కన్నడంలోకి ప్రజాకవి వేమన

11 Nov, 2019 01:01 IST|Sakshi
డాక్టర్‌ ఎన్‌.గోపి

అనువాదం 

డాక్టర్‌ ఎన్‌.గోపి పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం ‘ప్రజాకవి వేమన’ కన్నడ భాషలోకి అనువాదమైంది. ధార్వాడ్‌ కర్ణాటక విశ్వవిద్యాలయంలోని మహాయోగి వేమన పీఠం వారు ఇటీవలే దీనిని ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు డాక్టర్‌ ఆర్‌.శేషశాస్త్రి అనువాదకులు. కర్ణాటక విశ్వవిద్యాలయం కులపతి(కులపతి గళు) ప్రొఫెసర్‌ ప్రమోద భీగాయ ముందుమాట రాస్తూ– కన్నడంలోని సరజ్ఞునిలాగే వేమన ఒక ‘జనపర కవి’(ప్రజాకవి), సంత కవి(యోగి కవి) అనీ, అతని పైన ప్రామాణిక పరిశోధనతో వెలువడిన గ్రంథాన్ని తెలుగులోకి తెచ్చుకోవడం ముదావహమనీ అన్నారు.

ఇంతవరకు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలన్నింటి నుంచి దాదాపు నాలుగు వేల థీసీస్సులు వచ్చాయని అంచనా. వాటిలో ఇరవై దాకా మాత్రమే ప్రామాణికమై, పఠన పాఠవాల్లో నలుగుతూ, ఉటంకింపుల కాలవాలమై పరామర్శ గ్రంథాలుగా నిలిచాయని కాలం చెబుతున్న తీర్పు. వాటిలో ప్రజాకవి వేమన ఆరు ముద్రణలు పొందడం ఒక రికార్డు. ఇది తొలిసారి 1980లో అచ్చయింది. అచ్చుపుస్తకాలతో ఆగక తాళపత్ర గ్రంథాల మూలాల్లోకి వెళ్లి, విశేష పరిశ్రమ కోర్చి తీర్చిన రచనగా గౌరవానికి నోచుకుంది. ఈ పరిశోధనతో ‘వేమన గోపి’ అంటూ వేమన ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చేసిన పని పరంగా ప్రసిద్ధి కలగడం ఆ పని నాణ్యతకూ దానికి లభించిన పాఠకాదరణకూ నిదర్శనం.

ఇక కన్నడానువాదానికి అనుకూలమైన నేపథ్యాన్ని గురించి ఒకటి రెండు మాటలు. 17వ శతాబ్దానికి చెందిన వేమన దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాడనడానికి దాఖలాలున్నాయి. ముఖ్యంగా కన్నడ దేశంలో. ఉత్తర కర్ణాటక, బళ్లారి, కొలార్‌ జిల్లాలు, బెంగళూరు ప్రాంతాల్లో ఎందరో తెలుగు వారున్నారు. ఎన్నో వేమన ఆశ్రమాలున్నాయి. లక్షల సంఖ్యలో వేమన భక్తులున్నారు. 10, 12 తరాలుగా తెలుగు మరిచిపోయినా వేమనను ఆరాధిస్తున్నారు.

అల్లర చిల్లరగా తిరిగే వేమన్న మనసు మార్చి యోగిగా పరివర్తనకు కారణమైన వేమన్న వదిన ‘వేమారెడ్డి మల్లమ్మ’ కన్నడ దేశంలో నిత్యపూజలు అందుకుంటున్నది. వేమన్న ప్రేమికులు కర్ణాటకలో ఇప్పుడదొక ఓటుబ్యాంకు. గోపి గారు బెంగళూరులోని విధాన సౌధలో వేమనపై యావత్‌ ప్రజాప్రతినిధుల ముందు ప్రసంగించి, అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా సన్మానం పొంది వచ్చారు. అప్పటి రెవెన్యూ మంత్రి హెచ్‌.కె.పాటిల్‌ చొరవతోనే వేమన పీఠం స్థాపన జరిగింది. ఆయన పినతండ్రి ఎస్‌.ఆర్‌.పాటిల్‌ 400 వేమన పద్యాలను కన్నడంలోకి అనువదించారు. యోగి జీవితం గడిపారు.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఉత్తర భారతదేశంలో ఆ మాటకొస్తే యావద్భారతంలోనే కబీరుకున్న ప్రాచుర్యం మరే కవికీ లేదు. హిందీలో ఉండటం వల్ల కూడా అది సాధ్యమైంది. వేమన పద్యాలు కబీరు దోహాల కన్న ఏమాత్రం తక్కువవి కావు. కాని వేమన దురదృష్టం ఏమిటోగాని ఆయన ఇంటినే సరిగ్గా గెలవలేక పోయాడు. తెలుగు సమాజమంతా ఆత్మవిమర్శ చేసుకోవలసిన విషయమిది. వేమన హిందీలోకి అనువదించబడితే అఖిల భారత కవిగా మారిపోతాడు. కబీరు, వేమన ఇద్దరూ సంత్‌ కవులే. వేషధారులను దునుమాడి తాత్త్విక స్పష్టత కోసం పాటుపడిన వారే. ముఖ్యంగా నేటితరం జీవన సంక్షోభంలో పడి కొట్టుకుపోతున్న తరుణంలో వేమన్న ప్రబోధాల అవసరం చాలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని సాహితీ సాంస్కృతిక సంస్థలు దీనిపై దృష్టి పెట్టవలసి ఉంది.
-డాక్టర్‌ గిన్నారపు ఆదినారాయణ

మరిన్ని వార్తలు