గ్రేట్‌ రైటర్‌ (జాన్‌ కీట్స్‌)

17 Dec, 2018 00:04 IST|Sakshi

సౌందర్యాన్ని కళ్లతో తాగిన కవి జాన్‌ కీట్స్‌(1795–1821). సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అని నమ్మిన కవి. లండన్‌లోని ఏమాత్రం సాహిత్య వాసన తెలియని అశ్వశాల నిర్వాహకుల ఇంట పుట్టాడు. పదేళ్లప్పుడు– మరణం వల్ల తండ్రికీ, మారు మనువు చేసుకుని వెళ్లిపోవడంతో తల్లికీ దూరమయ్యాడు. తమ్ముడితో పాటు అమ్మమ్మ దగ్గర పెరిగాడు. మనుషులతో మెసలుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. పుస్తకాలతో మాత్రం స్నేహం కుదిరింది. సర్జన్‌ కావాలని ఉండేది గానీ పాఠాలు వింటూ సూర్యకిరణాలతో పైకి పాక్కుంటూ వెళ్లిపోయేవాడు. తనకు సరిపడదని అర్థమయ్యాక తన సంవేదనలను అక్షరాల్లోకి అనువదించడానికి ప్రయత్నించాడు. ప్రేమను తన మతంగా ప్రకటించాడు. తర్కాలతో విసిగిపోయిన కాలంలో అనుభూతిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ‘ఎ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ ఎ జాయ్‌ ఫరెవర్‌’ అని పాడాడు. మొత్తంగా కవిత్వంలో రొమాంటిక్‌ మూవ్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహించగలిగే వాక్యం ఇది. ఇంతటి భావుకుడిని, ఇంతటి సున్నిత మనస్కుడిని మృత్యువు క్షయ వ్యాధి రూపంలో వెంటాడింది. చలి, దగ్గు, రక్తపు చుక్కలు అతడిని పిప్పి చేశాయి. ‘మరో జీవితమంటూ ఉందా? నేను మేల్కొన్నాక దీన్నంతా ఒక కలగా తెలుసుకుంటానా?’ అనుకున్నాడు. నిశ్శబ్దపు సమాధిలోకి ఒదిగిపోవాలనీ, నీటి మీద రాసిన రాతలా తన పేరు మాసిపోవాలనీ కోరుకున్నాడు. పాతికేళ్ల వయసులో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
 

మరిన్ని వార్తలు