘‘అడగండి సార్‌’’ అన్నాడు యువకుడు. అప్పుడు రాక్‌ ఫెల్లర్‌ ‘‘ఇప్పుడీ విమానం ఆకాశంలో పోతోంది కదా.. ఎక్కడా ఏ మాత్రం ప్రమాదం లేకుండా నిలకడగా ఈ విమానం పోతోంది కదా.. అంతమాత్రాన ఈ విమానంలోని ఇంజన్‌ను ఆపేస్తామా? ఒకవేళ ఇంజన్‌ను ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా’’ అని అడిగారు.

దానికి ఆ యువకుడు ‘‘అమ్మో భలే చెప్పారే, పెనుప్రమాదం సంభవిస్తుంది’’ అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న రాక్‌ ఫెల్లర్‌ ‘‘జీవిత ప్రయాణమూ అంతే. అహర్నిశలూ ఒళ్లు వంచి కష్టపడాలి. ఓ స్థాయికి చేరిన తర్వాత ఇక మనకేమీ అనుకుని కృషిని ఆపేస్తే జరగరానిది ఏదైనా జరగొచ్చు. అనుకోని అవసరమే వచ్చి పడొచ్చు. ఆ ప్రమాదం ఎదుర్కోకుండా ఉండాలంటే ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అప్పుడు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఒత్తిడీ ఉండదు. ఏమంటారు’’ అని చిరునవ్వుతో ఎదురు ప్రశ్నించారు. అంగీకార సూచకంగా తలపంకించాడా యువకుడు. 
– రేణుదీశ్‌

మరిన్ని వార్తలు