సారీ.. అమ్మా!

23 Aug, 2016 23:20 IST|Sakshi
సారీ.. అమ్మా!

లీగల్ స్టోరీస్

‘మొన్న కమల్ హాసన్, సారిక... నిన్న  మహిమా, లియాండర్ పేస్... నేడు సైఫ్ అలీఖాన్,  అమృతా!  వీళ్లిద్దరి బ్రేకప్‌పై గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఎట్టకేలకు చట్టబద్దంగా విడాకులు పొంది తమ ప్రేమ పెళ్లికి ‘ది ఎండ్’ పలికారు సైఫ్, అమృతా. ఈ సందర్భంగా  బాలీవుడ్ బ్రేకప్స్‌పై ఓ ప్రత్యేక కథనం... ’

 

 
గ్రీష్మ, గౌతమ్‌ల కథ

ఇద్దరూ టీవీలో పని చేస్తారు. గ్రీష్మ.. పేరున్న వార్తా చానల్‌లో సీనియర్ న్యూస్ ప్రజెంటర్. అంతే పేరున్న ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో గౌతమ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. గ్రీష్మకు చానల్‌లో ఎంత మంచి పేరుందో బయటా అంతే. బోలెడంతమంది అభిమానులు. వాళ్లలో ఒక అభిమానిగా గ్రీష్మకు పరిచయమయ్యాడు గౌతమ్. అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఆ ప్రేమను పెళ్లిగా మలుచుకున్నారు. బాబూ పుట్టాడు. వాడే గోకుల్. కాలం గడుస్తున్నకొద్దీ గ్రీష్మ ఇమేజ్ పెరుగుతోంది. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా, ఏ పార్టీకి అటెండ్ అయినా గ్రీష్మే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్!

 

గ్రీష్మకు అందే ఆ అభినందనలు, ప్రశంసలు గౌతమ్‌కు ఇబ్బందిగా మారాయి. గ్రీష్మ ముందు తానో అనామకుడు అనే భానవలోకి వెళ్లిపోయాడు. ఈగో దెబ్బతింది. ఇల్లు నరకం అయింది. అయినా గౌతమ్‌ను అర్థం చేసుకునే ప్రయత్నమే చేసింది గ్రీష్మ. అతనికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా చూసేది. కొడుకు గోకుల్ కోసం గౌతమ్ ఎన్నన్నా భరించేది. ఎంతచేసినా గౌతమ్‌లో ఇన్ఫీరియారిటీ తగ్గలేదు. వేసవి సెలవులు మొదలవగానే బాబును తీసుకొని తమ ఊరెళ్లి, అమ్మానాన్నల దగ్గర కొంతకాలం ఉండి వస్తానని చెప్పాడు గ్రీష్మతో.  ఊరు, వాతావరణం కాస్త మారి, చేస్తున్న పని నుంచీ కొంత బ్రేక్ దొరికితే గౌతమ్‌లో కాస్త మార్పు వస్తుందన్న ఆశతో సరే అంది.


ఆ వెళ్లడం... వేరు కావడానికే!
నాలుగు నెలలైనా తిరిగిరాలేదు. ఫోన్ చేసినప్పుడల్లా ‘ఎప్పుడొస్తున్నారు’ అని అడిగితే ఒకసారి ఇల్లు బాగు చేయిస్తున్నానని, ఇంకోసారి పొలం వ్యవహారాలని, మరోసారి ఆస్తి విషయాలు చక్కదిద్దుతున్నాని అలా తడవ తడవకు ఓ నెపం చెప్తుండేవాడు. గ్రీష్మకూ అనుమానం కలగలేదు నోటీస్ అందేదాకా! ఎంత ప్లాన్డ్‌గా ఉన్నాడు? కావాలనే కొడుకును తనకు దూరం చేసి తన తల్లిదండ్రులకు దగ్గర చేశాడు. ఉద్యోగానికీ రాజీనామా చేశాడు. ఇవేవీ తన ఊహకు అందలేదంటూ లాయర్ దగ్గర వాపోయింది గ్రీష్మ. ఆ వెళ్లడం తన నుంచి వేరుకావడానికే అన్న నిజం ఆమెను దహించేస్తోంది. ఎంత మోసం! అవమానం దుఃఖం రూపంలో పొంగుకొస్తోంది. గ్రీష్మ పరిస్థితి అర్థమైన ఆమె లాయర్  బాబు కస్టడీ కోసం పిటీషన్ వేయించింది. కోర్టుకు హాజరయ్యేందుకు ఆమెను సిద్ధం చేసింది.

 

టెలీప్రాంప్టర్‌లోని యాంకర్‌పార్ట్‌ని చదివేసి విజువల్స్, వాయిస్ ఓవర్ కోసం చూసింది గ్రీష్మ. ఆ బులెటిన్‌లో ఆఖరు వార్తల్లో అది ఒకటి. మరో అయిదు నిమిషాల్లో బులెటిన్ ముగించుకొని గ్రీన్ రూమ్‌లోకి వచ్చేసింది. మేకప్ తుడుచేసుకుంటూ తన పదేళ్ల కొడుకు గోకుల్ గురించే ఆలోచిస్తోంది.


కళ్లలో మెదులుతున్నాడు
ఎందుకో పొద్దుటినుంచీ పదే పదే గుర్తొస్తున్నాడు గోకుల్. దాదాపు నాలుగు నెలలైంది నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లి. వేసవి సెలవుల్లో వెళ్లాడు. స్కూల్ మొదలై రెండు నెలలైనా రావట్లేదు. వాళ్ల నాన్నతో పాటే అక్కడ ఉండి పోయాడు. ‘వాడికి స్కూల్ పోతోంది.. ’ అని గౌతమ్‌తో ఎంత అంటున్నా ఏదో కారణం చెప్తూ వాయిదా వేస్తున్నాడు. ‘తనకూ ఉద్యోగం ఉంది. ఆ ధ్యాసే లేదు మనిషికి..’ విసుక్కుంది మనసులోనే. గోకుల్ కళ్లలో మెదులుతున్నాడు. వాడిని మిస్ అవుతోంది. ఈ వీక్లీ ఆఫ్ తర్వాత... ఎలాగైనా లీవ్ తీసుకొని వాడిని తెచ్చేయాలి. వాడు లేకపోతే ఉండలేదు తను... కృత నిశ్చయానికి వచ్చింది గ్రీష్మ ఐ షాడో తుడిచేసుకుంటూ!

 
భర్త నుంచి డైవోర్సు నోటీసు!

మాయిశ్చరైజర్ అరచేతిలో వేసుకుంటుంటే వచ్చాడు అటెండర్. ‘మేడమ్.. మీకు నోటీసులేవో ఇవ్వాలట. కోర్టు ఎంప్లాయి వచ్చాడు’ అని చెప్పి వెళ్లిపోయాడు. ‘నాకు కోర్టు నోటీసులేంటీ’ అనే అనుమానం, కంగారు కలగలసిన భావంతో గబగబా వెళ్లింది. కోర్టు ఎంప్లాయీ ఓ కవర్‌ను గ్రీష్మ చేతిలో పెట్టి ఆమెతో సంతకం చేయించుకొని వెళ్లిపోయాడు.


కవర్ తెరిచింది ఆమె. ‘ఫలానా తేదీనాడు కోర్టుకు హాజరుకావాలి’ అనే  నోటీసుతో పాటు భర్త వేసిన డైవోర్సు పిటీషన్ కాపీ ఉంది! గ్రీష్మకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అలాగే సోఫాలో కూలబడింది. ఊహించని పరిణామం. అంతకుముందే తాను చదివిన వార్త గుర్తొచ్చింది.. బాలీవుడ్ బ్రేకప్స్! ఇప్పుడు తమ దాంపత్య జీవితం కూడా ఓ బ్రేకప్ స్టోరీగా మారనుందా?


కోర్టు ట్రయల్స్
గౌతమ్ చేతిని పట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ కొడుకును చూసేసరికి గ్రీష్మ గుండె చెరువైంది. వెళ్లి పిల్లాడిని గట్టిగా హత్తుకోవాలని గోకుల్ దగ్గరకు పరిగెత్తింది. వాడు అమ్మను చూసి విసురుగా మొహం తిప్పేసుకొని తండ్రిని వాటేసుకున్నాడు. ఖంగుతిన్నది గ్రీష్మ వాడి ప్రవర్తనకు. ‘రారా.. ’ అంటూ పిలిచినా అమ్మను చూడలేదు సరికదా.. అసలు ఆమె ఉనికినే గ్రహించనట్టు ఉండిపోయాడు. ఈలోపే గోకుల్‌ని తన చాంబర్‌లోకి పిలిపించుకున్నారు జడ్జీ.


‘నీ పేరేంటి?’ అడిగారు జడ్జీ.
‘గోకుల్’ ‘ఏం చదువుతున్నావ్?’
‘ఫిఫ్త్‌క్లాస్’ ‘అమ్మ దగ్గరకు వెళ్తావా?’

‘ఊహూ’ అని తల అడ్డంగా తిప్పుతూ, ‘నేను మా నాన్న దగ్గరే ఉంటా. నాకు మా నాన్నే కావాలి, అమ్మ దగ్గరకు వెళ్లను. అమ్మ నన్ను పట్టించుకోదు. లేట్‌గా ఇంటికొస్తుంది. ఎవరెవరో అంకుల్స్‌తో మాట్లాడుతుంది. నాకు అమ్మంటే ఇష్టం లేదు’ అని టకటకా చెప్తూ గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు గోకుల్. ‘నాకు నాన్నే కావాలి’ అని ఏడుపుతో వచ్చిన వెక్కిళ్ల మధ్య చెప్పాడు.


అంతా విన్న జడ్జి ఇంటెరిమ్ కస్టడీ తండ్రికే ఇచ్చారు. వారానికి ఒకసారి బాబును చూసేలా గ్రీష్మకు ఆర్డర్స్ వచ్చాయి. మనస్తాపంతో ఆ తర్వాత వాయిదాలకు అటెండ్ కాలేదు గ్రీష్మ. దాంతో గౌతమ్‌కు ఎక్స్‌పార్టీ డైవోర్స్ మంజూరయ్యాయి. కొడుకు మనసును భర్త కలుషితం చేశాడని అర్థమైన గ్రీష్మ వాడి లేత మనసు మీద ఒత్తిడి పెట్టడం ఇష్టంలేక ప్రయత్నాలు చాలించుకుంది.


ఇది జరిగిన మూడేళ్లకు...
గోకుల్‌ను వేరే రాష్ట్రంలోని హాస్టల్‌లో గౌతమ్ చేర్పించాడని, తాను మళ్లీ పెళ్లిచేసుకున్నాడనీ తెలిసింది గ్రీష్మకు. అప్పటికి గోకుల్‌కు పద్నాలుగేళ్లు. నైన్త్ క్లాస్‌లో ఉన్నాడు. ఎవరేంటి అని ఆలోచించే శక్తి వచ్చింది. పరిస్థితులూ అర్థమవుతున్నాయి. నాన్న మనస్తత్వం, తాతయ్య. నానమ్మల తీరూ తెలుస్తోంది. అమ్మ గుర్తొస్తోంది చాలా! గ్రీష్మకూ కొడుకును కలవానుంది. మధ్యవర్తుల ద్వారా కొడుకు ఉంటున్న ఊరు, హాస్టల్ వివరాలు తెలుసుకుంది. వెళ్లింది. తనకన్నా పొడుగయ్యాడు. కొడుకును చూసుకొని మురిసిపోయింది. తల్లిని చూసి తలవంచుకున్నాడు గోకుల్. ‘ఎలా ఉన్నావ్ నాన్నా.... ’ వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ అడిగింది గ్రీష్మ. కాని ఆపుకోవడం వాడివల్ల కాలేదు. అందుకే ‘అమ్మా.. ’ అని ఏడుస్తూ గ్రీష్మను వాటేసుకున్నాడు. ‘సారీ.. అమ్మా.. మిస్ యు లాట్..’ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. వాడి తల, వీపు నిమురుతూ ఓదార్చింది గ్రీష్మ. ‘తనతో ఉండనని కోర్టులో చెప్తే కొడతానని బెదిరించారు నాన్న, నువ్వు మంచిదానికి కాదని చెప్పమన్నారు. సారీ అమ్మా... నేను అబద్ధం చెప్పాను, తప్పు చేశాను’ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఓవైపు కొడుకును ఓదారుస్తూ, ఇంకోవైపు తనేం చేయాలో ఆలోచించింది.


కొడుకు కోసం మళ్లీ కోర్టుకు...
కొడుకు దగ్గర్నుంచి వచ్చాక వాడి కస్టడీ కోసం మళ్లీ కోర్టుకు వెళ్లింది గ్రీష్మ. లీగల్‌గా కొడుకును తన దగ్గరకు తెచ్చుకుంది. తండ్రి ప్రేమనూ దూరం చేయకూడదని  కొడుకు పట్ల తండ్రి విజిటేషన్స్ రైట్స్‌కి అంగీకరించింది. ఇప్పుడు గోకుల్ గ్రీష్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు. ఏ రోజూ గౌతమ్ గురించి కొడుకు దగ్గర నెగెటివ్‌గా మాట్లాడదు. తప్పుగా చెప్పదు. గోకుల్ పాజిటివ్ వాతావరణంలో ఎదిగేలా  చేస్తోంది.  - సరస్వతి రమ


ఇంటెరిమ్ కస్టడీ అంటే..
1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం పిల్లల ఇంటెరిమ్ కస్టడీకి భార్యాభర్తల్లో ఎవరైనా పిటీషన్ వేసుకోవచ్చు. అది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే. 1956 హిందూ మైనారిటీ అండ్ గార్డియన్ షిప్ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం మైనర్ పిల్లలకు తండ్రి మొదటి సహజ సంరక్షకుడు. తండ్రి తర్వాత తల్లి సహజ సంరక్షకురాలు. ఒకవేళ వివాహేతర సంబంధం ద్వారా జన్మించిన పిల్లలైతే తల్లే మొదటి సంరక్షకురాలవుతుంది. తర్వాతే తండ్రి అవుతాడు. మామూలుగా అయిదేళ్లు నిండని పసిపిల్లల కస్టడీని స్వతహాగా తల్లికే ఇస్తారు. కస్టడీ కేస్‌లలో తల్లిదండ్రుల హక్కుల కన్నా పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. మైనర్ బాలిక కస్టడీ విషయానికి వస్తే .. తొమ్మిదేళ్లు దాటితే ప్యూబర్టీ ఏజ్. ఆ సమయంలో తల్లి కేర్ అండ్ అటెన్షన్ ఆడపిల్లలకు తప్పకుండా అవసరం కాబట్టి వాళ్ల కస్టడీని కొన్ని సందర్భాల్లో తల్లికే ఇస్తున్నారు. ఏదేమైనా పిల్లల కస్టడీ కోసం కోర్టులకెక్కే దంపతులకు ఒక చిన్న విన్నపం. అమ్మ మీద నాన్న, నాన్న మీద అమ్మ లేనిపోనివి చెప్పి పిల్లల మనసులను కలుషితం చేయకండి. వారి లేత మనసులను పాడు చేయకండి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసి ఉండి, పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేయండి. సందర్శన హక్కులు పొందిన వాళ్లను దయచేసి నిరోధించకండి.

ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

మరిన్ని వార్తలు