విషాద రాగం

17 Aug, 2014 22:58 IST|Sakshi
విషాద రాగం
  • ఫొటో స్టోరీ
  • కాంతులు నిండాల్సిన కళ్లల్లో నీరు పొంగి పొర్లుతోంది. చురుకుతనం ఉండాల్సిన చూపుల్లో దైన్యత చోటు చేసుకుంది. పాలుగారాల్సిన ముఖం కన్నీటి వరదలో తడిసి ముద్దయ్యింది. హుషారుగా కదలాల్సిన చేతులు వాయులీనపు తీగెలపై విషాద రాగాలను వాయిస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన ఎవరి మనసైనా చలించకుండా ఉంటుందా? ఆ చిట్టితండ్రి బాధ చూసినవారెవరి కన్నయినా చెమ్మగిల్లకుండా ఉంటుందా?!
     
    బ్రెజిల్‌కి చెందిన ఈ చిన్నారి పేరు... డీగో ఫ్రాజో టార్‌క్వాటో. పేదరికంలో పుట్టాడు. బాధల్లో పెరిగాడు. అలాంటి సమయంలో వారి ప్రాంతానికి జాన్ ఎవాండ్రో డిసిల్వా అనే వ్యక్తి వచ్చాడు. ఆయన డీగో లాంటి పిల్లలందరినీ చేరదీశాడు. వారికి అండగా నిలిచాడు. సంగీతం నేర్పించాడు. ప్రదర్శనలు ఇప్పించాడు. ఉపాధి మార్గాన్ని ఏర్పరచి పేదరికాన్ని దూరం చేశాడు. కానీ ఆయన ఉన్నట్టుండి అనారోగ్యంతో మరణించాడు.

    అది తట్టుకోలేకపోయారు ఆ చిన్నారులు. ముఖ్యంగా డీగో కదలిపోయాడు. తమ మాస్టారిని సమాధి చేస్తుంటే తన స్నేహితులతో కలిసి సంగీతాంజలి ఘటించాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఇలా కన్నీటి పర్యంతమయ్యాడు. అంతకన్నా విషాదం ఏమిటంటే... ఇది జరిగిన మూడేళ్లకి డీగో కూడా మరణించాడు... లుకేమియాతో!
     

మరిన్ని వార్తలు