గర్భ వ్యూహం

2 Jan, 2017 23:25 IST|Sakshi
గర్భ వ్యూహం

సుభద్ర నిండు గర్భంతో ఉంటుంది.
అర్జునుడు పద్మవ్యూహం గురించి చెబుతుంటే...
అమ్మ కడుపులోని అభిమన్యుడు వింటాడు.
అలాగే కృష్ణవేణి కూడా
‘జెండర్‌ వ్యూహం’ గురించి వినింది.
జెండర్‌ వ్యూహంలోకి ప్రవేశించి,
మిస్టర్‌ కృష్ణవేణిగా ఎదిగింది.
కానీ ఆ ట్రాప్‌లోంచి బయటికి రాలేకపోయింది!
జెండర్‌ వ్యూహం అంటే.. లింగ వివక్ష అనే పద్మవ్యూహం.
మన సమాజంలో ఆడమగ జెండర్‌ వ్యూహాలు
కురుక్షేత్ర వ్యూహాల కంటే తక్కువేం కాదు.
మరి ఈ గర్భవ్యూహాన్ని కృష్ణవేణి ఎలా ఛేదించింది?
కొడుకు, కొడుకు అని...‘కొడుకు పిచ్చితో’ కలవరించే వారికి
కృష్ణవేణి కథ ఎలాంటి గుణపాఠం అయింది?
ఈ పాస్ట్‌ లైఫ్‌ స్టోరీ చదవండి.
మీ ఫ్యూచర్‌ లైఫ్‌కి ఓ దారి దొరుకుతుంది.


‘‘కృష్ణవేణి గారూ! మీ అండాశయంలో కణుతులు (ఒవేరియన్‌ సిస్ట్‌లు) ఏర్పడడం వల్ల మీకు నెలసరి క్రమంగా రావడం లేదు. ఈ సమస్య వల్లే పిల్లలు పుట్టడం లేదు. మందులు రాసిస్తాను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి..’’ డాక్టర్‌ చెప్పిదానికి తలూపి బయటకు వచ్చింది కృష్ణవేణి. తను రోజూ జిమ్‌కి వెళుతుంది. స్పోర్ట్స్‌ ఆడుతుంది. మంచి ఫుడ్‌ తీసుకుంటుంది. అయినా ఈ సమస్యలో మార్పు లేదు. మెచ్యూర్‌ అయిన దగ్గర నుంచీ ఈ సమస్య బాధిస్తూనే ఉంది. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పెళ్లయ్యాక మరీ ఈ రెండేళ్లుగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ‘‘ముప్ఫై మూడేళ్లు దాటాయి. ఇంకా పిల్లలు పుట్టడం లేదు’’ అని మేనత్త అన్నప్పటి నుంచీ ఆందోళన ఎక్కువైంది. ఆఫీసు పనుల్లో తలమునకలుగా ఉంటోంది కానీ, రోజు రోజుకూ ఒంటరినైపోతున్నట్టు అనిపిస్తోంది. ఏడాది క్రితం అమ్మనాన్న చనిపోయినప్పటి నుంచీ ఈ ఒంటరితనం మరీ పెరుగుతోంది. ఆలోచిస్తూనే కారులో ఇంటికి చేరుకుంది కృష్ణవేణి.
కృష్ణవేణి ఓ ప్రైవేట్‌ బ్యాంకులో మేనేజర్‌. భర్త రాకేశ్‌ టూరిజమ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఎవరికైనా తన జీవితం చూస్తే కుళ్లుగా ఉంటుంది. కానీ, తను ఎంతగా కుమిలిపోతోందో ఎవరికీ తెలియదు. చివరకు భర్త రాకేశ్‌కి కూడా. ఈ మధ్య రాకేశ్, ఆఫీసులో కొలీగ్‌తో తిరుగుతున్నాడని తెలిసింది. అప్పటి నుంచి తమ మధ్య గొడవలు. ఈ గొడవలు ఇలాగే పెరిగితే కలిసుండడం కష్టమే! తలనొప్పిగా అనిపిస్తే మాత్ర వేసుకొని తన రూమ్‌లోకి వెళ్లిపోయింది కృష్ణవేణి.

తను తనులా ఉండలేక..!
ఉదయాన్నే ఆఫీసుకు బయల్దేరుతూ అద్దంలో తనను తాను చూసుకుంది. భుజాలను తాకుతుండే హెయిర్‌. ఒంటి మీద ఖరీదైన సూట్‌. మెడలో సన్నటి డైమెండ్‌ చైన్‌. తనకు ఇలాగే ఉండటం ఇష్టమా?! ఏదో సందిగ్ధం. ఆ వెంటనే తన హోదా, దర్పం గుర్తుకు వచ్చాయి. ఇంట్లో, ఆఫీసులో తన కనుసన్నల్లో మెలిగే పనివారు. తను ఈ దశకు రావడానికి కట్టుకున్న ఒక్కో మెట్టు గుర్తుకు వచ్చింది కృష్ణవేణికి.
‘అమ్మానాన్నలకు తను ఒక్కర్తే కూతురు. చిన్నప్పటి నుంచీ తను చాలా ట్యాలెంటెడ్‌. స్కూల్‌లో టాపర్‌. స్పోర్ట్స్‌లో టాపర్‌. గోల్డ్‌మెడల్‌ సాధించినప్పుడల్లా అమ్మానాన్న కళ్లలో మెరుపులు. వాళ్లను ఇంకా ఇంకా సంతోషపెట్టడానికి గెలుచుకున్న పతకాలు. ‘సూర్యారావుకు పుట్టింది కూతురు కాదు, కొడుకే’ అనేవారు అంతా! తనను పూర్తి పేరుతో కాకుండా అందరూ ‘కృష్ణ’ అనే పిలిచేవారు. ‘మా కూతురు అని చెప్పడం కాదు కానీ, అబ్బాయిలకు కూడా ఉండదు అంత ధైర్యం’ అని గర్వంగా ఫ్రెండ్స్‌కు పరిచయం చేసేవాడు నాన్న. అలా తను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పెరిగింది. అమ్మానాన్నలు ఏది చెప్పినా అది చేసెయ్యడానికి సిద్ధం అన్నట్టు ఉండేది.

కుటుంబం... ఇమడని బంధం
‘‘లక్ష్యసాధనలో పెళ్లి ఎప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది. నా వయసు వారందరికీ పెళ్లై పిల్లలు ఉన్నా నాకెప్పుడూ పెళ్లి ధ్యాస లేదు. స్నేహితులలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. కానీ, వారిలో ఎవరినీ పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ముప్ఫై ఏళ్లు దాటుతుండగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు అమ్మనాన్న. అప్పటికీ అయిదారు సంబంధాలు చాలా దగ్గరగా వచ్చాయి. కానీ, ‘మా అబ్బాయి కొంచెం నెమ్మదస్తుడనో, మీ అమ్మాయిని అందుకోలేడనో...’ వారి నుంచి తర్వాత కబురు వచ్చేది. ఆ కబురు నాన్నకు చాలా గర్వంగా అనిపించేది. అది చూసి నాకు సంతోషం కలిగేది. చివరకు నాన్న స్నేహితుడి కొడుకు రాకేశ్‌తో పెళ్లి ఓకే అయ్యింది. హడావిడి లేకుండా సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్, తర్వాత రిసెప్షన్‌ అంటే రాకేశ్‌ ‘సరే’ అన్నాడు. పెళ్లయ్యింది.

ఇగోల రాజ్యం
నాకెప్పుడూ నా చుట్టూ ఉన్నవారి మీద పైచేయి సాధించడం చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ప్రతిభే నన్ను శిఖరాలకు చేర్చింది. రాకేశ్‌ సంపాదన కన్నా నా జీతం మూడు రెట్లు ఎక్కువైంది. మొదట్లో మేం ఇద్దరం బాగానే ఉన్నాం. కానీ, ఇంట్లో తన పెత్తనమే సాగుతున్నట్టు పనివాళ్ల ముందు తన గొప్పలు చూపించేవాడు రాకేశ్‌. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్దగా గొడవలు అవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మరొకామెతో తిరుగుతున్నాడు అనే వార్త. ఇక ఈ కుటుంబ జీవనం నాకు సెట్‌ కాదు. విడాకులకు అప్లై చేయాల్సిందే!’ అనుకోగానే దుఃఖం కమ్మేసింది. చనిపోయిన అమ్మానాన్న గుర్తుకువచ్చారు. ‘ఎంతో గెలిచాను అనుకున్న జీవితంలో ఏం గెలుచుకున్నాను...’ ఈ ఆలోచనే రోజు రోజుకూ కుంగదీస్తోంది.

అంతర్‌ శిశువు గుర్తింపు...
కృష్ణవేణి చెప్పిందంతా విన్న కౌన్సెలర్‌... ‘‘మీరు కుటుంబ జీవనం వద్దనుకుంటారు. అదే క్షణంలో ‘ఈ జీవితం చేజారిపోతే...’ అనే భయంలోనూ ఉన్నారు. ఫిట్‌నెస్‌ పట్ల ఎంత శ్రద్ధ చూపినా ఆరోగ్యం ఎందుకు సరిగా ఉండడం లేదో ప్రశ్నార్థకంగా ఉంది మీకు..’’
కౌన్సెలర్‌ చెబుతున్న మాటలకు అవునన్నట్టుగా తలూపింది కృష్ణవేణి. బ్యాంక్‌ పని మీద టూర్‌ వెళ్లినప్పుడు అనుకోకుండా ‘పాస్ట్‌ లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపీ వర్క్‌షాప్‌’కి అటెండ్‌ అయ్యింది కృష్ణవేణి. ‘నాలో ఏమిటీ సందిగ్ధం? ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నానంటూ...’ తన మనసులో దాగున్న సందేహాలను కౌన్సెలర్‌ ముందుంచింది.

‘‘అది మీరే తెలుసుకోండి..’’ అంటూ థెరపీని మొదలుపెట్టారు కౌన్సెలర్‌.కౌన్సెలర్‌ ఇచ్చిన సూచనల మేరకు కృష్ణవేణి కళ్లు మూసుకొని విశ్రాంతిగా పడుకుంది. ధ్యానచక్రంలో తనను తాను దర్శించడం మొదలుపెట్టింది. అంతర్‌నేత్రంతో తన జీవన ప్రయాణాన్ని దర్శిస్తోంది. కాసేపటికి ఎవరో తనను చూస్తూ గట్టిగట్టిగా నవ్వుతూ, హేళన చేస్తున్నట్టు అనిపించింది.

‘చూడు... బాగా చూడు. నేను ఎవరినో కాదు.. నీలో ఉన్న చిన్ని శిశువును. నీ జీవితాన్ని ఆనందమయం చేసే అంతర్‌ శిశువును. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావు. నువ్వు అందరిలో అబ్బాయిలా ప్రశంసలు పొందడానికి నన్ను దూరం చేసుకున్నావు...’ ఈ మాటలు ఎక్కడ నుంచో కాదు. తన అంతరాంతరాళాలలో నుంచి వస్తున్నవి. ఆశ్చర్యంగా వింటోంది ఆ మాటల్ని.
ఆ గొంతు మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది– ‘నీ జీవితమంతా దర్శించు. ఎక్కడ నన్ను పోగొట్టుకున్నావో చూడు. నేను ఎన్నిసార్లు బాధ పడ్డానో గమనించు’ అంది.

ఆ మాటలకు కృష్ణవేణి తన 33 ఏళ్ల వయసు హోదా నుంచి 23 ఏళ్ల వయసు ఆలోచనల్లోకి ప్రయాణించింది. అటు నుంచి 13 ఏళ్ల వయసుకు... ఆ తర్వాత మూడేళ్లకు, ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రయాణించిన కృష్ణవేణికి ఏదో చేజారిన గొలుసు చేతికి చిక్కినట్టు ఆగిపోయింది. తన స్థితిని చెప్పడం మొదలుపెట్టింది–

ఆశయం పేరుతో నిర్లక్ష్యం...
‘అమ్మ పొట్టలో హాయిగా ఉన్న నాకు ఎవరివో మాటలు వినిపించాయి. అవి మా నానమ్మవి. ‘చూడమ్మాయి! పురిటికి పుట్టింటికి వెళుతున్నావ్‌. వచ్చేటప్పుడు ఈ ఇంటికి వారసుడిని తీసుకురా!’ అంటోంది అమ్మతో. ‘అబ్బాయి పుడితే ఎలా పెంచుతానో చూడు..’ అంటున్నాడు అమ్మతో నాన్న.నాన్నమ్మ, నాన్న మాటలతో అమ్మలో రకరకాల ఒత్తిళ్లు. అబ్బాయే పుట్టాలని అమ్మ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. మరి, నేను ఆడపిల్లనే. ఇలా పుడితే వీళ్లంతా చాలా డిసప్పాయింట్‌ అవుతారు ఎలా?! ఈ ఆలోచనతో అలాగే పుట్టాను. ఆడపిల్ల పుట్టిందని నానమ్మ, నాన్న నన్ను చూడడానికి కూడా రాలేదు.

అప్పుడు ‘ఆడపిల్లను కాబట్టి వీళ్లు వద్దనుకున్నారు. కానీ, అబ్బాయి కంటే దేనిలోనూ తక్కువ కాదు నిరూపిస్తాను’ అనుకున్నాను. ‘అక్కడేరా బుజ్జీ నిన్ను దూరం చేసుకున్నాను. అమ్మనాన్నలకు నచ్చేట్టు అబ్బాయికన్నా మిన్నగా ఉండాలనుకున్నాను. చదువులో టాప్, ఆటల్లోనూ టాప్‌ అనిపించుకున్నాను. నేను అబ్బాయిలా ఉండటానికి చేసే ప్రయత్నంలో నాలో ఉన్న నిన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. మగవారికన్నా బెస్ట్‌ అనిపించుకోవాలని రేయింబవళ్లు కష్టపడ్డాను. ఉద్యోగంలోనూ ఉన్నత స్థాయికి వెళ్లాను. కానీ, స్త్రీత్వాన్ని నిర్లక్ష్యం చేశాను. అబ్బాయిలా మారిపోయాను. అందుకే నాలో గైనిక్‌ సమస్యలు మొదలయ్యాయి. దీనివల్లే పీరియడ్స్‌ సరిగా రాకపోవడం, ఒవేరియన్‌ సిస్ట్‌లు ఏర్పడటం జరుగుతున్నాయి...’’ ఉద్వేగంగా చెబుతూనే ఉంది కృష్ణవేణి. బాల్యమంతా తల్లిదండ్రిని గెలిపించడం కోసం తలపెట్టిన ప్రతి పని ఎంత కష్టంగా నెగ్గుకువచ్చిందో తెలుసుకున్న కొద్దీ ఆమె హృదయం కరిగి నీరై, కళ్ళ వెంట వర్షిస్తోంది. అంతర్‌శిశువు సంతోషంగా ఉండడానికి ఏమేం చేయాలో సూచనలు అందిస్తున్నారు కౌన్సెలర్‌.

ఆ సూచనలతో కృష్ణవేణి అంతర్‌శిశువుతో ముచ్చటించడం మొదలుపెట్టింది– ‘నా కన్నవారికి అబ్బాయిలా ఆనందాన్ని పంచాలనే సాధనలో నిన్ను పోగొట్టుకుని, నన్ను నేను కోల్పోయాను. స్త్రీగా ఏ సంతోషాన్నీ అనుభవించలేకపోయాను. నిన్ను సంతోష పెట్టలేకపోయాను. నన్ను క్షమించు. నువ్వు సంతోషంగా ఉంటే, నేనూ సంతోషంగా ఉంటాను..’ చిన్ని పాపకు చెప్పినట్టుగా చెప్పింది. కాసేపటికి తెరిపిన పడిన మనసుతో మేల్కొంది.

తెరిపినపడిన బంధం
స్త్రీ–పురుషులిద్దరిలోనూ అంతర్‌ శిశువు ఉంటుందనీ, ఆ శిశువును మాలిమి చేసుకుంటే జీవితం సంపూర్ణంగా అనుభవించవచ్చుననే అవగాహనకు వచ్చింది. అంతర్‌ శిశువు స్నేహంతో కృష్ణవేణి మనసు ఆనందపరవశం పొందింది. ఆ ప్రేమ ఆమె ఉన్న ప్రతీచోటా ప్రతిఫలిస్తోంది. రాకేశ్‌ను అపార్థం చేసుకున్నానని తెలిసి, తన ప్రేమ పరిధిని విస్తృతం చేసుకుంది. తను హోదాలో పై స్థాయిలో ఉండడం వల్ల భర్త తనను అణచడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనే అనుమానమూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. – నిర్మల చిల్కమర్రి

సమస్య మనలోనే!
ఆడామగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అంతర శిశువు (ఇన్నర్‌చైల్డ్‌) ఉంటుంది. చాలా సందర్భాలలో రకరకాల వ్యక్తుల వల్ల, మన ప్రవర్తనల వల్ల ఆ శిశువు మనసు గాయపడుతుంది. తనకు నచ్చినవీ, నచ్చనివీ, అలాగే ఉండాల్సిన విధానాన్నీ ఆ శిశువు హెచ్చరిస్తుంటుంది. అయినా సరే దాన్ని పట్టించుకోకపోతే, అలాంటి వారి నుంచి దూరమైపోతుంది. దీంతో వారిలో ప్రేమ స్థానంలో ద్వేషం చోటుచేసుకుంటుంది. అందాల్సిన ఫలాలు అందడం లేదనే నిస్పృహలోకి వెళుతుంది. ఈ ప్రభావం జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కృష్ణవేణికి జరిగింది అదే! చాలామంది సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనే తపనలో తమను తాము కోల్పోతుంటారు. కుటుంబ జీవనంలో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తట్టుకోలేక కుటుంబం నుంచి దూరం అవడం, వ్యసనాల బారిన పడటం చూస్తుంటాం. లేదంటే ఒంటరివారైపోయి జీవితం చాలించాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ ఆలోచనల వల్ల సంపూర్ణ జీవితాన్ని అనుభవించలేరు. ఎవరికి వారు తమలోని అంతర్‌ శిశువుతో గుర్తిస్తే, ఆ ప్రేమను అందరికీ పంచాలనే భావన చిగురిస్తుంది.
– లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌ లైఫ్‌ థెరపిస్ట్,లైఫ్‌ రీసెర్చ్‌ అకాడమీ, హైదరాబాద్‌

ఇన్నర్‌చైల్డ్‌ మన జీవితంపై చూపే ప్రభావం గురించి చెప్పిన ఆంగ్ల రచయితలు...
జాన్‌బ్రాడ్‌ షా అమెరికాలో మంచి వక్త, కౌన్సెలర్, విద్యావేత్త. కుటుంబ జీవనంలో గాయపడుతున్న అంతరశిశువు (ఇన్నర్‌చైల్డ్‌) గురించి సమగ్రంగా వివరించారు.‘హోమ్‌ కమింగ్‌’ పుస్తకం ద్వారా ఇన్నర్‌చైల్డ్‌ విజేత అవ్వాలంటే ఏం చేయాలో తెలియజెప్పారు,

అలీస్‌ మిల్లర్‌ ఇంగ్లండ్‌ సైకోఎనలిస్ట్‌. ‘పేరెంటల్‌ చైల్డ్‌ అబ్యూజ్‌’ బుక్స్‌ రాశారు ఈమె. వీటిలో ‘ది డ్రామా ఆఫ్‌ ద గిఫ్టెడ్‌ చైల్డ్‌’ అనే పుస్తకం ఇన్నర్‌ చైల్డ్‌ గురించి తెలియజేస్తుంది.

వర్జీనియా సచీర్‌ అమెరికన్‌ రచయిత్రి, సామాజికవేత్త. ‘మదర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ థెరపిస్ట్‌’గా ఈమెకు పేరు. ఎంతోమంది జీవితాలను తరచి చూసిన ఈమె బాల్యదశలో పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం, ఒత్తిడి ఎంతగా ఉంటుందో వివరించారు. ‘కంజాయింట్‌ ఫ్యామిలీ థెరపీ’ పుస్తకం ద్వారా ఎన్నో సూచనలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు