నాకు ఎందుకంత నీరసం..?

14 Mar, 2017 23:20 IST|Sakshi
నాకు ఎందుకంత నీరసం..?

గైనిక్‌ స్పెషల్‌

ప్రస్తుతం నేను ఐదో నెల గర్భిణిని. గత కొంతకాలంగా ఏ చిన్న పనిచేసినా ఎక్కువగా అలసిపోతున్నాను. ఎప్పుడూ నిస్సత్తువ, నీరసం. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. గర్భవతిని కాకముందు పీరియడ్స్‌ సమయంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యేది. ఇలా ఎందుకు ఉంటోంది? ఈ అలసట తగ్గడానికి ఏం చేయాలి? – వినీత, నల్లగొండ
మీరు చెప్పిన లక్షణాలతో పాటు మీరు గర్భవతి కాకముందు రుతుసమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరిగేదన్న హిస్టరీ ఆధారంగా మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది ప్రధానంగా పోషకాహార లోపం వల్ల మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది.

రక్తంలో హీమోగ్లోబిన్‌ తక్కువగా ఉంటే మీరు చెప్పినట్లుగా తొందరగా అలసిపోవడం, నీరసంగా, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో  పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌–సీబీపీ) చేయించాలి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తర్వాతి పరీక్షలను నిర్ణయిస్తారు.

ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఐరన్‌ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం జరుగుతుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది చాలా సాధారణమైన అంశం. కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 12 లేదా 14వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్‌ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్‌ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్‌ టాబ్లెట్‌ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో రక్తం బాగాపడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ డాక్టర్‌ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకొని దాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోండి. అలాగే మీ బీపీ ఎంత ఉందో కూడా పరీక్ష చేయించుకోండి.

ఇక గర్భవతులందరూ రక్తహీనతను నివారించుకోవడం కోసం మంచి బలవర్ధకమైన ఆహారం అంటే... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం  వల్ల హిమోగ్లోబిన్‌ను పొందగలరు.

రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్‌ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం జరుగుతుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది చాలా సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 12 లేదా 14వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్‌ టాబ్లెట్లను సూచిస్తుంటాం.

వైట్‌డిశ్చార్జ్‌ అవుతోంది... ఆందోళనగా ఉంది
నా వయసు 22 ఏళ్లు. పెళ్లికాలేదు. నాకు ప్రతిరోజూ యోని నుంచి వైట్‌డిశ్చార్జ్‌ వెలువడుతోంది. కేవలం పీరియడ్స్‌ ముందు మాత్రమే కొంచెం అలా అవుతుంటుందని, మామూలు వేళల్లో ఇలా రావడం మంచి సూచన కాదని తెలిసినవాళ్లు అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. వీలైతే పరిష్కారం సూచించండి.   – ఒక సోదరి, హైదరాబాద్‌

మీ వయసులో ఉన్న ఆడపిల్లలు, పెళ్లికాని అమ్మాయిల్లో తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌), యోనిభాగంలో మ్యూకస్‌ గ్రంథులు ఉంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల వాటి నుంచి నీరులాంటి, వాసనలేని స్రావాలు వెలువడుతుంటాయి. అవి నెలసరికి ముందు, నెలసరి మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనివల్ల వాసన, దురద ఉండదు. ఈ స్రావాలు ఏమాత్రం హానికరం కాదు.

అయితే కొందరిలో మాత్రం ఫంగల్, బ్యాక్టీరియల్, ట్రైకోమొనియాసిస్, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల వైట్‌ డిశ్చార్జి అవుతుంది. ఇది కాస్త పేరుకుపోయినట్లుగానూ, పాలు విరిగినట్లుగానూ, నురగలా, కొంచెం పచ్చగా ఉండి, దురద, మంట, వాసనలు కలిగి ఉంటుంది. ఇలాంటి దాన్ని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొంతమందిలో నులిపురుగులున్నా, వైట్‌డిశ్చార్జ్‌ అవుతుంది. కొంతమందిలో రక్తహీనత వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్‌ హైజీన్‌) లోపించడం వల్ల కూడా ఇదే సమస్య రావచ్చు. బిగుతైన దుస్తులు ధరించేవారిలో మహిళల ప్రైవేట్‌ పార్ట్స్‌ ప్రాంతంలో చెమట ఎక్కువగా పట్టి ఇన్ఫెక్షన్స్‌కు దారితీయవచ్చు.

జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు కొందరు యాంటీసెప్టిక్‌ లోషన్స్‌తో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేసుకుంటుంటారు. అలా చేయడం సరికాదు. దానివల్ల యోనిభాగంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (లాక్టోబాసిలై) నశిస్తాయి. ఇవి యోనిలో స్రావాలు సరైన ‘పీహెచ్‌’ పాళ్లలో ఉండేలా చూసి, ఇన్ఫెక్షన్స్‌ నుంచి కాపాడుతుంటాయి. మీరు అక్కడ శుభ్రం చేసుకోవడం కోసం మార్కెట్‌లో దొరికే లాక్టోబాసిలైతో కూడిన ‘ఫెమినైన్‌ వాష్‌’లను వాడుకోవచ్చు.

ఆహారంలో తీసుకునే పెరుగులో కూడా లాక్టోబాసిలై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువగా వాడటం కూడా మంచిదే. లోదుస్తులుగా కాటన్‌ ప్యాంటీస్‌ వాడటం వల్ల, వాటికి చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్‌ అవకాశాలు తగ్గుతాయి.

పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా మీ ప్రైవేట్‌పార్ట్స్‌ ఆరోగ్యంతో పాటు మీ సాధారణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరింత నిర్దిష్టమైన చికిత్స కోసం మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు.

పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా మీ ప్రైవేట్‌పార్ట్స్‌ ఆరోగ్యంతో పాటు మీ సాధారణ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

డాక్టర్‌ భార్గవి కాటంరెడ్డి
కన్సల్టెంట్‌– అబ్‌స్టెట్రిషియన్‌ అండ్‌గైనకాలజిస్ట్, బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో,బంజారాహిల్స్,
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు