నల్లటి మచ్చలు... పోవాలంటే?

10 Nov, 2016 23:05 IST|Sakshi
నల్లటి మచ్చలు... పోవాలంటే?

డర్మటాలజీ కౌన్సెలింగ్

నా వయసు 28 ఏళ్లు. నా కణతల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అలా ఉన్నాయి. ప్రస్తుతం అవి చెంపలపైన కూడా వస్తున్నాయి. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - రమ్య, వరంగల్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కణతల మీద, బుగ్గల మీద ‘ఫొటో పిగ్మెంటేషన్’ వల్ల ఇలా నల్ల మచ్చలు వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ కింది సూచనలు పాటించండి. మీరు రెండు శాతం గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న మైల్డ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించండి. ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా 50 ఎస్‌పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయండి. ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆ లోషన్స్ రాస్తూ ఉండాలి. కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్‌తో పాటు విటమిన్-సి ఉండే క్రీమును ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా కనీసం నాలుగు వారాల పాటు రాసుకుంటూ ఉండాలి.    కొన్ని వారాల తర్వాత మీరు కొన్ని కెమికల్ పీలింగ్, మైక్రో డెర్మా అబ్రేషన్, ఫ్రాక్షనల్ లేజర్ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాల్సి రావచ్చు.

మన దేహంలోని అతి పెద్ద భాగం మన చర్మం. దాన్ని సంరక్షించుకోవడం మనందరికీ చాలా అవసరం. అది చాలా ప్రధానం కూడా. కేవలం సమస్య వచ్చినప్పుడు చర్మానికి చికిత్స చేయించుకోవడం కంటే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం అవసరం.

అవి... ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.  అందులో ఆకుకూరలు, కాయగూరలు (క్యారట్, బీట్‌రూట్), తాజా పండ్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా కంటి నిండా నిద్రపోవాలి.

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్

నొప్పిగా ఉందా? రక్తం పడుతోందా?
ఆయుర్వేదం కౌన్సెలింగ్

నా వయసు 44 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా మూలశంక (పైల్స్) వ్యాధితో బాధపడ్డాను. ఏడాది కిందట ఆపరేషన్ చేశారు. ఉపశమనం లభించింది. కానీ మళ్లీ రెండు నెలల నుంచి మలమార్గం దగ్గర చింతగింజ పరిమాణంలో వాపు, నొప్పి, దురద, మలబంధం లాంటి లక్షణాలున్నాయి. అప్పుడప్పుడు కొంచెం నెత్తురు పడుతూ ఉంటోంది. దీనికి ఆయుర్వేదంలో సంపూర్ణ పరిష్కారం తెలియజేయండి. - సురేశ్ అగర్వాల్, హైదరాబాద్
పైల్స్ వ్యాధిని ఆయుర్వేద పరిభాషలో ‘అర్శో రోగం’ అంటారు. ‘శత్రువులా హింసించే వ్యాధి కాబట్టే దీనిని ‘అర్శ’ అన్నారు. ‘అరివత్ ప్రాణినో మాంసకీలకా విశసంతి అర్శాంసి తస్మాత్ ఉచ్యంతే ..... మార్గ నిరోధతః’ (అష్టాంగ హృదయ గ్రంథం) - కొన్ని మొలకల వంటివి మలమార్గాన్ని అడ్డగించి హింసించడం వల్ల ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది.

వ్యాధిస్థానం: మలమార్గంలో మూడు మడతలు ఉంటాయి. (త్రివలీ... అంటే 1. ప్రావరిణి, 2. విసర్జని 3. సంవరిణి). వీటిలో గల సిరలు ఉబ్బుతాయి. వాపు కలుగుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఈ వాపు పరిమాణం, రూపం మారుతుంటాయి. ఉదా: ఆవగింజ, పెసర, మినప, కంది, బార్లీ గింజల్లా, పగడాలలాగ, చిలకముక్కులాగా ఉంటాయని శాస్త్రకారులు స్పష్టీకరించారు. వీటిని మాంసకీలలు అంటారు.

భేదాలు : సహజ (పుట్టుకతో వచ్చినవి), జాతోత్తరకాలజ (వివిధ  కారణాల వల్ల, వయసుల్లో వచ్చేవి), శుష్క (పొడిగా ఉండేవి), ఆర్ద్ర (తడిగా ఉండేవి). బాహ్య (బయటకు ఉండేవి), ఆభ్యంతర (లోపలి మడతల్లో ఉండేవి).

వ్యాధి కారణాలు: జఠరాగ్ని మందగింపజేసే ఆహారవిహారాలు. అంటే ఉప్పు, పులుపు-కారాలు ఎక్కువగా తినడం, అజీర్తి కలిగించే బరువైన ఆహారం, విరుద్ధాహారం (అంటే కొన్ని కొన్ని పదార్థాల కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి పళ్లెంలో నిల్వ ఉంచిన పులిహోర; కొన్ని రకాల చేపలు తిన్న వెంటనే పాలు తాగడం, పాలు, పెరుగు వెంటవెంటనే సేవించడం), ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారికి (ముఖ్యంగా మెత్తటి ఆసనాల మీద), జంతువుల (గుర్రం మొదలైనవి) మీద ఎక్కువ సేపు ప్రయాణించడం, పిరుదుల మీద ఎక్కువ సేపు వేడి లేదా చల్లటి ఒత్తిడి పడటం (లారీ నడిపేవారు), మానసిక ఒత్తిడి (ఆందోళన, భయం, దుఃఖం, విచారం మొదలైనవి)

చికిత్స విషయంలో సాధ్యాసాధ్యాలు: బాహ్య అర్శస్సులు, కొత్తగా పుట్టేవాటికి తేలిగ్గా చికిత్స చేయవచ్చు. సహజ, ఆభ్యంతర, చిరకాల అర్శస్సులు కష్టసాధ్యాలు, కొన్నింటికి చికిత్స అవసరం.

ఉపద్రవాలు: సకాలంలో సరైన చికిత్స చేయకపోతే రక్తహీనత, దౌర్బల్యం, శరీరమంతా వాపులు, మానసిక వ్యాకులతలతో పాటు మరణానికి దారితీస్తుంది.

వ్యాధి లక్షణాలు: మలమార్గం దగ్గర వాపు, తీవ్రమైన మలబంధం, దురద, మంట, ఆకలి లేకపోవడం, కోపం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం మొదలైనవి.

చికిత్స: పైన చెప్పిన కారణాలను గమనించి వాటిని దూరం చేయాలి. నూనెలు, ఉప్పు-పులుపు, కారం లేని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం (పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే శాకాహారం, ఆకుకూరలు) తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం,  తాజాఫలాలు ఎక్కువగా తినడం, తగినంత నిద్ర, ప్రశాంతత, ప్రాణాయామం మొదలైనవి.

ఔషధాలు: కాంకయనవటి (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1  బృహత్ సూరణ వటి (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 అర్శోహర వటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1   త్రిఫలాచూర్ణం: 5 గ్రాములు నీటితో రెండుపూటలా శుంఠి చూర్ణం: 3 గ్రాములు, తేనెతో, రాత్రి ఒకసారి  చిత్రమూల చూర్ణం: 2 గ్రాములు తేనెతో రాత్రి ఒకసారి

డాక్టర్ వి.ఎల్.ఎన్.శాస్త్రి ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

పసిపిల్లల్లో... వినికిడి సమస్యను కనిపెట్టేదెలా?
ఈఎన్‌టి కౌన్సెలింగ్

మా బాబుకి రెండున్నర ఏళ్లు. వాడిని పిలిచినా పలకడం లేదు. కారణం చెప్పండి. దయచేసి పరిష్కారం చూపించండి. - సులక్షణ, ఖమ్మం
సాధారణంగా పుట్టుకతో వినికిడి లోపం అన్నది జన్యుపరంగా వస్తుంది. వినికిడి నరంలో సమస్యతో ఇది వస్తుంది. పిల్లలకు వినికిడి లేకపోతే మాట కూడా రాదు.

కారణాలు:  మేనరికపు వివాహాల వల్ల జన్యుపరంగా వినికిడికి దోహదం చేసే నరం బలహీనమవుతుంది  గర్భవతుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల  అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు,  తలకు, చెవికి బలమైన దెబ్బ తగలడం  మెదడువాపు వ్యాధి వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. ఇలా జరిగినప్పుడు వినికిడి లోపానికి తగిన కారణాలు తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స చేయడం, కాక్లియర్ ఇంప్లాంట్స్ శస్త్రచికిత్స చేయించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

సమస్యను ఎలా గుర్తించాలి?
వినికిడి సమస్య అన్నది పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏర్పడుతుంది. శిశువు పుట్టిన తర్వాత...  ఒక నెలలోపువారు శబ్దాన్ని గ్రహించి కంటి రెప్పలను కదిలిస్తారు  మూడు నెలల లోపు వయసులో శబ్దం వచ్చే వైపునకు తిరుగుతారు  ఆరు నెలలోపు వయసులో మ, బ, త లాంటి అక్షరాలు పలుకుతారు  తొమ్మిది నెలలోపు వయసు గల వారు మమ, తత, బబ లాంటి చిన్న చిన్న పదాలు పలుకుతారు

పన్నెండు నెలల వయసు వారు అర్థవంతమైన పదాలను పలకడం చేస్తుంటారు ఏడాదిన్నర వయసు ఉన్నవారు చిన్న చిన్న వాక్యాలు పలుకుతుంటారు రెండేళ్ల పిల్లల వారు చిన్న చిన్న కథల రూపంలో ఏదైనా చెబుతుంటారు.    వీటిలో ఏది జరగకపోయినా పిల్లలకు వినికిడి సమస్య ఉందని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలుసుకోవాలి.

డాక్టర్ సత్యకిరణ్ అవ్వారు
సీనియర్ ఈఎన్‌టీ అండ్ కాక్లియర్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్.

మరిన్ని వార్తలు