దర్శనభాగ్యం

10 Nov, 2018 00:59 IST|Sakshi

దొరికినప్పుడే 

‘‘నిజంగా భక్తులైనవారు ఆలయ ఆచారాలకూ కట్టుబడి ఉంటారు’’ అని ‘రెడీ టు వెయిట్‌ (..టిల్‌ మెనోపాజ్‌)’ క్యాంపెయిన్‌ సభ్యులు అంటున్న మాటకు క్రమంగా మద్దతు లభిస్తోంది. మహిళలకూ శబరిమల ఆలయ దర్శనం కల్పించాలని కోర్టును ఆశ్రయించిన వారికి వ్యతిరేకంగా రెండేళ్ల క్రితం మొదలైన సోషల్‌ మీడియా ఉద్యమమే ‘రెడీ టు వెయిట్‌’. 

దివిపైన దేవుడు ఉంటే, భువిమీద న్యాయస్థానాలు ఉంటాయి. గుడి మెట్లు, కోర్టు మెట్లు.. ఎప్పుడు ఏ మెట్లు అవసరమైతే ఆ మెట్లు ఎక్కుతుంటారు మనుషులు. అయితే.. దేవుడు వినడమే తప్ప తీర్పులు ఇవ్వడు. కోర్టులు తీర్పులు ఇవ్వాలి కనుక వినక తప్పదు. ఎమీల్‌ రాటెల్‌బ్యాండ్‌ నెదర్లాండ్స్‌లో కాస్త పేరున్న మోటివేషనల్‌ స్పీకర్‌.  ఎమీల్‌ పుట్టింది 1949 మార్చి 11న. ఆ డేట్‌ని 1969 మార్చి 11గా మార్పించుకోవాలనుకున్నాడు. దేవుడు వరాలు ఇమ్మంటే ఇస్తాడు కానీ, డేటాఫ్‌ బర్త్‌ని మార్చమంటే మారుస్తాడా? కనుక కోర్టుకు వెళ్లాడు ఎమీల్‌. ‘నాకిప్పుడు 69 ఏళ్లు. కానీ 49 ఏళ్లకు మించి ఉండవని అందరూ నన్ను చూసి ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇరవై ఏళ్లు చిన్నవాడిలా కనిపిస్తానట. లీగల్‌గా కూడా మీరు నా వయసును తగ్గిస్తే డేటింగ్‌ సైట్‌ ‘టిండర్‌’లో నా అవకాశాలు మెరుగవుతాయి. నా వయసు అరవై తొమ్మిది అని ప్రొఫైల్‌లో ఉండడంతో ఎవరూ నా వైపే చూడడం లేదు. కనుక నా ఏజ్‌ని తగ్గించండి’ అని విన్నవించుకున్నాడు. (అప్పటికే అతడు ఏడుగురు పిల్లల తండ్రి). కోర్టు వెంటనే ఏం అనలేదు. కోర్టులు కూడా ఏం చేయాలో పాలుపోక దేవుడి వైపే చూస్తాయి. దేవుడి వైపు చూడ్డం అంటే.. ‘ఇప్పుడు కాదు పొండి’ అని చెప్పి పంపేయడం. 

ఇటీవల ఇలాగే మన సుప్రీంకోర్టు.. అయోధ్య కేసు వాయిదాకొస్తే.. ‘ఇప్పుడేం తొందరొచ్చిపడింది, మళ్లెప్పుడైనా చూద్దాం’ అని కేసును మళ్లీ వాయిదా వేసింది. భక్తులు తీవ్రంగా నొచ్చుకున్నారు. అయోధ్యకు తొందరలేదు కానీ, శబరిమలకు తొందరొచ్చిందా?! అయోధ్యకు తొందరలేదు కానీ వివాహేతర సంబంధాలకు తొందరొచ్చిందా?! అయోధ్యకు తొందరలేదు కానీ ఎల్జీబీటీ హక్కులకు తొందరొచ్చిందా.. అని గుదులుకున్నారు. కోర్టు తీర్పుపై గుదులుకోవడమే ఉంటుంది. ఎదురు తిరగడం ఉండదు. కానీ శబరిమల ఎదురు తిరిగింది! పదీ – యాభై ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలు, యువతులు, మహిళలు కూడా శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చు అని సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు నుంచీ కేరళ ఆధ్యాత్మిక అస్థిమితంతో ఉంది. లోపలికి వెళ్లే ప్రయత్నాలు, వెళ్లనివ్వని ప్రతిఘటనలతో అక్టోబర్‌ 17 నుంచి 22 వరకు, తిరిగి నవంబర్‌ 5న, 6న.. అరుపులు, కేకలు, నినాదాల మధ్యే ఆలయ పూజలు జరిగాయి. కేరళలో ఉన్నది సి.పి.ఎం. నాయకత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం. పూజలు ఎలా జరిగినా, కోర్టు తీర్పు ఉల్లంఘన మాత్రం జరక్కుండా చూడ్డం తన బాధ్యత అనుకుంది. శబరిమల బరిలోకి దిగిన మహిళా హక్కుల కార్యకర్తలకు, మహిళా నాస్తికులకు, మహిళా జర్నలిస్టులకు రక్షణ కల్పించింది. ఓ ఐదొందల మంది మహిళా పోలీసు సిబ్బందిని కూడా నియమించింది. వాళ్లంతా యాభై ఏళ్లు నిండినవారే! ఒక విధంగా ప్రభుత్వం ఆలయ నియమాలను గౌరవించడం ఇది. వాళ్లు భక్తులు కాదు కాబట్టి, విధినిర్వహణలో ఉన్నవారు కాబట్టి అలా ఆలయ మర్యాదల్ని పాటించడం కేరళ ప్రభుత్వానికి సాధ్యమైంది. 

అయితే తీర్పు తర్వాత గుడిని తెరిచిన ఎనిమిది రోజుల్లోనూ సామాన్య మహిళా భక్తులెవరూ దర్శనానికి రాలేదు! నవంబర్‌ 5న ఒక మహిళ ‘పంబ’ వరకు వచ్చింది కానీ.. ఆమె భక్తితో రాలేదు. భర్త తనను బలవంతంగా ఈడ్చుకొచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది. ఆ భర్త సీపీఎం కార్యకర్త. అలప్పుళ జిల్లాలోని స్థానిక సీపీఎం నాయకుడి సోదరుడు. అక్టోబర్‌ 17న ఆలయ ద్వారాలు తెరిచిన తొలిరోజే సి.ఎస్‌.లిబీ అనే మహిళ తను శబరిమలకు వెళ్లి తీరుతానని ప్రకటించింది. ఆ ముందురోజే ఆమె అయ్యప్ప మీద తనకు నమ్మకం లేదని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది! అయినప్పటికీ శబరిమల వెళ్తాననీ, అది తనకు కోర్టు ఇచ్చిన హక్కు అని మళ్లీ ఒక ప్రకటన చేసింది. తర్వాత ఏమైందో తెలియదు. శబరిమలను ఆమె దర్శించుకోనే లేదు. అక్టోబర్‌ 18న ఒక మహిళ ఆలయ పరిసరాలకు కొద్ది దూరంలో తనకు రక్షణ కావాలని పోలీసులను అడుగుతూ కనిపించారు. ఆమె పేరు సుహాసినీ రాజ్‌. న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌. 19న మరొక మహిళ దర్శనం ఇచ్చారు. అమె కూడా దర్శనం కోసం వచ్చిన మహిళ కాదు. ఓ తెలుగు టీవీ చానల్‌ రిపోర్టర్‌. సుహాసిని లాగే, ఆమె కూడా కవరేజ్‌ కోసం వచ్చారు. తర్వాత రెహానా ఫాతిమా అనే కార్యకర్త శబరిమల కొండ ఎక్కారు కానీ, పద్దెనిమిది మెట్లకు (పత్తినెట్టం పడి) రెండొందల మీటర్ల దూరంలో నందపంతాళ్‌ దగ్గరే నిరసనకారులు ఆమెను ఆపేశారు. ఇంకో మహిళ మేరీ స్వీటీ తను నిజంగానే దైవదర్శనానికి వచ్చానని బతిమాలినా, భద్రత కారణాలతో పోలీసులు ఆమెను పంబ దగ్గర్నుంచే వెనక్కు పంపించేశారు. మరి ఆలయమార్గ ముఖద్వారాల దగ్గర గుంపులు గుంపులుగా కనిపిస్తున్న వేలాది మంది మహిళలు ఎవరు? ఎవరంటే.. కోర్టు తీర్పుపై, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నవారు. ‘‘నిజంగా భక్తులైనవారు ఆలయ ఆచారాలకూ కట్టుబడి ఉంటారు’’ అని ఆ గుంపుల్లోని ‘రెడీ టు వెయిట్‌ (టిల్‌ మెనోపాజ్‌)’ క్యాంపెయిన్‌ సభ్యులు అంటున్న మాటకు క్రమంగా ఇప్పుడు మద్దతు లభిస్తోంది. 

శబరిమలలో ఈ నెల 16 నుంచీ మళ్లీ గుడి తలుపులు తెరుచుకోబోతున్నాయి. డిసెంబర్‌ 27 వరకు పూజలు జరుగుతాయి. చివరి రోజు మండల పూజ. 30న మళ్లొకసారి తెరుస్తారు. తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి దర్శనం. Ô¶ రణు ఘోషలోని పారవశ్యానికి మాత్రమే అలవాటు పడిన పెరియార్‌ అభయారణ్యంలోని పులులకు, ఏనుగులకు ఈ ఏడాది కొత్తగా రణఘోష కూడా కలిసి వినిపించవచ్చు. ఏమిటి పరిష్కారం? ప్రస్తుతానికైతే ఏం లేదు! ఎమీల్‌ రాటెల్‌బ్యాండ్‌ కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నాడు కదా.. అలా, ఆలయదర్శన యోగ్యత వయసుకు తగినట్లుగా తమ వయసును పదేళ్ల లోపుకు తగ్గించుకోడానికో, యాభై ఏళ్లకు పైబడినట్లుగా పెంచుకోడానికో అనుమతి ఇవ్వమని ఎవరికివాళ్లు వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకోవాలి. ఎమీల్‌ కేసును నెదర్లాండ్స్‌ కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. తీర్పొచ్చాక చూడాలి.. మనకేమైనా కేస్‌ స్టడీగా పనికొస్తుందేమో! 
మాధవ్‌ శింగరాజు
∙  

మరిన్ని వార్తలు