కృషికి సాక్షి సలామ్‌

11 Aug, 2019 07:41 IST|Sakshi

ఎవరో ఒకరు ఎపుడో అపుడు  నడవరా ముందుకు మున్ముందుకు అన్నాడో కవి. కృషి వుంటే మనుషులు ఋషులవుతారు అని మరొక కవి అన్నాడు. జీవితం ఉన్నది మనకోసం మాత్రమే దానిని మలచుకోవడానికి కాదని నమ్మేవారు  ఎప్పుడూ ఈ నేలమీద ఉండనే ఉంటారు. నలుగురికోసం పనిచేయడం నాలుగు విధాలా మేలు చేయడం, నలుగుబాటులో ఉన్నవారిని గట్టున పడేయడం, వేదనను కొద్దిగా అయినా దూరం చేయడం, సంఘంకోసం అంకితమవడం, జాతి, దేశం ఉప్పొంగేలా నమ్ముకున్న రంగంలో సాధన చేయడం ... ఇది కూడా జీవితం అనుకునేవారు ఉంటారు. అలాంటి వారు ఎప్పుడూ స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటారు. వారికి కృతజ్ఞత అర్పించడం మన బాధ్యత. వారిని సెహబాష్‌ అని మెచ్చుకోవడం మన కర్తవ్యం.  వారిని సత్కరించుకోవడం మన సంస్కారం. ఎన్నో భిన్న రంగాల్లో , ఎంతో సేవ చేసిన అటువంటి కృషీవలురకు ‘సాక్షి’ కిరీటం తొడుగుతోంది. సలామ్‌ చేస్తోంది.

అనన్య గరికపాటి
జ్యూరీ స్పెషల్‌ అవార్డు :: స్పోర్ట్స్‌ – ఫిమేల్‌

తెలుగులో అనితర సాధ్యం అనే మాట ఉంది కాని అనన్య చేసే రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ చూస్తే అనన్యకే సాధ్యం అని శ్లాఘించాలనిపిస్తుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అద్భుత ప్రతిభాశాలి బాల్యం నుంచే సంగీతానికి స్పందించే శరీర కదలికలు ప్రదర్శించేది. ఈ ప్రతిభను తీర్చిదిద్దుకుని సంగీతానికి నృత్యాన్ని మిళితం చేసే రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌లో తర్ఫీదు పొందింది. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో దేశ ప్రతిష్టను తెలుగువారి కీర్తిని రెపరెపలాడిస్తోంది.  2016లో లండన్‌ స్ప్రింగ్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్‌ కాంపిటీషన్‌లో మూడు కాంస్య పతకాలు, ఆల్‌ రౌండ్‌ కాంస్య పతకంతో పాటు మిస్‌ హోప్‌ట్రోఫీని వశం చేసుకుంది. 2017లో ఉజ్బెకిస్తాన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ కప్‌లో, 2017 దుబాయ్‌ ఎమిరేట్స్‌ కప్‌లో, 2018 మాస్కో విక్టరీ ఇంటర్నేషనల్‌ కప్‌లో సిల్వర్‌మెడల్స్, బ్రాంజ్‌ మెడల్స్, స్పెషల్‌ ప్రైజ్‌లు దక్కించుకుని సత్తా చాటింది. అంతేకాదు మాస్కోలోనే జరిగిన జూనియర్‌ స్టార్‌ ఇంటర్నేషనల్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ కాంపిటీషన్‌లో ఆల్‌ రౌండ్‌ విభాగంలో బంగారు పతకం గెల్చుకుని రికార్డు నెలకొల్పింది. అలాగే మాస్కోలో జరిగిన సెల్యూట్‌కప్‌లో సిల్వర్‌ మెడల్, స్పెషల్‌ ప్రైజ్‌తో పాటు మిస్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలనే ఆశయంతో కృషి చేస్తున్న అనన్యకు స్పోర్ట్‌– ఫిమేల్‌ కేటగరిలో స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.

చాలా సంతోషంగా ఉంది
రిథమ్‌ జిమ్నాస్టిక్స్‌లో చాలా పోటీల్లో పాల్గొన్నాను. గత మే నెలలో  జరిగిన అంతర్జాతీచయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో భారత్‌ తరఫున నాకు గోల్డ్‌మెడల్‌ లభించింది. ఇప్పుడు కొద్ది నెలల వ్యవధిలోనే సాక్షి నుంచి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని పోటీల్లో పాల్గొనేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. 

షేక్‌ మహమ్మద్‌ ఆరిఫుద్దీన్‌
సోషల్‌ వర్క్‌– యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌

వేయి మైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకోవడం కంటే ఒక్క చిన్న దీపమైనా వెలిగించడం మేలని నమ్మి పని చేసే వారిలో అరీఫుద్దీన్‌ ఒకరు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ అరీఫుద్దీన్‌ నలుగురిని కూడగట్టడంలో సమర్థులు. నాలుగు మంచిపనులకు పురిగొల్పడంలో నాయకుడు. అందుకే కుటుంబసభ్యులు, మిత్రుల సహకారంతో 2017లో యువ కేర్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ స్థాపించాడు. వృద్ధులు, యాచకులు, అనాథలకు ఆహారం, మందులు, దుస్తులు సరఫరా చేస్తున్నాడు. పేద విద్యార్థులకు చదువు ముఖ్యమని గ్రహించి స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తున్నాడు. వేడుకలలో మిగిలిపోయిన ఆహారం వృథా పోకుండా సేకరించి ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు. అనాథS శవాలకు సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కరాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. బ్లడ్‌బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాడు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో సేవ చేస్తున్న అరీఫుద్దీన్‌ను సోషల్‌ సర్వీస్‌లో యంగ్‌ అఛీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. 

అవార్డు ఎంపికలో స్వచ్ఛత ఉంది
సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు  ఎంపికలో ఎంతో నిజాయితీ ఉంది.  ఎక్కడో పని చేస్తున్న మమ్మల్ని గుర్తించి గౌరవించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంతకంటే  ఏం కావాలి. సామాజిక సేవ చేయాలంటే అంకితం భావం ఒక్కటి చాలు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాం. నేనూ, నా స్నేహితులు కలిసి ఫుడ్‌బ్యాంకు ఏర్పాటు చేశాం. ఆహారం వృథా కాకుండా పేదలకు అందజేస్తున్నాం. వీటన్నింటినీ మేము ఏమీ ఆశించి చేయలేదు. అయినప్పటికీ మమ్మల్ని గుర్తించడం చాలా సంతోషకరం.  

చెరుకూరి రామారావు
ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌

ఆహారం ఆయుష్షును ఇవ్వాలి... కాని అదే ఆహారం విషమయ్యే పరిస్థితి నెలకొని ఉంది రసాయనాల వాడకం వల్ల. అందుకే చెరుకూరి రామారావు తన సేద్యంలో రసాయనాలకు నో చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నారు. 20  ఎకరాల నేలలో రామారావు పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రజలకు ప్రకృతి వరాలని చెప్పవచ్చు. కూలీల మీద ఆధార పడకుండా తను, తన కుంటుంబ సభ్యులు రోజంతా కష్టపడి పంట పండించుకోవడమే కాదు చేతికొచ్చిన పంటను వీరే స్వయంగా మార్కెటింగ్‌ కూడా చేసుకుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ రైతుగా గుర్తింపు తెచ్చుకున్న రామారావు ఒక సందర్భంలో చెరకు పంటకు గిట్టుబాటు ధర లేదని తానే రసం తీసి ప్యాకింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేసుకుని మంచి లాభాలు గడించారు. కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే లాభాలతోనే 6 ఎకరాల నుంచి 20 ఎకరాలకు ఎదిగారు. సమాజానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించాలనేది తన ఆశయం అంటున్న ఈ ఆధునిక రైతు సాటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. అందుకే చెరుకూరి రామారావును ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. 

సేంద్రీయ పంటలు ఆరోగ్య విప్లవాన్ని తెచ్చాయి
సేంద్రీయ పంటలు పండిస్తున్నాం. 25 ఎకరాల్లో  అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వరి, గోధుమ, చిరుధాన్యాలు పండించి  నేరుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాయి. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు స్వస్థత లభించింది.సాక్షి నుంచి ఈ అవార్డును అందుకోవడం  సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. 

డాక్టర్‌ బిందు మీనన్‌ ఫౌండేషన్‌
ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ హెల్త్‌ కేర్‌

పక్షవాతం, మూర్ఛ జీవితాన్ని నరక ప్రాయం చేస్తాయి. కాని వీటి పట్ల అవగాహన చైతన్యం ఉంటే నివారణ సులభం అని అందుకు కృషి చేయాలని 2013లో ఏర్పాటైన సంస్థ డాక్టర్‌ బిందు మీనన్‌ ఫౌండేషన్‌. నెల్లూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ బిందు మీనన్‌ న్యూరో వ్యాధులపై అవగాహన కొరకు ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ‘వియ్‌ రీచ్, వియ్‌ టీచ్, వియ్‌ ట్రీట్‌’ అనే నినాదంతో ప్రజలలోకి వెళ్లారు. మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ హెల్త్‌ క్యాంప్‌లు, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, నరాల సంబంధిత వ్యాధులపై సందేహాలు నివృత్తి చేసేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేశారు. ‘ఎపిలెప్సి హెల్ప్‌’ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నెలకు రెండువందల మంది పేషంట్లకు ఉచిత వైద్య చికిత్సతో పాటు నెలకు సరిపడా మందులు కూడా ఉచితంగా అందిస్తోంది ఈ ఫౌండేషన్‌. సమాజ హితం కోసం స్వచ్ఛందంగా పాటుపడుతున్న డాక్టర్‌ బిందు మీనన్‌ ఫౌండేషన్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌ అవార్డు అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.

మూర్ఛ వ్యాధిగ్రస్తులకు విముక్తి కల్పిస్తా
 చాలా మంది ఈ వ్యాధుల కారణంగా తిరిగి కోలుకోలేకపోతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, పేదరికం ఒక కారణమైతే అవగాహన లేమి మరో కారణం. అలాంటి వారికి సేవలందజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము చేస్తున్న సేవలకు సాక్షి నుంచి గొప్ప గుర్తింపు, గౌరవం దక్కాయి. 2018లో కెనడాలో అంతర్జాతీయ అవార్డు పొందాం. కానీ దాని కన్నా సాక్షి నుంచి అవార్డు అందుకోవడమే ఎంతో గర్వంగా ఉంది.

డాక్టర్‌ రమేష్‌ కంచెర్ల
అంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌

ఎంత ప్రాణాంతకమైన చిన్న పిల్లల వ్యాధులు వచ్చినా అత్యాధునిక చికిత్స అందించగల స్థాయిలో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ను తీర్చిదిద్దిన ఘనత డాక్టర్‌ రమేశ్‌ కంచర్లకు దక్కుతుంది. 1999లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెయిన్‌ బో చిల్డన్స్ర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ రమేష్‌ కంచెర్ల ఆధ్వర్యంలో విజయవాడ, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై శాఖలతో 1185 పడకలతో దేశంలోనే అతి పెద్ద చిల్డన్స్ర్‌ హాస్పిటల్‌ చైన్‌గా పేరు సంపాదించింది. నవజాత శిశువుల నుంచి 18 సంవత్సరాల యువతీ యువకుల వరకు వారికి సంక్రమించే వివిధ రకాల వ్యాధులకు ఆధునిక చికిత్సా పద్దతుల్లో వైద్యం అందించడానికి నిపుణులైన సిబ్బంది ఈ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నారు. గర్భధారణ సమస్యలకు కూడా ప్రత్యేక చికిత్సా విధానలు అందిస్తున్నారు. సంవత్సరానికి 5 వేలకు పైగా సర్జికల్‌ ప్రొసీజర్స్, 30,000 ఇన్‌పేషంట్‌ అడ్మిషన్స్‌ నిర్వహిస్తూ చిన్నారుల మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి రెయిన్‌బో చిల్డన్స్ర్‌హాస్పిటల్స్‌. ‘హీల్‌ ఎ చైల్డ్‌’ ట్రస్ట్‌ ద్వారా నిరుపేద పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఇంతటి పురోగతి సాధించిన హాస్పిటల్స్‌ సీఎండి డాక్టర్‌ రమేష్‌ కంచెర్లను ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.  

విజయవంతంగా పిల్లలకు వైద్య సేవలు
పిల్లల ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు చాలామంది వెనుకడుగు వేస్తారు. చిన్న పిల్లలకు వైద్యసేవలను అందజేయడం భారంగా,నష్టంగా భావిస్తారు. కానీ  మొట్టమొదట 1999లో నెల్లూరులో పిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయంతంగా నడిస్తున్నాం, ఎంతోమంది పిల్లల ప్రాణాలను కాపాడాము. ఆ తరువాత మా ఆసుపత్రులను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాం. ఛత్తీస్‌గఢ్, బెంగళూర్‌ తదితర రాష్ట్రాల్లోనూ పిల్లల ఆసుపత్రులను నెలకొల్పి సేవలందజేస్తున్నాం, సాక్షి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఈయర్‌గా అవార్డు లభించడం చాలా సంతోషం.

డాక్టర్‌ దామెర యాదయ్య
హెల్త్‌ కేర్‌– స్పెషల్‌ జ్యూరీ

ప్రతి మహిళకు ప్రసవం మరుజన్మతో సమానం. తల్లికి సుఖప్రసవం జరిగి బిడ్డ క్షేమంగా ఉంటే ఆ ఇంట ఆనందం వెల్లి విరుస్తుంది. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రం డాక్టర్‌ దామెర యాదయ్య ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేస్తోంది. నిపుణులైన వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటూ శిశు మరణాలను అరికట్టాలనే ఆశయంతో సేవలందిస్తున్నారు. నెలల నిండకుండా పుట్టిన శిశువులు, తక్కువ బరువుతో జన్మించిన బిడ్డలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నారు. కేవలం 650 గ్రాముల బరువుతో జన్మించిన పాపను ప్రత్యేక వైద్యచికిత్సలతో కోలుకునేలా చేసి రికార్డు నెలకొల్పింది ఈ బృందం. 86 శాతం సర్వైవల్‌ రేట్‌తో పదివేల మంది శిశువులకు చికిత్స అందించారు. గతంలో వెయ్యికి నలభైగా ఉన్న శిశు మరణాల రేటును ఎనిమిదికి తగ్గించారంటే ఈ బృందం పని తీరును అర్థం చేసుకోవచ్చు. తోటి వైద్యులు, సిబ్బందితో కలిసి శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న డాక్టర్‌ దామెర యాదయ్యను హెల్త్‌కేర్‌ కేటగిరిలో జ్యూరీ స్పెషల్‌ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. 

స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది
నల్గొండ జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం నుంచి ఎంతోమంది నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను కాపాడాం. 2015లో కేవలం 650 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి మమతను కాపాడడం  దేశంలోనే  ఒక సంచలనం, ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది. స్కూల్‌కు కూడా పంపిస్తున్నారు. చాలా మంది బరువు తక్కువగా పుట్టినప్పుడు, లేదా 7, 8 నెలలకే పుట్టినప్పుడు వారిని కాపాడడం? అతి పెద్ద సవాల్‌. అది మా ఆసుపత్రిలో విజయవంతంగా చేస్తున్నాం, ఇప్పుడు సాక్షి నుంచి అవార్డును అందుకోవడం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. గొప్ప స్ఫూర్తిదాయకం.

గాయత్రి
ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌

న్ను నీవు జయిస్తే ప్రపంచమంతా నీకు దాసోహం అవుతుంది అన్నారు స్వామీ వివేకానంద. గాయత్రి తనను తాను జయించింది. వనపర్తికి చెందిన గాయత్రి పుట్టుకతోనే అంధురాలు. గాయత్రిని హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలలో చేర్పించి ఈమె జీవితానికో దారి చూపారు తల్లిదండ్రులు. చూపు లేదని చింతపడకుండా అక్షరాన్ని ఆయుధంగా మల్చుకుని స్వహస్తాలతో తన భవిష్యత్‌ను  తీర్చిదిద్దుకున్నారు గాయత్రి. ప్రస్తుతం వనపర్తిలోని బాలుర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంధురాలైన తొలి గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించారు గాయత్రి. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పూర్వ విద్యార్థులతో మాట్లాడి తమ పాఠశాలకు అవసరమైన మౌలికవసతులు సమకూర్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గాయత్రిని ఉత్తమ మహిళా అవార్డుతో సత్కరించింది. చిమ్మ చీకట్లను ఛేదించుకుని వెలుగు రేఖవైపు ప్రయాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గాయత్రికి ఈ సంవత్సరం ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.  

చాలా సంతోషంగా ఉంది
అంధురాలైనప్పటికీ పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందజేస్తున్న గాయత్రి ఎక్సలెన్స్‌ ఇన్‌  ఎడ్యుకేషన్‌లో అవార్డును అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మా స్కూల్‌ విద్యారంగంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించింది. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బోధిస్తున్నాం, 1100 మంది పిల్లలు, 50 మంది టీచర్లతో విజయంతంగా స్కూల్‌ను నడిపించడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు సాక్షి నుంచి అవార్డును అందుకోవడం మరింత ఆనందంగా ఉంది. నాకు లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తాను.

భగవాన్‌ మహావీర్‌ డయాలసిస్‌ సెంటర్‌
హెల్త్‌ కేర్‌– జ్యూరీ ప్రత్యేక గుర్తింపు
పీసీ ప్రకాశ్‌

ఆధునిక జీవన శైలి కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డయాలసిస్‌ చేయించుకోవాలంటే నెలకు వేల రూపాయలు ఖర్చవుతుంది. అంత ఖర్చు భరించలేని నిరుపేద రోగులకు నరకయాతనే. అలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తోంది మహావీర్‌ డయాలసిస్‌ సెంటర్‌. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన పదహారు మంది సహృదయులు 2009లో భగవాన్‌ మహావీర్‌ జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ పేరుతో ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జంట నగరాల్లో  డయాలసిస్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పేద రోగులకు నామమాత్రపు రుసుముతో డయాలసిస్‌ చేస్తూ వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేయూతనందిస్తోంది ఈ ఫౌండేషన్‌. జంట నగరాల్లో 5 కేంద్రాల్లో 160 డయాలసిస్‌ మెషిన్లతో సాగుతున్న ఈ సేవ ద్వారా నెలకు 1100 మంది పేషంట్స్‌ లబ్ధి పొందుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటుతున్న భగవాన్‌ మహావీర్‌ డయాలసిస్‌ సెంటర్‌కు హెల్త్‌కేర్‌ కేటగిరిలో జ్యూరీ స్సెషల్‌ రికగ్నిషన్‌ అవార్డ్‌ అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. 

డయాలసిస్‌కు పేదరికం సమస్య కారాదు
భగవాన్‌ మహావీర్‌ జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ ట్రస్టు ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్‌ చికిత్సలను అందజేస్తున్నాం, నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. కానీ పేదరికం కారణంగా ఏ ఒక్కరూ  ఈ చికిత్సను కోల్పోవద్దనే ఉద్దేశ్యంతో 2009లో ప్రారంభించాం. అప్పటినుంచి ఇప్పటి వరకు వందలాది మందికి చికిత్సలను అందజేశాం. డయాలసిస్‌ కోసం బాధితులు నేరుగా మా సంస్థను సంప్రదించవచ్చు. సాక్షి మా సేవలను గుర్తించి గౌరవించడం చాలా సంతోషం.

యువ బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌
స్పోర్ట్స్‌– మేల్

పిడికిట్లో పట్టుదల ఉంటే పంచ్‌లో పవర్‌ వస్తుంది అని నిరూపించిన యువ బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా, బాక్సింగ్‌ ప్రాక్టీసు కోసం ఎటువంటి వెసులుబాటు లేకపోయినా కుటుంబంలో తండ్రి బాక్సింగ్‌ ఛాంపియన్‌ కనుక ఆయన స్ఫూర్తితో ఆయన శిక్షణతో కటిక నేల మీద సాధన చేసి ఎదిగిన బాక్సర్‌ ఇతడు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్‌ అంతర్జాతీయ టోర్నమెంట్లలో 56 కిలోల కేటగిరిలో ప్రతిభ చూపుతున్నాడు. 2012లో ఆర్మేనియా వరల్డ్‌ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2015లో సౌత్‌ కొరియాలో నిర్వహించిన వరల్డ్‌ మిలిటరీ గేమ్స్‌లో పాల్గొన్నాడు. 2018 ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా స్మారక టోర్నీ, అదే సంవత్సరం ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ సిటీలో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొని బ్రాంజ్‌ మెడల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్‌ పోటీలో పాల్గొని గోల్డ్‌మెడల్‌ కైవసం చేసుకున్నాడు. జకార్తాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న హుస్సాముద్దీన్‌ ఫిన్‌ ల్యాండ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌టోర్నీ, పోలాండ్‌లోని వార్సా నగరంలో జరిగిన ఇంటర్నేషనల్‌ టోర్నీలో సిల్వర్‌ మెడల్స్‌ గెల్చుకున్నాడు. రోజురోజుకూ ఎదుగుతూ భారతదేశానికి ఒక ఆశపెట్టుకోదగ్గ బాక్సర్‌గా గుర్తింపు పొందుతున్న హుస్సాముద్దీన్‌ను స్పోర్ట్స్‌–మేల్‌ కేటగరిలో జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌ అవార్డ్‌తో సత్కరిస్తోంది సాక్షి  మీడియా గ్రూప్‌. 

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాను
సాక్షి  నుంచి అవార్డును అందుకోవడం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సంగతి ఎలా ఉన్నా ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది.

మిథాలి రాజ్‌
ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌

ప్రపంచ మహిళా క్రికెట్‌లో ఆమె ఓ వేగు చుక్క. భారత మహిళా క్రికెట్‌కు ఓ వెలుగు రేఖ. మగవారి ఆటగా ముద్రపడ్డ క్రికెట్‌లో మేమేం తక్కువా అంటూ స్త్రీ బావుటా ఎగురవేసిన ప్రతిభామూర్తి. గతంలో క్రికెట్‌ అంటే  గవాస్కర్,  టెండూల్కర్‌ అనేవారు. ఇప్పుడు క్రికెట్‌ అంటే ధోనీ, కోహ్లీతోపాటు మిథాలి రాజ్‌ పేరు కూడా తప్పనిసరిగా ప్రస్తావించే స్థాయికి మహిళా క్రికెట్‌ను తీసుకెళ్లిన క్రీడాకారిణి మిథాలి. 10 ఏళ్ల పసి ప్రాయంలోనే క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన మిథాలి... 16 ఏళ్లకే జాతీయ జట్టు జెర్సీని ధరించే స్థాయికి ఎదిగింది. 19 ఏళ్ల ప్రాయంలో టెస్ట్‌ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ కొట్టి సంచలనం రేపింది. నాలుగేళ్లు తిరిగే సరికి ఏకంగా భారత జట్టుకే సారథి అయింది. మిథాలీ సారథ్యంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు రెండుసార్లు ప్రపంచ కప్‌లో ఫైనల్స్‌ చేరుకుని హర్షధ్వానాలు అందుకుంది. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ మ్యాచ్‌లో విజయం సాధించడమేగాక సిరీస్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. మిథాలి సుదీర్ఘకృషికి, ప్రతిభకు ప్రతిఫలంగా అర్జున, పద్మశ్రీ పురస్కారాలు, మరెన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. త్వరలో ఆమె బయోపిక్‌ వెండితెరపై మెరవనుంది. నిబద్ధత, కఠోర శ్రమ, అంకితభావాలతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిథాలి రాజ్‌ను ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించడాన్ని తమకు దక్కిన గౌరవంగా సాక్షి మీడియా గ్రూప్‌ భావిస్తోంది. 

గొప్ప గౌరవం... గుర్తింపు
తెలుగు పర్సన్‌ ఆఫ్‌ ద ఈయర్‌గా అవార్డు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. నాకు తెలుగు రాష్ట్రాల్లో  ఇది ఎంతో గుర్తింపును తెచ్చే అవార్డు. అంకితభావంతో కష్టపడి పనిచేస్తే మనం ఎంచుకున్న ఈ రంగంలోనైనా  విజయాన్ని సాధించగలం, ఆ విజయమే గుర్తింపును, గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఇది నిజమని నిరూపించడానికి మీరే సాక్షి.


డా. దినేష్‌ చర్ల
సబీనా జేవియర్‌ యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌

పసిపిల్లల ప్రాణాలు నిలపడం కన్నా మహా సేవాకార్యం మరొకటి ఉండదని భావిస్తారు సబీనా జేవియర్‌. చిన్నారులకు జబ్బు చేస్తే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. చికిత్సకు డబ్బు లేకపోతే మరింతగా వేదన అనుభవిస్తారు. కేవలం డబ్బు లేదన్న కారణంగా పిల్లలను కోల్పోతే ఆ క్షోభ జీవితాంతం వెంటాడుతుంది. అందుకే అటువంటి పిల్లల కోసం ఉచితం వైద్యం అందించేందుకు తోడ్పాటునందిస్తోంది హీల్‌ ఏ చైల్డ్‌ ఫౌండేషన్‌. చికిత్సకు డబ్బు లేని కారణంగా ఏ బిడ్డా ప్రాణలు కోల్పోకూడదనే ఆశయంతో సబీనా జేవియర్‌ ఏర్పాటు చేసిన ఈ చారిటబుల్‌ ట్రస్ట్‌. ప్రముఖ హాస్పిటల్స్‌ సహకారంతో జబ్బు చేసిన పసిపాపలకు చేయూతనందిస్తోంది. దాతలు అందిస్తున్న అండదండలతో సేవ్‌ సిక్‌ చిల్డ్రన్‌ క్యాంపెయిన్‌ నడుపుతోంది. గత తొమ్మిదేళ్లలో తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న 530కి పైగా పసిపాపల వైద్యానికి అయిన ఖర్చులు  భరించింది. మరోవైపు అనాథాశ్రమాల్లో ఉన్న విద్యార్థులకు వారం వారం హెల్త్‌ చెకప్స్, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారుల కోసం హెల్త్‌ క్యాంప్స్‌నిర్వహిస్తోంది. అమూల్యమైన ఈ సేవకు గాను సబీనా జేవియర్‌ను సోషల్‌ సర్వీస్‌ కేటగిరిలో యంగ్‌ అఛీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.  

గొప్ప స్ఫూర్తిని అందించింది...
మేం గత 9 సంవత్సరాలుగా సబీనా జేవియర్‌ గారి ఆధ్వర్యంలో ఈ హీల్‌ ఎ చైల్డ్‌ సంస్థను నిర్వహిస్తున్నాం. అనూహ్యంగా అనారోగ్య సమస్యలతో పుట్టిన శిశువుల వైద్య ఖర్చులకు ఇబ్బంది పడే తల్లిదండ్రులకు ఆర్థికంగా మా సంస్థ చేయూతని ఇస్తుంది. గతంలోనూ మా సేవలకు అవార్డులు అందుకున్నా... తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా సంస్థగా సాక్షి ఇచ్చిన ఈ పురస్కారం మాకు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపును తీసుకువచ్చింది. థాంక్యూ సాక్షి.

డాక్టర్‌ ఐ.వి.శ్రీనివాసరెడ్డి
యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌– ఎడ్యుకేషన్‌

మనం తల వొంచితే తప్ప ఓటమి మన దరి చేరదు అని నమ్మినవారు శ్రీనివాసరెడ్డి. పోలియో కారణంగా చిన్నతనంలోనే రెండు కాళ్లు చలన రహితమై పోయినా ఆయన ఓటమిని దరి చేరనివ్వలేదు. ఓటమి తనను అందుకోలేనంత వేగంగా పట్టుదలగా చదువులో దూసుకుపోయారు. మెరిట్‌ విద్యార్థిగా రాణించారు. ఫీల్డ్‌వర్క్‌ను, కదలికను డిమాండ్‌ చేసే చదువు అయినప్పటికీ వెరవక వ్యవసాయం మీద ఆసక్తి కొద్దీ అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేశారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎన్నో ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేశారు.  రైతు శిక్షణా కార్యక్రమాలకు రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు. రైతు అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న శ్రీనివాసరెడ్డి కృషిని చూసి తెలంగాణ ప్రభుత్వం 2018లో ఆయనను బెస్ట్‌ సైంటిస్ట్‌ అవార్డుతో సత్కరించింది. శారీరక లోపాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమించి ఉన్నత విద్యతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న డాక్టర్‌ఐ.వి. శ్రీనివాసరెడ్డిని ఎడ్యుకేషన్‌ కేటగరిలో యంగ్‌ అఛీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో  సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌.

చాలా సంతృప్తినిచ్చింది
ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న తనను గుర్తించి యంగ్‌ అచీవర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అవార్డుతో గౌరవించడం గొప్ప సంతృప్తిగా ఉంది. శాస్త్రీయమైన వ్యవసాయ విధానాల పట్ల రైతులకు అవగాహన కలిగించేందుకు ఇప్పటివరకు 170 శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశాను. వ్యవసాయరంగంపైన 94 వ్యాసాలు రాశాను. ఉద్యోగ కల్పన కార్యక్రమాల్లో భాగంగా ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేశాను. వ్యవసాయరంగం  బాగా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు ఈ కృషిలో భాగస్వాములు కావాలి. 

రామలీల
మల్లికాంబ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్‌ 
అండ్‌ అసోసియేట్‌ డిజేబిలిటీస్‌
ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌


తన బిడ్డకు మానసిక ఎదుగుదలలో లోపం ఉంది అని తెలిసిన క్షణాన ఏ తల్లి అయినా కుప్పకూలిపోతుంది. మరి ఇద్దరు పిల్లలకు అలాంటి లోపం ఉంటే? కాని హన్మకొండకు చెందిన రామలీల తన పిల్లల కష్టాన్ని చూసి అలాంటి అందరు పిల్లలకూ సేవ చేయాలని నిశ్చయించుకుంది. మానసిక ఎదుగుదలలో లోపం ఉన్న తన ఇద్దరు పిల్లల వంటి వారి కోసం 2001లో హన్మకొండలో మల్లికాంబ మనోవికాన కేంద్రం ఏర్పాటు చేశారు రామలీల. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యా బుద్ధులు నేర్పించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా తీర్చిదిద్దడమే ఈ సంస్థ ఆశయం. ఈ సంస్థ నిర్వహణ కోసం రామలీల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, బీఈడీ చేశారు. మల్లికాంబ మనో వికాస కేంద్రంలో కేంద్రంలో 200 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. మానసిక లోపం ఉన్న పిల్లలను డిపెండెంట్‌ స్థాయి నుంచి ఇండిపెండెంట్‌ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అంటున్నారు రామలీల. ఆ విధంగా ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో మేలు చేస్తున్నారు. స్పెషల్‌ చిల్డ్రన్‌ కోసం అవిరళ కృషి చేస్తున్న మల్లికాంబ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్లీ హాండిక్యాప్డ్‌ అండ్‌ అసోసియేట్‌ డిజేబిలిటీస్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌y ðlవలప్‌మెంట్‌ అవార్డు అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. 

మా సేవలకు సముచితమైన గుర్తింపు లభించింది
నా జీవిత అనుభవమే నన్ను బుద్ధిమాంద్యుల శిక్షణ, పునరావాస సంస్థను ఏర్పాటు చేసేందుకు కారణమైంది. మా ఇద్దరు పిల్లలు మంజునాథ, సాయిక్రిష్ణలు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో మరింత మంది పిల్లలను చేరదీశాం. పద్మజారెడ్డి, భాగ్యలక్ష్మి, కల్యాణి తదితరులతో కలిసి బుద్ధిమాంద్యుల, మానసిక వికలాంగుల శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాం. అందరం కలిసి బుద్ధిమాంద్యులైన పిల్లల అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. సోషల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. 


 

మరిన్ని వార్తలు