నూట ఇరవై = నూట ఎనభై

28 May, 2018 00:33 IST|Sakshi

సాహిత్య మరమరాలు

బులుసు పాపయ్య శాస్త్రి అపర సంస్కృత పండితుడు. లౌక్యుడు. పిఠాపురం జమీందారు రావు వేంకట మహీపతి గంగాధర రామారావు బహద్దర్‌ ఆస్థానంలో ఉండేవారు. జమీందారు ఆయనకు ఒక గ్రామంలో పది పుట్ల నేలను వాగ్దానం చేశారు. ఒక పుట్టి అంటే పన్నెండు ఎకరాలు. మొత్తం 120 ఎకరాలు. భూమి ఇమ్మని థానేదారుకు హుకుం ఇచ్చారు జమీందారు. అప్పుడు థానేదారుగా దుగ్గిరాల పల్లంరాజు ఉన్నారు. ఈయన బాలాంత్రపు రజనీకాంతరావు తల్లికి మేనమామ. పాపయ్య ఈయన దగ్గరికి వెళ్లి, ఈమాటా ఆమాటా చెప్పి 180 ఎకరాలు కొలిపించుకుంటారు. ఈ విషయం  జమీందారు గారికి తెలిసింది. థానేదారును భర్తరఫ్‌ చేస్తారు. 

వెంటనే పాపయ్య జమీందారు దగ్గరికి వెళ్లి, ‘మీ దానం వెనక్కి తీసుకోండి, ఆయన్ని శిక్షించారు కదా,  నాకు భూమి వద్దు’ అని చెబుతారు.
‘నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి తొలగించాను’ అంటారు జమీందారు.
‘నాకు ఏ భాషలో పాండిత్యం ఉందని మీరు నాకు దానం ఇచ్చారు?’ అడిగారు పాపయ్య.
‘సంస్కృతం’ 
‘సంస్కృతం దేవభాషా? మానవ భాషా?’
‘దేవభాష’
‘మరి దేవతలకూ మానవులకూ కాలమానంలో తేడా ఉంటుంది కదా! మనుషుల లెక్కకు దేవతలది అర రెట్టు ఎక్కువ. దేవభాషలో ఇచ్చారు కాబట్టి నేను 120ని 180 చేశాను’ అంటారు.
ఆ గడుసుతనానికి మెచ్చి తొలగించిన థానేదారును తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు జమీందారు.

(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) 

మరిన్ని వార్తలు