ఏ వరమూ ఆశించని కఠోర తపస్వి

11 May, 2020 08:32 IST|Sakshi

వర్ధంతి

సైదాచారి తన కవిత్వంలో పలవరించిన స్త్రీ ప్రతి పురుషుడి లోపల ఉండే మహిళా ప్రతీక. తాను కోరుకునే ఆమెను తానే సృష్టించుకుని ఆమెతో దగ్గరితనాన్నీ దూరపుతనాన్నీ చిత్రించుకున్నాడు.

స్మృతి రాత నరకం. లేనిమనిషి గురించి ఉన్నప్పటి ఆత్మీయ ఉనికిని ఉన్నట్టుగానే అనుభవించే స్థితిని ఉన్నారన్న అనుభూతిలోంచే చూడాల్సిరావడం కచ్చితంగా నరకమే. యుగయుగాలు గుర్తుండిపోవాలన్న ధ్యేయంతోనే ఎవరైనా జీవితాంతం జీవించాలి. సైదాచారిది ప్రయత్నపూర్వం కాదు కానీ గుర్తుండిపోవడాన్ని మాత్రం సాధించేశాడు. నిజం చెప్పాలంటే ఇంకా గాఢంగా గుర్తుండిపోవాల్సిన సైదాచారి కవిత్వాన్ని అర్హమైన మోతాదులో సాహిత్యలోకం గుర్తించలేదు.

సైదాచారిని మొదటిసారి చూసినపుడు  ఇతని ముఖంలో నవ్వు ఎందుకో అమరదు అనిపించింది. ముఖనిర్మాణంలోనే ఆ అమరని లక్షణం ఉండి ఉండాలి లేదా జీవితంలో మోయలేనంత విషాదాన్ని దిగమింగుతూ కూడా చేసే నవ్వే ప్రయత్నం వల్ల అలా అనిపిస్తూ ఉండి ఉండాలి అనుకుని తననే ఓసారి అడిగేశా. అదే అమరని నవ్వులాంటిది వదిలి సమాధానం దాటేశాడు.
సైదాచారి కవిత్వం నాకు నచ్చడానికీ, కవిగా సైదాచారి మీద నాకు ఇష్టం ఉండటానికీ నాకు నా మీద ఉన్న ప్రేమే కారణం. నేను ఎలా కవిత్వం రాస్తానో, నేను ఎలా రాయాలనుకుంటానో అదే అలవరుసలపై సైదాచారి కూడా రాయడం ప్రధాన కారణం. కవుల కవిత్వ పరికరాలైన నిత్య పదజాలాన్ని విసర్జించడం, అలతి అలతి మాటలతో కవితను మార్దవంగా మార్చే మోసానికి దూరంగా ఉండడం, ఇతివృత్తం ఎంపికలో నీళ్లు నమలకపోవడం, స్త్రీ చుట్టూ అల్లుకున్న తనదైన మోహాన్ని వ్యక్తీకరించడానికి శషభిషలు పడకపోవడం, కవితా నిర్మాణానికి సంబంధించి గత నియమాలను ఎడాపెడా కూల్చిపారేయడం, కవిత్వ ప్రకటనానంతర పరిణామాల లాభనష్టాలను బేరీజు వేసుకుని కవిత్వాన్ని తయారుచేసే దృష్టి లేకపోవడం సైదాచారిలో ఉన్న  నా లక్షణాలు కావడంతో అయిల కవిత్వమంటే నాకు ఇష్టంగా ఉండేది. సైదాచారిలో బాగా నచ్చే ఇంకో లక్షణం అర్థం కావడం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకపోవడం. చాలా సందర్భాల్లో కవితను అలా కలవరిస్తూ వెళ్లిపోతాడే తప్ప ఎక్కడా ప్రయత్నపూర్వక నిర్మాణ తాపత్రయం ఉండదు. ప్రతి జీవితంలో ఉండే వైఫల్యాలు, ప్రేమరాహిత్యం, బతుకు లోపలి ఎత్తుపల్లాలు ఎగుడు దిగుళ్లు, చేతకానితనాలు, రొడ్డకొట్టుడు తనాలకు సంబంధించిన లోతులన్నింటినీ తన కవిత్వంలో స్పృశించాడు సైదాచారి.
సైదాచారికి రావల్సినంత గుర్తింపు రాలేదని నేను ఆందోళన వ్యక్తం చేశాను కానీ నిజానికి సైదాచారి ఎప్పుడూ గుర్తింపును దురాశించలేదు. అయితే గుర్తింపుకు సంబంధించి సైదాచారి గత కవులెవరూ సాధించలేని ఒక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమకాలీనులు మెచ్చరే అన్న నానుడిని సైదాచారి అబద్ధం చేశాడు. కవి మిత్రులందరూ అయిల కవిత్వాన్ని మనస్ఫూర్తిగా హత్తుకున్నారు. ఇది ఈ కాలపు అరుదైన పరిణామం.

విమర్శకులు తమ సౌలభ్యం కోసం కొన్ని వృత్తాలు గీసీ, బరులు నిర్మించీ వాటిలో కవులను ఇరికించేస్తారు. సాహిత్య ప్రపంచం తనదైన అవగాహనతో కవిని అంచనా వేసుకోకుండా వీళ్లు ముందే కొన్ని తప్పుడు క్లూలిచ్చి సమాధానాలను నిర్ధారించి తమకు తాము మార్కులేసుకుంటారు. సైదాచారి మోహపథంలో ఏకాంత పాంథుడిలా ప్రేమాన్వేషణ సాగించాడనీ, దేహ ప్రకటన సైదాచారి మాతృభాష అనీ, స్త్రీని ఆవాహన చేసుకునేందుకు కవితాయాగశాలలో మోహహోమాలు ఆచరించాడనీ ముద్దరలేసి అతన్ని వ్యక్తి విముఖుడై వాంఛాగ్ని శిఖలలో దగ్ధమైన కవిగా టాగ్‌ తగిలించీ బంధించేశారు కానీ అతను రాసిన మోహేతర కవితలే నిజానికి ఎక్కువ బలమైనవి. కులవృత్తి మీది ద్వేష ప్రేమ, మరణ చాపల్యం, సొంతనేల మీది మమకారం, గతతరపు గురుతులూ ప్రేమలూ సైదాచారి కవితలకు ప్రధానమైన ముడిసరుకులు. సైదాచారి తన కవిత్వంలో పలవరించిన స్త్రీ ప్రతి పురుషుడి లోపల ఉండే మహిళా ప్రతీక. తాను కోరుకునే తాను ఆకాంక్షించే ఆమెను తానే సృష్టించుకుని సైదాచారి ఆమెతో దగ్గరితనాన్నీ దూరపుతనాన్నీ చిత్రించుకున్నాడు.

సైదాచారి ఆమెలకు చిరునామాలూ ఊళ్లూ పేర్లూ లేవనుకుంటాను. సింప్లీ హీ ఈజ్‌ ఏ గర్లీ మాన్‌. అందుకే అమ్మ నన్ను కనిందో, అమ్మను నేను కన్నానో అంటాడు.అతనిది కేవలం రెండు సంకలనాల పిన్నవయసు. అతనిది ఏ వరమూ ఆశించని కఠోర తపస్సు. ఎ పొయెట్‌ ఈజ్‌ నాట్‌ డెడ్‌ వైల్‌ హిజ్‌ నేమ్‌ ఈజ్‌ స్టిల్‌ స్పోకెన్‌.
- ప్రసేన్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా