ఇంటిపంటల చుట్టూ ప్రదక్షిణలు!

24 Dec, 2019 15:55 IST|Sakshi
మూసాపేట భవానినగర్‌లోని తమ టెర్రస్‌పై  ఇంటిపంటల పనుల్లో నిమగ్నమైన శ్రీనివాస్, లావణ్య

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం 11 నెలలుగా సేంద్రియ ఇంటిపంటలు పెంచుకుంటూ, వాటి చుట్టూ వాకింగ్‌ (ప్రదక్షిణలు) చేస్తున్నారు హైదరాబాద్‌లోని మూసాపేట భవాని నగర్‌కు చెందిన అంబటి శ్రీనివాస్, లావణ్య దంపతులు. ఇంటిపైనే గ్రోబాగ్స్, సిల్పాలిన్‌ బెడ్స్‌లో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ.. రోజూ ఉదయం గంట సేపు వాటి చుట్టూ వాకింగ్‌ చేస్తున్నారు. ఆకుకూరలు ఇబ్బడి ముబ్బడిగా పండిస్తూ నలుగురున్న తమ కుటుంబం తింటూ ఇరుగు పొరుగు వారికీ పంచిపెడుతున్నారు. 

వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండే ఆయన ‘సాక్షి’ దినపత్రికలో ఇంటిపంట కథనాలను చదివి స్ఫూర్తి పొంది, తమ ఖాళీగా ఉన్న టెర్రస్‌పై సేంద్రియ కూరగాయల సాగుకు ఉపక్రమించారు. ఉద్యాన శాఖ సూచనలతో 1200 చదరపు అడుగుల టెర్రస్‌పై రూ. 70 వేల ఖర్చుతో ఇంటిపంటల సాగు ప్రారంభించారు. వంద చిన్న గ్రోబ్యాగ్‌లు, 10 పెద్ద గుండ్రటి సిల్పాలిన్‌ బెడ్స్‌ను ఏర్పాటు చేసి మట్టి, కొబ్బరిపొట్టు, సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని నింపి రకరకాల పంటలు పండిస్తున్నారు. పిట్టగోడ నుంచి 3 అడుగులు వాకింగ్‌కోసమని ఖాళీగా వదిలేసి, మధ్యలో గ్రోబాగ్స్, బెడ్స్‌లో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. 
రోజూ ఉదయం ఇంటిపంటల చుట్టూ గంట సేపు వాకింగ్‌ చేసి, తర్వాత ఇంటిపంటల పనులు చేసుకుంటున్నామని శ్రీనివాస్, లావణ్య లిపారు. ఆ తర్వాత మొక్కలకు నీరు పెట్టడం, కలుపు మొక్కలను, ఎండిన ఆకులను ఏరివేయడం వంటి పనులు చేస్తున్నామన్నారు. ఇంటిపంటల పనులు పూర్తికావడంతోపాటు తమకు తగిన వ్యాయామం కూడా దొరుకుతోందని వారు పేర్కొన్నారు. నిత్యం పచ్చని ఆకుకూరలను, కూరగాయ మొక్కలను చూస్తూ ఉదయం వాటితో గడపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 


టెర్రస్‌పై గ్రోబాగ్స్‌లో ఇంటిపంటలు

పాలకూర, చుక్కకూర, మెంతి, సోయా, గోంగూర, కొతిమీర, కరివేపాకు, పుదీనా, తోటకూరలతో పాటు టమాట, మునగ, బీర, చిక్కుడు, ముల్లంగి, గోకరకాయ(గోరుచిక్కుడు), దోసకాయ, కాకర, క్యారెట్, సొరకాయ, క్యాలిఫ్లవర్, బీట్‌రూట్, క్యాబేజి, పచ్చిమిర్చి వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. జామ, మామిడి, సపోట, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ వంటి పండ్లమొక్కలతో పాటు గులాబి, చామంతి, బంతి, మందార, మల్లె వంటి పూలు కూడా శ్రీనివాస్, లావణ్య కిచెన్‌గార్డెన్‌లో ఉన్నాయి. కలబంద, తమలపాకు, రణపాల, వాము వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతుండటం విశేషం.  
– గుంటి వెంకటేశ్, సాక్షి, మూసాపేట, హైదరాబాద్‌

‘సాక్షి’ స్ఫూర్తితోనే ఇంటిపంటల సాగు
‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న ఇంటిపంట కధనాలను చదివి స్ఫూర్తి పొందాం. ఖాళీగా ఉన్న టెర్రస్‌పైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించుకొని తినాలని అనుకున్నాం. 11 నెలల క్రితం ఉద్యాన శాఖ నిపుణుడి సహాయంతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాం. టెర్రస్‌ గార్డెనింగ్‌ ఎంతో ఆనందానిస్తున్నది. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఆకుకూరలు తెచ్చుకొని తిని రోగాలపాలయ్యే బదులు ఇంటిపైనే సేంద్రియంగా పండించుకున్న తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటున్నాం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, బెండ, తెల్లవంగ తదితర కూరగాయాలు ఎంతో రుచిగా ఉన్నాయి. ఆకుకూరలను ఇరుగు పొరుగుకు కూడా ఆనందంగా పంచిపెడుతున్నాం.  
– అంబటి లావణ్య, శ్రీనివాస్‌ (94403 87868),  భవానీనగర్, మూసాపేట, హైదరాబాద్‌


ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

మరిన్ని వార్తలు