ఆత్మజ్ఞానాన్ని పొందితే...అన్నీ తానే!

15 May, 2016 00:33 IST|Sakshi
ఆత్మజ్ఞానాన్ని పొందితే...అన్నీ తానే!

ప్రశ్నోపనిషత్
పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి వెళ్లిన ఆరుగురు రుషులు ప్రాథమిక దశ నుండి క్రమంగా ఒక్కొక్క ప్రశ్న అడిగి సమాధానాలు పొందుతున్నారు. ప్రాణం రాకడ, నిలకడ, పోకడలను గురించి ఆశ్వలాయనుడు అడిగిన మూడోప్రశ్నకు సమాధానంగా మహర్షి ‘ఆత్మనుంచి ప్రాణం పుడుతుంది’ అని వివరించాడు. తరువాత సూర్యవంశానికి చెందిన గార్గ్యుడు అనే రుషి నాలుగోప్రశ్న ఇలా అడుగుతున్నాడు.

 ‘‘భగవాన్! ఆత్మలోనుండి ప్రాణశక్తితో దేహాన్ని ధరించిన జీవునిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) అవస్థలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జీవునిలో నిద్రించేవి ఏవి? కలలు కనేవి ఏవి? మేలుకొని ఉండేవి ఏవి? వచ్చిన కలలను అనుభవించేది, చూసేది ఏ దైవ శక్తి? ఆ సుఖం అంతా ఎవరికి చెందుతోంది? ఇవి అన్నీ ఎవనియందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి?’’ అని ప్రశ్నించాడు.

 పిప్పలాద మహర్షి అడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నాడు. జ్ఞానసముపార్జనకు వచ్చిన ఆరుగురు ఒకేవిధమైన పరిశోధనాదృష్టితో వినటం, తెలుసుకోవటం ఆయనకు నచ్చింది. నాలుగోప్రశ్నకు ఇలా సమాధానం చెబుతున్నాడు.

 ‘‘గార్గ్యా! సూర్యుడు అస్తమించేటప్పుడు అతని కిరణాలు అన్నీ తేజోమండలంలో ఐక్యమైపోతాయి. ఉదయించేటప్పుడు అన్నీ బయటకి వ్యాపిస్తాయి. అలాగే ఒక ప్రాణి నిద్రపోతున్నప్పుడు ఇంద్రియాలు అన్నీ మనసులో ఐక్యమవుతాయి. అప్పుడు ఆ మనిషి వినలేడు, చూడలేడు. వాసన చూడలేడు. రుచి చూడలేడు. స్పర్శజ్ఞానం ఉండదు. మాట్లాడలేడు. దేనినీ స్వీకరించలేడు. ఆనందించలేడు. వదలలేడు. పట్టుకోలేడు. కదలలేడు. ఈ స్థితిని నిద్రించటం అంటారు.

 నాయనా! దేహి నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తి అగ్నిహోత్రంలా వెలుగుతూనే ఉంటుంది. అపాన వాయువు గార్హపత్యాగ్ని (గృహంలో ఎప్పుడూ వెలిగేది). వ్యానవాయువు అన్వాహార్యపచనాగ్ని (వంటకు ఉపయోగించేది), గార్హపత్యాగ్ని నుంచి తయారయ్యేదే ఆహవనీయాగ్ని (యజ్ఞానికి ఉపయోగించేది), ఈ మూడింటిని త్రేతాగ్నులు అంటారు.

ప్రాణి నిరంతరమూ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే ఆహుతులను సమానంగా సమర్పించటం వల్ల వెలిగే ఆ హవనీయాగ్నియే సమాన వాయువు. ఈ యజ్ఞాన్ని చేసే యజమానుడే మనస్సు. ఈ యజ్ఞం ద్వారా ప్రాణి కోరే ఇష్టఫల మే ఉదాయనవాయువు. ఈ వాయువే దేహిని ఎల్లప్పుడూ పరబ్రహ్మం దగ్గరకు చేరుస్తూ ఉంటుంది.

 నిద్రలో తరువాత దశ స్వప్నావస్థ. ఈ దశలోని అనుభూతులన్నీ జీవుడు తానే పొందుతాడు. మెలకువతో ఉన్నప్పుడు తాను భౌతికమైన ఇంద్రియాలతో చూసినవే చూస్తాడు. విన్నవే వింటాడు. వివిధప్రదేశాలలో వివిధ దిశలలో భౌతికంగా తాను అనుభవించినవాటినే స్వప్నంలో అనుభవిస్తాడు. మెలకువతో చూసినవి, చూడనివి, విన్నవి, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, సత్యాసత్యాలన్నిటినీ కలలో జీవుడు దేహంతో సంబంధం లేకుండా తానే అనుభవిస్తాడు.

 జీవుడు స్వప్నావస్థ దాటి దివ్యమైన తేజస్సులో కలిసిపోతాడు. అప్పుడు కలలు రావు. ఆ స్థితిలో ఆత్మానందం కలుగుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ చివరికి తాముండే చెట్టుపైకి చేరుకున్నట్టు అన్నీ ఆత్మలో ఐక్యమైపోతాయి.

 భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, వాటి తత్వాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు వాటి తత్త్వాలు, నోరు, చేతులు, కాళ్లు, మలమూత్రావయవాలు అనే కర్మేంద్రియాలు, వాటి తత్త్వాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, తేజస్సు, వాటివిధులు, ప్రాణశక్తితో ముడిపడి ఉన్నవన్నీ ఆత్మలో లీనమైపోతాయి.

 నాయనా!
చూసేది, స్పృశించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, తలచుకునేది, తెలుసుకునేది, చేసేది, విజ్ఞానవంతమై ఉండేది అంతా ఆత్మయే. చావుపుట్టుకలు లేని పరమాత్మలో ఈ ఆత్మ కలిసిపోతోంది. అదే సుషుప్తి. రంగు, రుచి, వాసన, రూపం, నీడ లేనిది స్వచ్ఛమూ, శాశ్వతమూ అయిన ఆత్మానుభూతిని, ఆత్మజ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడే సర్వజ్ఞుడు అవుతాడు. సర్వమూ తానే అవుతాడు.

విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణా భూతాని సంప్రతిష్ఠంతి యత్ర
తదక్షరం వే దయతే యస్తు సోమ్య స సర్వజ్ఞ సర్వమేవా వివేశేతి
జ్ఞాన, కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు, చిత్తం, తేజస్సు, ప్రాణం అన్నింటికీ కేంద్రమై, శాశ్వతమైన విశ్వాత్మను పరమాత్మను తెలుసుకున్నవాడు అన్నీ తానే అవుతాడు. అంతటా తానే అవుతాడు’’. ఇలా నిద్ర గురించి అడిగిన ప్రశ్నకు ఆత్మజ్ఞానాన్ని పొందే క్రమాన్ని నిద్రతో అన్వయించి వివరించాడు పిప్పలాద మహర్షి. తరువాత సత్యకాముడు అడిగిన ప్రణవోపాసన ప్రశ్నకు సమాధానాన్ని వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

మరిన్ని వార్తలు