అక్షరాలు మారిస్తే...

15 Oct, 2018 00:38 IST|Sakshi

సాహిత్య మరమరాలు

భోజరాజు, కాళిదాసు మధ్య జరిగినట్టుగా చెప్పే కథ ఇది. తన తర్వాత ధారానగరం ఎలావుంటుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగిన భోజుడు, ఎలావుంటుందో వర్ణించమని కాళిదాసును అడిగాడు. ‘‘మహారాజా! అమంగళకరమైన ఊహలు మంచివి కావు. నేను చెప్తే జరిగే అవకాశం కూడా ఉంది. మీ ప్రయత్నాన్ని విరమించండి’’ అన్నాడు. అయినా భోజుడు వినక ‘‘ఆజ్ఞాపిస్తున్నాను చెప్పండి’’ అన్నాడు. అప్పుడు కాళిదాసు–
అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ!
పండితా ఖండితాశ్చైవ భోజరాజేన దివంగతా!!
(భోజమహారాజు దివంగతుడు అవడం వల్ల ధారానగరం నిరాధారమైంది. సరస్వతీదేవికి ఆలంబన లేదు. పండితులందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైనారు)
అని శ్లోకం పూర్తి చేయగానే భోజుడు సింహాసనంలోనే పడిపోయాడు. సభలో కల్లోలం మొదలై,  బతికించమని ప్రార్థించారు. అంత కాళిదాసు–
అద్యధారా సదాధారా సదాలంబా సరస్వతీ!
పండితా మండితాశ్చైవ భోజరాజేన భువంగతా!!
(భోజమహారాజు భువికి దిగి రాగానే ధారానగరం ఆధారం కలిగినది అయింది. సరస్వతీదేవికి ఆలంబన కలిగి సమర్చించబడినదైంది. పండితులందరూ భాషణ భూషణాలతో సమలంకృతులైనారు.)
అని కేవలం అక్షరాల మార్పుతో శ్లోకం పూర్తి చేయగానే భోజుడు నిద్ర నుండి లేచినవానివలె సింహాసనంలో విరాజమానుడైనాడు. అందరూ కాళిదాసును, కాళీమాతను కొనియాడారు. నూతనోత్తేజం పొందిన భోజుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి రామాయణ రచన చేశాడు. అది భోజ చంపువుగా ప్రసిద్ధి పొందింది.
-డి.వి.ఎం.సత్యనారాయణ 
 

మరిన్ని వార్తలు