హైపర్‌థైరాయిడిజమ్‌ తగ్గుతుంది

20 Feb, 2017 22:46 IST|Sakshi
హైపర్‌థైరాయిడిజమ్‌ తగ్గుతుంది

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 27 ఏళ్లు. ఈమధ్య బరువు తగ్గడం, నీరసం, ఎంత తిన్నా ఆకలిగా ఉండటం, గుండెదడ ఉంటోంది. డాక్టర్‌ గారికి చెబితే థైరాయిడ్‌కు సంబంధించి టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్షలు చేయించమన్నారు. ఈ సమస్య ఏమై ఉండవచ్చు. దీనికి పరిష్కారమార్గాలు చెప్పండి. – సునీత, హైదరాబాద్‌
థైరాయిడ్‌ సమస్య ఇటీవల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 75 శాతం మంది థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్‌ ఒకటి, థైరాయిడ్‌ గ్రంథి మెడ మధ్య భాగంలో గొంతుకు ముందువైపున సీతాకోకచిలుక ఆకారంలో శ్వానాళానికి ఇరుపక్కలా ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది థైరాయిడ్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. వాటిల్లో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల కలిగే హైపోథైరాయిడిజమ్‌ ఒకటి. ఇక రెండోది థైరాయిడ్‌ గ్రంథి పనితీరు పెరగడం వల్ల కలిగే హైపర్‌థైరాయిడిజమ్‌. ఈ సమస్యలు ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే 20–40 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీది హైపర్‌ థైరాయిడిజమ్‌ కావచ్చని తెలుస్తోంది. ఈ సమస్యను త్వరగా గుర్తించకపోయినా లేదా నిర్లక్ష్యం చేసినా దుష్ప్రభావాలు ఎక్కవగా కనిపిస్తాయి.  థైరాయిడ్‌ గ్రంథిలో వాపు, ఇన్‌ఫ్లమేషన్‌ వంటి కారణాలతో సమస్య రావచ్చు.

లక్షణాలు: ∙కోపం, చికాకు, నీరసం ∙అలసట, ఉద్రేకం, కాళ్లు చేతులు వణకడం ∙హైపర్‌ థైరాయిడిజమ్‌లో ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతుంది ∙అధిక వేడిని తట్టుకోలేకపోవడం ∙నిద్రలేమి, గుండెదడ, చెమటలు పట్టడం ∙ఏకాగ్రత సమస్యలు, స్త్రీలలో నెలసరి త్వరగా రావడం.

నిర్ధారణ పరీక్షలు: టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ స్థాయులు, రక్తపరీక్షలు, థైరాయిడ్‌ యాంటీబాడీస్, థైరాయిడ్‌ స్కానింగ్, అల్ట్రాసౌండ్‌

చికిత్స: హోమియోపతి వైద్యవిధానంలో థైరాయిడ్‌ రావడానికి గల మూలకారణాన్ని విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి, సరైన హోమియో మందులను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. హైపర్‌థైరాయిడ్‌ సమస్యకు హోమియోలో కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, ఐయోడమ్, స్పాంజియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి.

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌

గొంతును ఎక్కువగా వాడేవారికి జాగ్రత్తలివే...
ఇఎన్‌టి కౌన్సెలింగ్‌


నేను ట్యూషన్స్‌ చెబుతుంటాను. ఇటీవల అప్పుడప్పుడూ నాకు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపిస్తోంది. నా గొంతు విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. – ఎన్‌.ఎల్‌. ప్రసాద్, వరంగల్‌
కొంతమందికి గొంతుతోనే పనిచేస్తుంటారు. వీరిని ప్రొఫెషనల్‌ వాయిస్‌ యూజర్స్‌ అంటారు. అంటే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గాయకులు, రేడియోజాకీలు, సేల్స్‌ జాబ్‌లో ఉన్నవాళ్లంతా రోజూ తమ గొంతుతోనే పనిచేస్తూ ఉంటారు. వారి రోజువారీ పనులతో వాళ్ల వోకల్‌ కార్డ్స్‌ ఎంతగానో అలసిపోతాయి. ఇలాంటివారు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

⇒ రోజులో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున మూడుసార్లైనా తమ గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
హైపర్‌థైరాయిడిజమ్‌ తగ్గుతుంది  రోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి.
⇒ఆల్కహాల్‌ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పొగాకు అలవాటును తక్షణం వదిలేయాలి. కాఫీ అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలి.
⇒గొంతు గరగర వచ్చి అది సుదీర్ఘకాలం ఉంటే తప్పకుండా ఈఎన్‌టీ నిపుణులను కలుసుకొని తగిచన చికిత్స తీసుకోవాలి. కొందరిలో యాసిడ్‌ పైకి ఎగజిమ్మడం వల్ల కూడా గొంతులో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివారు తప్పకుండా తమ ఎసిడిటీ తగ్గించుకోవడం కోసం కృషి చేయాలి.

నాకు తరచూ జలుబు చేస్తోంది. గత కొంతకాలం నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా కుదరడం లేదు.  జలుబు టాబ్లెట్‌ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత పదే పదే వస్తోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
– రవికుమార్, శ్రీకాకుళం

మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్‌ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్‌ టాబ్లెట్‌ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్‌ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి.

డాక్టర్‌ ఇ.సి. వినయకుమార్‌
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు