చలువ చేసే సబ్జా...

20 May, 2016 23:06 IST|Sakshi
చలువ చేసే సబ్జా...

తిండి గోల
 

ఎండాకాలం వస్తే చాలామంది చేసే పని సబ్జాగింజలు నానబెట్టిన నీటిని తాగడం. సబ్జా నీళ్లు తాగితే వేసవి తాపం తగ్గి, వంటికి చలవ చేస్తుందని పెద్దవాళ్లు చెబుతారు. చూడ్దానికి ఆవాలను లేదా తోటకూర విత్తనాలను పోలి ఉండే ఈ సబ్జాగింజలకు ఔషధాలకు రాజువంటిదని పేరు. ఆంగ్లంలో బాసిల్ సీడ్స్ అని పిలుస్తారు. తులసిలో కృష్ణతులసి, లక్ష్మీతులసి, రామ తులసి రకాలున్నట్లుగానే దీనిలో కూడా లెమన్ బాసిల్, కేంఫర్ బాసిల్, పర్పుల్ బాసిల్.. ఇలా ఇంకా చాలా రకాలున్నాయి. తెలుగువారు దీనిని రుద్రజడ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఐదువేల ఏళ్ల క్రితమే సబ్జాగింజలను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. అయితే దీని గురించి మన దేశంలోకంటే గ్రీకు కవులు, రచయితల వర్ణనల్లోనే అధికంగా కనిపిస్తుంది. మన వంటల్లో కొత్తిమీర, కరివేపాకు వేసినట్లు ఇటాలియన్లు దీనిని తమ వంటకాలలో సువాసన కోసం వాడతారు.


అంతేకాదు; ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం, లావోస్, తైవాన్ దేశాల్లో కూడా ఇది ప్రధాన సుగంధ ద్రవ్యం. కొన్ని దేశాల్లో దీనిని హోలీ బాసిల్ పేరుతో మనం తులసి మొక్కను పూజించినట్లు దీనిని ఆరాధిస్తారు. తేలు కుట్టినప్పుడు దీని ఆకులను నలిపి, కట్టు కడితే ఉపశనమం లభిస్తుందంటారు. పూర్వం దీన్ని రాజవైద్యులు తాము తయారు చేసే ఔషధాలలో వాడేవారట. అందుకే దీన్ని ఔషధాలలో రాజుగా కీర్తిస్తారు. ఊబకాయం కలవారు సబ్జాగింజలను నానబెట్టిన నీటిని పడుకోబోయే ముందు తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొన్ని రకాల శీతలపానీయాల్లోనూ, ఐస్‌క్రీముల తయారీనూ వీటిని విరివిగా ఉపయోగిస్తారు.

మరిన్ని వార్తలు