దేవుడి కంటే పెద్దది

12 Sep, 2018 00:12 IST|Sakshi

చెట్టు నీడ

‘‘నా కుమారునికి సంతానం లేనందువల్ల నాకు దుఃఖంగా ఉంది. దయచేసి వాడికి పిల్లలు కలిగేలా చూడు స్వామీ’’  అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అదీ ప్రసాదించాడు.

సంతానం లేని ఒక వ్యక్తి పరమేశ్వరుడిని ప్రార్థించి, ఆయన కృపతో సంతానాన్ని పొందాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు పాలు తాగక బాధపెడుతుంటే, పరమేశ్వరుని తిరిగి ఇలా ప్రార్థించాడు. ‘‘దేవా! పుత్రుణ్ణి ఇచ్చావు. కాని వాడు పాలు తాగడం లేదు. ఎలా?’’ అని! పరమేశ్వరుడు ప్రత్యక్షమై అలాగే వాడు పాలు తాగుతాడని వరమిచ్చాడు. పిల్లాడు పాలు తాగడం మొదలు పెట్టాడు. పెరిగి అల్లరి పిల్లవాడయ్యాడు. తండ్రి మళ్లీ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు బాలుడు అల్లరి మానతాడని వరమిచ్చాడు. ఈసారి వాడు మరీ మౌనంగా ఉండటం మొదలు పెట్టాడు. దాంతో తండ్రికి భయం వేసి మళ్లీ పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుని కృపతో తిరిగి మామూలయ్యాడా బాలుడు. అలా చాలాసార్లు ప్రార్థించిన తర్వాత వాడు పెద్దవాడై, ఉద్యోగాన్ని సంపాదించుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈసారి వాడికి సంతానం లేదు. తండ్రి మళ్లీ పరమేశ్వరుని ప్రార్థించాడు. ‘‘నా కుమారునికి సంతానం లేనందువల్ల నాకు దుఃఖంగా ఉంది. దయచేసి వాడికి పిల్లలు కలిగేలా చూడు స్వామీ’’ అని. పరమేశ్వరుడు అదీ ప్రసాదించాడు. 

అటువంటి ప్రార్థనలకు అంతు ఉండదు. ఉన్న దానితో తృప్తి కలగదు. అందుకే మన పూర్వీకులు ముందే చెప్పారు. రూపాయి ఉన్నవాడికి వంద కావాలి. వంద ఉన్నవాడికైతే వేయి కావాలి. వేయి ఉన్న వాడికి లక్ష కావాలి. లక్ష ఉన్నవాడికి రాజు కావాలని ఉంటుంది. రాజుకు కుబేరుడు కావాలనీ, కుబేరుడికి ఇంద్రుడు కావాలనీ, ఇంద్రుడికి బ్రహ్మ కావాలనీ, బ్రహ్మకు విష్ణువు కావాలనీ, విష్ణువుకు శివుడు కావాలనీ... ఇలా కోరికలకు అంతెక్కడ?’’ పర్వతం పెద్దది. దానికంటే పెద్దది సముద్రం. దానికంటె పెద్దది ఆకాశం. దానికంటె పెద్దవాడు దేవుడు. దేవుడికంటె పెద్దది కోరిక. అసంతృప్తి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం కోసమే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు ఇక కోరికలే ఉండవు. 
– శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి

మరిన్ని వార్తలు