కీళ్ళనొప్పి ఎందుకు వస్తుంది?

24 Mar, 2017 23:47 IST|Sakshi
కీళ్ళనొప్పి ఎందుకు వస్తుంది?

అవగాహన

దేహంలో కీళ్ళ మధ్య ఒత్తిడిని తగ్గించి మృదువైన కదలికలకు తోడ్పడే కార్టిలేజ్‌ (దేహంలో కీళ్ళు ఉన్నచోట ఉండే రక్షిత కణజాలం) క్షీణించడం మొదలైనప్పుడు వస్తుండే నొప్పినే ‘ఆస్టియో ఆర్థరైటిస్‌’ అంటారు. నొప్పితో పాటు కొందరిలో వాపు కూడా ఉంటుంది. ఇది తీవ్రస్ధాయికి చేరినప్పుడు అడుగుతీసి అడుగు వేయడం, చేతులు కదిలించడం కష్టమవుతుంది. దేహంలో కార్టిలేజ్‌ దెబ్బతిన్న ప్రదేశాన్ని బట్టి బాధ తీవ్రత ఉంటుంది. ఆర్థరైటిస్‌ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా జన్యుపరమైన అవసవ్యతల వల్ల ఇలా జరుగుతుంటుందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఆర్థోపీడిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శిశిర్‌ రస్తోగీ అంటున్నారు.

గంటల తరబడి కుర్చీలోంచి కదలకుండా పని చేయడం, స్థూలకాయం, వ్యాయామానికి తావు లేని జీవన శైలి, పౌష్ఠికాహార లోపం... ఆర్థరైటిస్‌కు ఇతరత్రా కారణాలు. కొన్ని సార్లు ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్‌గా పొరబడుతుంటారు. అవగా హన లోపం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఇవి రెండూ రెండు రకాల సమస్యలు. ఎముకలు డొల్ల బారడం... ఆస్టియోపోరోసిస్‌. కీళ్ళ నొప్పులు... ఆస్టియో ఆర్థరైటిస్‌. మనదేశంలో రెండూ ఎక్కువే.

ప్రైమరీ, సెకండరీ అని ఆర్థరైటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులు ప్రైమరీ. ఏదైనా వ్యాధి కారణంగా, గాయం వల్లా వచ్చే ఆర్థరైటిస్‌.... సెకండరీ. ‘‘ఆర్థరైటిస్‌ను నివారించేందుకు ఉన్న అత్యుత్తమ మైన మార్గం వ్యాయామం. క్రమబద్ధంగా, సవ్యంగా వ్యాయామం చేస్తుండాలి. బైఠాయించి నట్లు కూర్చుండిపోవడం, కాళ్ళుకత్తెరలా పెట్టి కూర్చోవడం మంచిది కాదు. అలాగే ఎప్పటి కప్పుడు బరువు చూసుకుంటుండాలి. బరువు పెరిగితే కీళ్ళు ఒత్తిడికిలోనై కార్టిలేజ్‌ బలహీన పడే ప్రమాదం ఉంది. ఒంట్లో యూరిక్‌ ఆసిడ్‌ నిల్వలు ఎక్కువైనప్పుడు కూడా ఆర్థరైటిస్‌ రావచ్చు’’ అని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ ఆర్థోపీడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నవీన్‌ తల్వార్‌ అంటున్నారు.

మరిన్ని వార్తలు