రోటీ, కపడా ఔర్ మకాన్ దయతో నాస్తి దీనత్వం

12 Nov, 2013 00:25 IST|Sakshi

కరుణ గల కళ్లల్లో అభయమిచ్చే శక్తి ఉంటుంది.
 సాయం చేసే చేతుల్లో అద్భుతదీపం ఉంటుంది.
 అన్నం పెట్టే ఆప్యాయతలో అక్షయపాత్ర ఉంటుంది.
 ఒళ్లు కప్పే ఆదరణలో మానవత్వం ఉంటుంది.
 దయగల హృదయం ఇవన్నీ చేస్తుంది.
 రేపు ‘ప్రపంచ దయార్ద్ర హృదయుల దినోత్సవం’.
 ఆ సందర్భంగా... అలాంటి హృదయాలను మీటే  ప్రయత్నమే ఈవారం... ‘ప్రజాంశం’

 
కళ్లెదుట కూడు, గూడు, గుడ్డ కరవైన జీవితాలు ఇంకా కనపడుతూనే ఉన్నప్పుడు మనం సాధించిన అభివృద్ధికి అర్థం ఏమిటి? కొందరిని ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. కొందరికి తమదైన పరిధిలో సమాధానాలు దొరుకుతుంటాయి.
 
అన్నం శరణం గచ్ఛామి

‘‘అన్నం దొరక్కపోతే మనిషి ఆత్మగౌరవానికే భంగం’’ అంటారు డాక్టర్ సూర్యప్రకాష్. ‘‘ఆశ్రమాలు కట్టించడం, వేలరూపాయలు ఖర్చు చేయడం లాంటి పెద్దపెద్ద పనులు చేయకపోయినా ఓ ముద్ద అన్నం పెట్టలేమా?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటలో తాను ఏర్పాటుచేసిన ‘అందరి ఇల్లు (ఓపెన్ హౌస్)’ ద్వారా తాను కేవలం ప్రశ్నల మనిషిని మాత్రమే కానని ఆయన నిరూపించుకుంటున్నారు కూడా. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హౌస్ ఎందరో అన్నార్తుల కడుపు నింపింది. ఇంకా నింపుతోంది. దాదాపు 310 గజాల స్థలంలో నిర్మితమైన భవనంలో ఆయన నిర్వహిస్తున్న ఈ హౌస్‌కి ఎవరైనా వెళ్లవచ్చు.

అక్కడ ఉన్న కూరగాయలు, దినుసులు ఉపయోగించి వంట వండుకుని కడుపునిండా తిని రావచ్చు. ఈ ఇంట్లో వండుకునేందుకు వంటసామానులతో పాటు చదువుకునేందుకు పుస్తకాలు, అత్యవసరంగా వినియోగించుకునేందుకు కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. ‘‘ఈ మహానగరానికి వచ్చినవారిలో ఎందరో నిరుద్యోగులు, వృద్ధులు, చిన్నారులు... ఒక్కోసారి  కడుపునింపుకునే దారి కనపడక అల్లాడుతుంటారు. వారికోసమే ఈ ఓపెన్‌హౌస్’’ అని చెప్పారు సూర్యప్రకాష్.
 
నీడనిచ్చిన మానవత్వం...

 చిన్న వయసులోనే జైలుపాలైన పిల్లలు విడుదలైన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? మామూలు వారికే నీడ దొరకడం కష్టమైపోతోంది. అలాంటిది... జైలు నుంచి వచ్చిన పిల్లలను ఆదరించేవారెవరు? ‘క్రిస్టోస్’ ఆధ్వర్యంలో హైదరాబాద్, అల్వాల్‌లోని లోతుకుంటలో నిర్వహిస్తున్న ఓ హోమ్ ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకుంటోంది. ‘‘దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన కారాగారాలకు వెళ్లేందుకు నాకు అధికారిక అనుమతి ఉంది’’ అని ఈ సంస్థ నిర్వాహకుడు నాయర్ అంటున్నారు.

ప్రస్తుతం ఆల్వాల్‌లో రెండు అద్దె భవనాలలో హోమ్‌ను నిర్వహిస్తున్నారు. ‘‘ఒకదాంట్లో పూర్తిగా ఆడపిల్లలు, మరో భవనంలో మగపిల్లలు, మా కుటుంబం ఉంటున్నాం’’ అని చెప్పారాయన.  జైలుకు వెళ్లొచ్చినంత మాత్రాన ఆ పిల్లలు జీవితాంతం చెడ్డవారిగానే మిగిలిపోరనే తన అభిప్రాయం ఎంత గట్టిదో వారితో కలిసి జీవించడం ద్వారా చెప్పకనే చెబుతున్నారాయన. ప్రస్తుతం మానసికంగా ఎదగని పిల్లలు, కుష్ఠు వంటి తీవ్రవ్యాధులున్న చిన్నారులు సైతం హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారంటున్న నాయర్... గత పదిహేనేళ్లుగా ఈ హోమ్‌ను నిర్వహిస్తున్నానని చెప్పారు. బోలెడంత భవిష్యత్తున్న చిన్నారులకు నీడ కల్పించడం అనేది తనకు ఎంతో ఆనందాన్ని అందిస్తోందంటున్నారాయన. ఈ ఏడాది చంచల్‌గూడ జైలులో పిల్లలతో కలిసి తమ హోమ్ పిల్లలు చిన్నారుల దినోత్సవాన్ని జరుపుకోనున్నారని చెప్తున్నప్పుడు ఆయనలో ఆ ఆనందం ప్రస్ఫుటమైంది.
 
దుస్తుల్లేని దుస్థితిని తప్పిస్తూ...

తాజాగా విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న అమ్మాయి రూ.లక్షలు ఖరీదు చేసే రెండు పీలికల బికినీ వేసుకుందనేది ఓ విశేషం. ఇంత సుసంపన్నమైన ప్రపంచంలోనే సిగ్గు దాచుకోవడానికి సరైన దుస్తులు కూడా లేని పరిస్థితిలో కోట్లాదిమంది  జీవిస్తున్నారనేది ఓ కఠిన వాస్తవం. సరైన దుస్తులు ధరించేందుకు కూడా అవకాశంలేని నిరుపేదల కోసం షేర్ ఎ సర్వీస్ సంస్థ వస్త్రదాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వస్త్రాలను సేకరించి వాటిని అవసరార్థులకు పంపిణీ చేసేందుకు డిసెంబరు 31ని ‘వస్త్రదానదినం’ గా మార్చింది. ‘‘సేకరించిన దుస్తులను పంపిణీ చేసేందుకు మురికివాడలకు వెళుతున్నప్పుడు... మనిషికి అవసరమైన కనీస వసతులు కూడా ఎంత కరవైపోయాయో అర్థం అవుతోంది’’ అని ఈ సంస్థ నిర్వాహకులు గౌరీశంకర్ అన్నారు. పేరుకు ఏడాదికి ఒకసారి అనుకున్నా... ప్రజల నుంచి స్పందన బాగుండడంతో... ఈ వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని వీలున్నప్పుడల్లా నిర్వహిస్తున్నామన్నారాయన.

 - ఎస్.సత్యబాబు
 

మరిన్ని వార్తలు