ఏళ్లు గడిచినా... వీళ్లింతే!

7 Apr, 2014 03:00 IST|Sakshi

వీక్షణం
 
కాలం మారేకొద్దీ మనుషులు మారుతూ ఉంటారు. వారి వేషభాషలు, అలవాట్లు, అభిరుచులు... అన్నీ మారతాయి. కానీ ‘రాకబిల్లీ కమ్యూనిటీ’కి చెందినవారిలో మాత్రం ఏ మార్పూ కనిపించదు. ఎందుకంటే... వారు మార్పును ఇష్టపడరు. గతంలో జీవించడమే వారికిష్టం!
 
అమెరికాలో ‘రాకబిల్లీ కమ్యూనిటీ’ అనే ఒక సమూహం ఉంది. వీరంతా 1950ల నాటి వస్త్రధారణలో కనిపిస్తారు. వారి హెయిర్ స్టయిల్స్ కూడా నాటి కాలంలో మాదిరిగానే ఉంటాయి. అది మాత్రమేనా... వారి ఇళ్లలో ఉండే వస్తువులు, వాడే కార్లు కూడా పాత కాలం నాటివే ఉంటాయి. వంట సామాన్ల దగ్గర్నుంచి ఫర్నిచర్ వరకూ అన్నీ అరవై, డెబ్భై దశాబ్దాల క్రితానికి మనల్ని లాక్కుపోతాయి.
 
ఇదంతా ఏంటి అంటే... ‘ఇది మా కమ్యూనిటీ ప్రత్యేకత’ అంటారు వారంతా. ‘గతంలో బతకడంలో ఓ సంతోషం ఉంటుంది. నాటి రోజులు మంచివి. అందుకే ఆ రోజుల నుంచి బయటపడటం మాకు ఇష్టం లేదు’ అని కూడా చెబుతుంటారు.
 
కాలంతో వచ్చే మార్పులు నచ్చనివారు, నాటి సంస్కృతీ సంప్రదాయాల మీద మక్కువ ఎక్కువగా ఉన్నవారు కొందరు కలిసి ‘రాకబిల్లీ కమ్యూనిటీ’గా ఏర్పడ్డారు. అలాగని వీళ్లు నిరక్షరాస్యులేమీ కాదు. అందరూ చదువుకున్నవాళ్లు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు. అయినా కూడా వాళ్లు ఇలానే ఉంటారు, ఇలానే బతుకుతారు. చాలా యేళ్లుగా ఉన్న ఈ కమ్యూనిటీ గురించి జెన్నిఫర్ గ్రీన్‌బర్గ్ అనే ఫొటోగ్రాఫర్ ద్వారా వెలికి వచ్చింది. పరుగులు తీస్తోన్న ఆధునికత మధ్య పాత తరానికి ప్రతినిధులుగా ఉన్న వీరిని చూస్తే ఆశ్చర్యం వేయడం లేదూ!
 

మరిన్ని వార్తలు