ఈవారం విశేషాల రౌండప్‌

2 May, 2017 00:00 IST|Sakshi
ఈవారం విశేషాల రౌండప్‌

గ్రౌండ్‌  అప్‌

పనిలేని దొంగ!
వర్జీనియాలోని వేనెస్‌బరో పోలీసులు, ఆ గ్రామ ప్రజలు కొద్ది రోజులుగా ఒక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడు దొరికితే ఒక పట్టుపడదామని చూస్తున్నారు! అయితే ఆ ఆగంతకుడు దొరకడం లేదు సరి కదా, అతడు దొంగిలించి తీసుకెళుతున్న పెంపుడు పిల్లులు మాత్రం సాయంత్రానికో, రెండో రోజు ఉదయానికో క్షేమంగా ఇళ్లకు చేరుతున్నాయి?! మామూలుగా ఇల్లు చేరిన పెంపుడు పిల్లిని ఎవరూ పట్టించుకోరు. మహా అయితే.. ‘ఎక్కడ తిరిగొచ్చావే’ అని ముద్దుగా కోప్పడతారు. అయితే ఈ పిల్లులు.. పొట్ట కింద, కాళ్ల మధ్య భాగంలో వెంట్రుకలు లేకుండా ఇంటికి తిరిగొస్తున్నాయి. అంటే.. ఎవరో వీటికి షేవ్‌ చేసి పంపిస్తున్నారు. అది కూడా ఆ ఒక్క భాగంలో. ఇలా.. ఏడు సంఘటనలు వరసగా జరగ్గానే.. ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చి, అగంతకుడిపై నిఘా వేశారు. లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ దొంగ దొరకలేదు.

వాడి ఉద్దేశం ఏమిటో కూడా అంతచిక్కడం లేదు. పనిలేక పిల్లి తల గొరగడం అనే సామెత ఉంది. ఇక్కడ పనిగట్టుకుని ఆ దొంగ గొరిగి పంపిస్తున్న తీరు వేనెస్‌బరో పిల్లుల యజమానులకు కోపంతో పాటు నవ్వూ తెప్పిస్తోందట! ఇంకో సంగతి ఏంటంటే... బయటికి వెళ్లి, షేవింగ్‌ తో వచ్చిన పిల్లులు కాస్త నర్వస్‌గా బిహేవ్‌ చేస్తున్నాయట. ఆ దొంగ ఎవరో దొరికితే అంతా కలిసి అతడికి తల గొరిగించేలా ఉన్నారు.

అల్లారు ముద్దు పాపాయి
అతడి పేరు బిలాల్‌ వాక్‌. ఆమె పేరు ఎలిజబెత్‌ హ్యాండీ. వాళ్లిద్దరికీ ఓ ముద్దుల కూతురు. వయసు 22లలు. ఇంకా పేరు పెట్టలేదు. చీకూచింతా లేని ఈ చిన్న కుటుంబం జార్జియాలో ఉంటోంది. జార్జియా అని ఐరోపాలో ఒక దేశం ఉంది. ఆ జార్జియా కాదు. యు.ఎస్‌లో జార్జియా అనే రాష్ట్రం ఉంది. ఆ జార్జియాలో ఉంటున్నారు. పాపకు ఏ పేరైతే బాగుంటుందీ అని దంపతులిద్దరూ దీర్ఘంగా ఆలోచించారు. ‘అల్లా’ అని పేరు పెట్టారు. అయితే అధికారులు ఒప్పుకోలేదు.‘‘తల్లి పేరులో గానీ, తండ్రి పేరులో గానీ ‘అల్లా’ అని లేదు. కనుక జార్జియా చట్టాల ప్రకారం అలా కుదరదు’’ అనేశారు! బిలాల్, ఎలిజబెత్‌ షాక్‌ తిన్నారు.

‘మా పాప, మా ఇష్టం’ అన్నారు. పౌరహక్కుల వాళ్లను కలిశారు. కోర్టులో కేసు వేశారు. చివరికి ఏమైంది? కేసు గెలిచారు. వాళ్లు కోరుకున్నట్లే ‘అల్లా’ పేరిట బర్త్‌ సర్టిఫికెట్‌ వచ్చింది! అయితే ఇలా అల్లా అనే పేరు ఓకే చెయ్యడం అక్కడి ముస్లిం పెద్దలు కొందరికి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ ముస్లింలు కానప్పుడు బిడ్డకు ముస్లిం పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.

కోటి... టైటానిక్‌ కోటు!
ఫర్‌ కోట్‌.. అంటే.. జంతువుల చర్మంతో చేసిన కోటు. ఆ కోటు ఒకటి ఈవారం యు.కె. వేలంలో 1,50,000 పౌండ్లకు (కోటీ 24 లక్షల 76 వేల రూపాయలు) అమ్ముడుపోయింది. అది వందేళ్ల క్రితం నాటిది. అప్పుడు దాని ధర 80,000 పౌండ్లు. అంటే ఇప్పటి విలువ ప్రకారం 66 లక్షల 54 వేల రూపాయలు. వందేళ్ల క్రితం నాటిది అవడం ఒక్కటే ఈ కోటు ప్రత్యేకత కాదు. మాబెల్‌ బెనెట్‌ అనే 33 ఏళ్ల మహిళ కోటు అది. ఆమె ఆ కోటును «ధరించి 1912లో టైటానిక్‌ నౌక ఎక్కారు. ఆ ప్రయాణంలో నౌక మునిగిపోవడం, సుమారు 1500 మంది మరణించడం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బతికి బట్టకట్టినవాళ్లులో మాబెల్‌ ఒకరు. ఆ తర్వాత ఆమె తన 96 ఏళ్ల వయసులో 1974లో సహజ మరణం పొందారు. అంతకాలం బతికి ఉన్న టైటానిక్‌ మహిళా సిబ్బంది ఈమె ఒక్కరే. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో ఈ కోటుకు అంత విలువ దక్కింది.  

సూర్యుడు చంద్రుడౌతాడు!
వచ్చే జూన్‌లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఆ సందర్భంగా యు.ఎస్‌. తపాలా శాఖ త్వరలో ‘టచ్‌ స్టాంప్‌’లను విడుదల చేయబోతోంది. వేలితో ఆ తపాలా బిళ్లను టచ్‌ చేస్తే చాలు.. ఆ వేలు వేడికి గ్రహణం పట్టిన సూర్యుడు.. నిండు చంద్రుడిగా మారిపోతాడు. స్టాంప్‌ పై నుంచి వేలు తీయగానే మళ్లీ గ్రహణం పట్టిన సూర్యుడు ప్రత్యక్షమైపోతాడు. ‘టెంపరేచర్‌ సెన్సిటివ్‌ ఇంక్‌’ను ఉపయోగించి ఈ టచ్‌ స్టాప్‌ను తయారుచేస్తున్నారు. ఈ 49 సెంట్ల విలువగల స్టాంపు జూన్‌లో బయటికి వస్తుంది.

మరిన్ని వార్తలు