వోకల్‌ నాడ్యూల్స్‌ అంటే ఏమిటి?

22 Nov, 2017 00:23 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

ఈఎన్‌టీ కౌన్సెలింగ్‌
నేను టీచర్‌ను. ఇంట్లో కూడా ట్యూషన్స్‌ చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్‌ నాడ్యుల్స్‌’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి.
– శివకుమార్, ఖమ్మం
వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించే అత్యధికుల్లో వోకల్‌ నాడ్యూల్స్‌ సమస్య వస్తుంటుంది. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్‌ నాడ్యూల్స్‌ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ వాయిస్‌) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్‌ కార్డ్స్‌) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్‌ కార్డ్స్‌ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్‌ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్‌ కార్డ్స్‌ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్‌టీ నిపుణులను, స్పీచ్‌ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్‌ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది.

హార్ట్‌ సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు
నాకు ఇటీవలే ‘ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. మాట్లాడబోతుంటే గాలిలాగా వస్తోంది. తినేప్పుడు, తాగేటప్పుడు, మిగడంలో ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
– సర్వేశ్వరరావు, అనకాపల్లి
మీకు స్వరపేటికలోని ‘వోకల్‌ ఫోల్డ్‌’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌హార్ట్‌ సర్జరీ), ట్రకియాస్టమీ, మెడ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్‌ ఫోల్డ్‌’పై ఒత్తిడి పడటానికీ లేదా అవి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్‌ పెరాలసిస్‌ వచ్చేందుకూ అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి ముందుగా మీరు నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక స్పీచ్‌థెరపిస్ట్‌ను సంప్రదించి మింగడంలోని ఇబ్బందులు తొలగిపోడానికీ, గొంతురావడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లను తెలుసుకుని వాటిని ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది.

మాటిమాటికీ తలతిరుగుతోంది...!
నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్ని సార్లు కింద కూడా పడిపోయాను. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. బీపీ, షుగర్‌ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్‌ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా, పరిష్కారం సూచించండి. – ఎన్‌. రమణమూర్తి, విజయవాడ  
మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్‌ పొజిషనల్‌ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్‌ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్‌ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో  ఓటోలిత్‌ అనే కణాలు, హెయిర్‌ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్‌ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్‌ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్‌ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది.
– డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్,
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు