ఉద్యమానికి ఊతంగా...

17 Dec, 2018 00:04 IST|Sakshi

సాహిత్య మరమరాలు 

సుప్రసిద్ధ పత్రికా రచయిత, సంపాదకులు ఖాసా సుబ్బారావు. ఈ పేరు జ్ఞప్తికి రాగానే గుర్తుకి వచ్చే పేర్లు: ఆంధ్రప్రభ, తెలుగు స్వతంత్ర, గోరా శాస్త్రి, పి.శ్రీదేవి, కాలాతీత వ్యక్తులు. అయితే సంపాదకత్వం కన్నా ముందు కొంతకాలం పాటు ఖాసావారు నెల్లూరు జిల్లాలో ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ప్రతిరోజూ  పాఠాలు చెప్పటం, అయిపోయాక కొంతసేపు అప్పుడు జరుగుతున్న భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి, దేశభక్తి ప్రపూరితమైన కథలు, కబుర్లు కూడా చెపుతూ విద్యార్థులలో దేశభక్తిని ప్రోది చేయటం తమ బాధ్యతలలో ఒకటిగా తలచేది ఆనాటి ఉపాధ్యాయ వర్గం (కుటుంబరావు ‘చదువు’ నవలను జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి). ఒకరోజు ఈ విధమైన తతంగం అంతా పూర్తయిందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి వెంకట సుబ్బయ్య అనే విద్యార్థి గగ్గోలుగా ఏడవటం మొదలు పెట్టాడు. ఆరా తీయగా, ఖాసా వారు ఇటు దేశభక్తి ప్రబోధం ఆరంభించే సమయానికే అటు ఆ వెంకట సుబ్బయ్యని దోమ లాంటి ఏదో పురుగు కుట్టింది. బాధ భరింపరానిదిగా ఉన్నా స్వాతంత్య్ర పోరాటానికి విఘాతం కలిగించటం ఇష్టపడని ఆ విద్యార్థి చివరిదాకా ఓపికగా ఓర్చుకుని అప్పుడు బాధ బయట పెట్టాడని తెలియ వచ్చింది. ఈ ఉదంతం కె.రామచంద్రమూర్తి సంపాదకత్వం వహించిన ‘వార్తల వెనుక కథ’లో ఉటంకించబడింది. 

మరిన్ని వార్తలు