సన్యాసి మొగుడు

9 Aug, 2016 23:07 IST|Sakshi
సన్యాసి మొగుడు

ఏమిటో ఈ పెళ్లిళ్లు... తల్లిదండ్రులు ఎంతో కష్టపడి.. జాతకాలు, గుణగణాలు,
కుటుంబాలు కలిసేలా  ఓ అబ్బాయిని చూసి ఆ అయ్య చేతిలో కూతురిని పెడితే..
ఎన్ని రకాల సమస్యలో! వాదించే వాళ్లు.. వేధించే వాళ్లు.. వారించే వాళ్లు!
ఇవన్నీ కాకపోతే ఇదో కొత్త నమూనా... సన్యాసి మొగుడు!
ఈ పీడకల నుంచి బయడ్డానికి విడాకులు దొరుకుతాయా?

 

తన లైఫ్‌కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని గుడ్డిగా కుటుంబానికే వదిలేసి.. కనీసం పెళ్లి చూపులు అప్పుడన్నా భరద్వాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయని  తన తెలివి తక్కువతనానికి చింతించింది జాహ్నవి.‘మంచి సంబంధం... సంప్రదాయ కుటుంబం... అంటూ దాని గొంతు కోశారు.. బంగారంలాంటి పి...ల్ల’ ఉబికి వస్తున్న దుఃఖాన్ని  చీరకొంగును నోట్లో కుక్కుకుని ఆపుకుంటూ బాధపడుతోంది జాహ్నవి తల్లి!


‘ఇది మరీ బాగుందే తల్లి..  దిగే వరకు మాకు మాత్రం లోతు తెలిసిందా? వాకబు చేసిన వాళ్లంతా మంచి వాళ్లనే చెప్పారు. అయినా దానికి మేమేమైనా శత్రువులమా? అది బాగుండాలనే కదా అనుకుంది!’ అంది ఉక్రోషం, నిష్ఠూరం కలగలసిన స్వరంతో జాహ్నవి నానమ్మ. మనవరాలికి జరిగిన అన్యాయంలో కోడలు తనను బాధ్యురాలిని చేయడం వల్ల పలికిన భావోద్వేగం అది.


‘ఆ మాటకొస్తే నేనొక్కదాన్నే పట్టుబట్టలేదు కదా ఈ సంబంధం గురించి మీ అమ్మ, మీ తమ్ముడూ చూశారు’ అంది. మళ్లీ అదే నిష్ఠూరం.. ఈసారి తన పొరపాటులో భాగస్వామ్యం పంచే ప్రయత్నం!  ‘మా అమ్మనూ అంటునాన్లెండి’ అంది జాహ్నవి తల్లి.  ‘నీ కూతురు మీద మాకేం పగా ద్వేషాలు లేవు... మంచి కుర్రాడొస్తే బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో పెద్దవాళ్లం చూశాం. ఘోరమైన తప్పిదం జరిగిపోయింది. మమ్మల్ని క్షమించు తల్లీ.. క్షమించు’ అంటూ చెంపల మీద టపటపా కొట్టుకుంది జాహ్నవి అమ్మమ్మ.  ‘అమ్మా.. ఆపుతావా? కూతురి జీవితం నాశనమైందనే బాధలో ఏదో అంటోంది అక్క... పెద్దవాళ్లు కాస్త ఓపికగా ఉండండి. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి’ సర్దిచెప్పాడు జాహ్నవి మేనమామ.


‘ఇంక మీ జోక్యం వద్దు మామయ్యా. జరగాల్సింది నేను చూసుకుంటాను. నా మానాన నన్ను వదిలేయండి. మిమ్మల్ని తప్పు పట్టో, మీమీద నమ్మకం లేకో అనట్లేదు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నన్ను తీసుకోనివ్వండి. ఈ మాటలతో మీరు బాధపడితే క్షమించండి’ అని నిక్కచ్చిగా చెప్పేసి బయటకు వెళ్లిపోయింది జాహ్నవి.

 
అసలు ఏమైంది?

ఇద్దరన్నదమ్ముల మధ్య ఆడపిల్ల. అపురూపంగా పెరిగింది. ఏం కావాలన్నా కాదనలేదు అమ్మానాన్న. ఇంటర్ అయిపోయాక ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానంది. నాన్నకు ఇష్టంలేకపోయినా తన కోసం ఓకే అన్నారు. ఎంతో ఆసక్తితో ఆ కోర్స్‌ను పూర్తి చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ముంబైకి వెళ్లింది. తన అభిరుచికి పేరెంట్స్ ఓకే... వాళ్ల కోసం పెళ్లికి తానూ ఒకే...  ఓ యేడాది పాటు అక్కడున్న ప్రముఖ డిజైనర్లందరి దగ్గరా పనిచేసి వచ్చింది. ఆ అనుభవంతో హైదరాబాద్‌లో సొంత బొటిక్ ఒపెన్ చేసింది. బొటిక్ పెట్టడం అమ్మానాన్న సహా అన్నయ్యకూ ఇష్టం లేదు. వద్దు అంటే చిన్నబుచ్చుకుంటుందేమోనని అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నారు. మేనత్తలు, మేనమామ భార్య, పిన్ని అందరూ ‘ముంబై వెళ్లింది ఇక్కడ టైలర్ షాప్ ఓపెన్‌చేయడానికా? నాలుగేళ్లు మెషీన్ తొక్కుడేనా నేర్చుకుంది’ అంటూ ఎక్కసెక్కాలు ఆడినా తన కోసం సహించారు. తను మాత్రం ఏమీ పట్టించుకోకుండా శక్తియుక్తులన్నీ బొటిక్ మీద పెట్టింది. రెండేళ్లలో మంచి బిజినెస్. అంతకన్నా మంచి పేరు. ఫ్యాషన్ వీక్స్‌కి ఇన్విటేషన్స్. గ్రూప్‌డిజైనింగ్‌లో చాన్సెస్. బ్రహ్మాండమైన కెరీర్. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పుడు వచ్చింది పెళ్లి ప్రస్తావన నానమ్మ నుంచి. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో తన చాయిస్‌ను గౌరవించిన తన పెద్దలకు తనకు పెళ్లికొడుకునే వెదికే చాయిస్ ఇచ్చి తనూ వాళ్లను గౌరవించాలనుకుంది. అందుకే ‘మీరు చూసిన సంబంధం చేసుకుంటాను’ అని చెప్పింది.

 

అమ్మమ్మ, నాన్నమ్మ వేట...
ఆ బాధ్యతను జాహ్నవి అమ్మమ్మ, నాన్నమ్మ తీసుకున్నారు. పెళ్లికొడుకు కోసం వేట ప్రారంభించారు. చాలా సంబంధాలు చూసి చివరికి భరద్వాజను ఓకే చేశారు. ఆచార వ్యవహారాలు పాటిస్తున్న కుటుంబం. అబ్బాయి గవర్నమెంట్ లెక్చరర్. చూడ్డానికి కూడా చాలా బాగుంటాడు. నెమ్మదస్తుడు. మెతక మనిషి. పెళ్లి చూపుల్లో భరద్వాజ్‌ను చూస్తే వింతగా అనిపించింది తనకు. అంత నెమ్మదితనం ఉన్న అబ్బాయిని తాను ఎక్కడా చూడలేదు. తన స్వభావానికి పూర్తి విరుద్ధం. పోనీలే ఇద్దరూ దూకుడుగా ఉంటే కష్టం. ఒకరిలా... ఒకరు అలా ఉంటేనే బెటర్ అని సర్ది చెప్పుకుంది.

వన్ మార్నింగ్...
పైసా కట్నం లేకుండా పెళ్లి అయింది. అబ్బాయి దీక్షలో ఉన్నాడు... మొదటిరాత్రికి నలభై రోజులు ఆగాలి అని అబ్బాయి తరపు పెద్దలు అమ్మాయి తరపు పెద్దలకు చెప్పారు. చిత్రంగా అనిపించినా సరే అన్నారు. ఈలోపు తనకు, భరద్వాజకు మంచి స్నేహం కుదిరింది. ముందు భయపడ్డా కంపాటబులిటీ బాగా కుదిరినందుకు చాలా హ్యాపీగా ఫీలయింది. నలభై రోజుల తర్వాత తనకు ఆధ్యాత్మికంగా ఎదగాలనుందని చెప్పాడు. షాకింగ్‌గా ఫీలయింది. కాలేజ్ నుంచి రాగానే ధ్యానముద్రలో గడిపేవాడు. ఇంకోవైపు తన పెద్దల నుంచి అత్తామామల మీద ఒత్తిడీ ఎక్కువైంది గర్భాదాన ముహూర్తం కోసం. కాని ముహూర్తాలు కుదరట్లేదని జవాబు చెప్పసాగారు.

 
తొమ్మిది నెలల తర్వాత...

అలా దాదాపు తొమ్మిది నెలలు గడిచాయి. ఒక రోజు తను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తీర్థయాత్రలు చేయాలి. అక్కడున్న స్థల పురాణాలు, ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకోవాలంటూ ఒంటరిగా తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు. నాలుగు నెలలైనా అడ్రస్ లేదు. ఒక రోజు ఉదయం తన మామగారికి ఫోన్ వచ్చింది కొడుకు దగ్గర్నుంచి. ఎక్కడో ఉత్తర భారతంలో... ఏదో స్వామీజీ దగ్గర సన్యాసం తీసుకున్నట్టు.. ఇక తన గురించి మరచిపొమ్మన్నట్టు! నిశ్చేష్ఠురాలైంది తను. మారు మాట్లాడకుండా తల్లిగారింటికి వచ్చేసింది!

 
జాహ్నవి నోటి వెంట ఈ కథంతా విన్న అడ్వకేట్  దీర్ఘంగా నిట్టూర్చింది. ‘ఇంత చదువుకున్న దానివి, లోకం చూసిన దానివి అతని ప్రవర్తనను ఎందుకు అంచనా వేయలేక పోయావ్? తొమ్మిది నెలల్లో కనీసం ఒక్కసారైనా ఎందుకు అనుమానం రాలేదు?’ అని అడిగింది.  జాహ్నవి నుంచి ఒకే సమాధానం ‘నమ్మాను’ అని!


ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి చెప్పింది లాయర్. ఫాలో అయింది జాహ్నవి. భర్త వివరాలతో కోర్టులో విడాకుల కోసం కేస్ వేసి విడాకులు పొందింది. ఎన్నో ఆశలు, కలలతో మొదలైన తన వైవాహిక జీవితం అలా ముగిసినందుకు ఎవరినీ నిందించలేదు. కాని తన లైఫ్‌కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని గుడ్డిగా కుటుంబానికే వదిలేసి... కనీసం పెళ్లి చూపులు అప్పుడన్నా భరద్వాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయని తన తెలివి తక్కువతనానికి చింతించింది. బాధపడింది. - సరస్వతి రమ


మంచి కుర్రాడొస్తే బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో పెద్దవాళ్లం చూశాం. ఘోరమైన తప్పిదం జరిగిపోయింది... మమ్మల్ని క్షమించు తల్లీ.. క్షమించు’ అంటూ చెంపల మీద టపటపా కొట్టుకుంది జాహ్నవి అమ్మమ్మ.

 

ఈ కథంతా విన్న అడ్వకేట్  దీర్ఘంగా
నిట్టూర్చింది. ఇంత చదువుకున్న దానివి, లోకం చూసిన దానివి అతని ప్రవర్తనను ఎందుకు అంచనా వేయలేక పోయావ్? తొమ్మిది నెలల్లో కనీసం ఒక్కసారైనా ఎందుకు అనుమానం రాలేదు?’

 

చట్టం ఏం చెబుతోంది?
హిందూ వివాహ చట్టం 1955, సెక్షన్ 13 ప్రకారం.. తగిన కారణాలు, సందర్భాలు ఉన్నప్పుడు కోర్టులను ఆశ్రయించి విడాకుల డిక్రీ ద్వారా తమ వివాహాన్ని రద్దు పర్చుకోవచ్చు. సరైన కారణాలు, ఆధారాలతో  భార్యభర్తల్లో ఎవరైనా ఈ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు. విడాకుల కోసం ఈ చట్టం పదికిపైగా కారణాలను సూచించింది. అందులో ఒకటి.. దంపతుల్లో ఎవరైనా సంసార జీవితాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరించినప్పుడు ఆ కారణాన్ని చూపి విడాకులు తీసుకోవచ్చు. ఇక్కడ జాహ్నవి చేసింది అదే!

 

 ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 

మరిన్ని వార్తలు