ఉడతే కదా అని రాయేశావో..?

6 Sep, 2015 23:01 IST|Sakshi
ఉడతే కదా అని రాయేశావో..?

 ఊచ్!

‘‘ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడికెళతా వోచ్’’ అంటూ సంబరంతో గెంతులేశాడు ఓ యువకుడు. దాన్ని  ఆటపట్టించాలని గురి చూసి దాని మీద ఓ రాయి విసిరాడు. అంతే! ఆ ఉడత కాస్తా చచ్చూరుకుంది. దాంతో అతను కటకటాలపాలవ్వాల్సి వచ్చింది. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సిటీ పార్కులో 19 ఏళ్ల ఎలిసెయ్ వ్లాదిమిరోవ్ అనే యువకుడు అనుకోకుండా ఓ ఉడతను చంపాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం మూగప్రాణులతో క్రూరంగా ప్రవర్తించినందుకు అతనికి ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. కానీ అదృష్టవశాత్తు అతనికి ప్రభుత్వ దయాభిక్ష దక్కి బయటపడ్డాడు. అయితే ఉడతనే కదా అతను చంపింది అన్న కారణంగా వదిలేయలేదు. జర్మనీ నుంచి స్వతంత్రం సంపాదించి 70 ఏళ్లు నిండిన సందర్భంగా రష్యా సంబరాలు జరుపుకుంటోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దయాభిక్షతో లక్షాయాభైవేల మంది ఖైదీలను విడుదల చేశారురు. లక్కీగా ఆ జాబితాలో వ్లాదిమిరోవ్ కూడా ఉన్నాడు.


అసలు వ్లాదిమిరోవ్ ఆ ఉడతను ఎందుకు చంపాడు అనే సందేహం వస్తుంది. ఓ రోజు ఈ యువకుడు తన స్నేహితులతో కలసి సెయింట్ పీటర్స్‌బర్గ్ సిటీ పార్కును సందర్శించడానికి  వెళ్లాడు. అందరూ ఆ ఉడతల గుంపుకు దాణా వేస్తున్నారు. అప్పుడు ఈ వ్లాదిమిరోవ్ ఓ ఉడతను చిన్న రాయితో కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక అది గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది. అక్కడే ఉన్న మరో యువకుడు జరిగినదంతా అధికారులకు చెప్పాడు. దాంతో వారు వ్లాదిమిరోవ్‌ను పోలీసులకు అప్పగించారు. వారు కూడా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా హత్యానేరం కింద కోర్టుకు పంపారు. కోర్టులో ఈ కేసు విషయమై జడ్టి, ప్రాసిక్యూటర్స్, డిఫెండెంట్స్ అందరూ విచారణ జరిపి వ్లాదిమిరోవ్‌ను నేరస్తుడిగా నిర్థారించారు. పార్కులో ఉడతను చంపడం చూసిన యువకుడు బలమైన సాక్షిగా నిలవడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు.

బహుశా వ్లాదిమిరోవ్ ఓ పదిసార్లైనా నక్క తోక తొక్కుంటాడు. అందుకే అతను అరెస్టు అయిన కొన్ని రోజులకే రష్యా విక్టరీ డే వచ్చింది. ప్రతి ఏడాది లాగే దయాభిక్ష కింద మొదటిసారి నేరం చేసిన వారిని, అయిదేళ్ల లోపు జైలు శిక్ష పడినవారిని ప్రభుత్వం విడుదల చేసింది. అసలు వ్లాదిమిరోవ్ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది 70 ఏళ్ల కిందట రష్యా విముక్తికోసం పాటుపడిన వారికి. ఇలా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుణ్యమా అని ఈ వ్లాదిమిరోవ్ జైలు నుంచి దేవుడా అంటూ బయట పడ్డాడు.
 

 
 

మరిన్ని వార్తలు