బిసి బేళ భేష్

22 Apr, 2016 22:43 IST|Sakshi
బిసి బేళ భేష్

బిసి బిసిగా అంటే... వేడి వేడిగా!
బేళా అంటే... పప్పుల్లా పంటికింద నలుగుతూ సరదాగా!
హోల్ మొత్తం హోల్ భేషుగ్గా!
కర్ణాటక కనడానికీ వినడానికీ తినడానికీ పసందుగా!

 

మీన్ కరీ
చేప వంటకాలలో ప్రత్యేకంగా చెప్పుకోదిగినది.
కావల్సినవి
చేప ముక్కలు - అర కేజీ
కొత్తిమీర - టేబుల్ స్పూన్
ధనియాలు - అర టీ స్పూన్
అల్లం తరుగు - టీ స్పూన్
వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - 1; ఉప్పు - తగినంత
ఎండు కొబ్బరి - 5 టేబుల్ స్పూన్లు
మెంతులు - అర టీ స్పూన్
ఆవాలు - పావు టీ స్పూన్
కారం - టేబుల్ స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - రెమ్మ; పచ్చిమిర్చి - 5

 
తయారీ
శుభ్రపరుచుకున్న చేపలను పసుపు, కారం వేసి కలిపి పక్కనుంచాలి.  మూకుడులో నూనె వేడి చేసి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి తరుము, కరివేపాకు, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత మిశ్రమం మెత్తగా నూరుకోవాలి.మరొక మూకుడులో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.మరికొద్దిగా పసుపు, కారం వేసి దోరగా అయ్యేంతవరకు వేయించాలి. దీంట్లో మెత్తగా తయారుచేసుకున్న మిశ్రమం, ఉప్పు, కప్పు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడికించాలి.కలిపి ఉంచుకున్న చేప ముక్కలను వేసి 15 నిమిషాల సేపు ఉడికించాలి. చివరగా చిన్న మూకుడులో టీ స్పూన్ నెయ్యి వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టి, ఆ మిశ్రమాన్ని కూరలో కలిపి, దించాలి.

 

కోసంబరి సలాడ్
ఈ సలాడ్‌ను పప్పు-దోసకాయతో తయారుచేస్తారు. ఈ సలాడ్‌ను మరే పదార్థంతోనూ కలపనక్కర్లేదు. ఉడిపి పాకశాలలో ఇది తప్పనిసరి వంటకం.

కావల్సినవి: పెసరపప్పు - పావు కప్పు
దోసకాయ - 1; క్యారట్ - 1
క్యాప్సికమ్, టొమాటో - 2
(సన్నగా తరగాలి. తగినన్ని వేసుకోవచ్చు)
నిమ్మకాయ - సగం ముక్క; ఉప్పు - తగినంత
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
పోపుకి.. నూనె - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ
ఆవాలు - అర టీ స్పూన్
అల్లం తరుగు - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 1 లేదా 2 (సన్నగా తరగాలి)

 
తయారీ

పెసరపప్పును కడిగి, గంటసేపు నానబెట్టాలి. తర్వాత పూర్తిగా వడకట్టి పక్కనుంచాలి. దోసకాయను ముక్కలుగా కట్‌చేసి (చేదు లేకుండా చూసుకోవాలి), క్యారట్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ వేసి కలపాలి. దీంట్లో వడకట్టిన పప్పు పోసి కలపాలి. పప్పు ఉడుకుతుండగా ఉప్పు, నిమ్మరసం కలపాలి. చివరలో కొబ్బరి తురుము కలిపి, దించాలి. ఆరోగ్యవంతమైన కర్ణాటక సంప్రదాయ సలాడ్‌ను అలాగే వడ్డించవచ్చు. రోటీతో కూడా తినొచ్చు.

 

మైసూర్ పాక్
కర్ణాటకలో ప్రధాన నగరమైన మైసూర్ స్వీట్ ఇది. ఈ రుచికరమైన స్వీట్ భారతీయ ప్రధాన స్వీట్లలో ఒక్కటిగా నిలిచింది.

 
కావల్సినవి
: శనగపిండి - ముప్పావు కప్పు; పంచదార - 4 కప్పులు; నెయ్యి - రెండున్నర కప్పులు

 
తయారీ:  ముందుగా శనగపిండిని జల్లించాలి. స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తి కరిగాకా అందులో అర కప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి. దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి.

      
మిశ్రమం బాగా వేగిందనడానికి మంచి సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్‌లో అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కత్తితో చతురస్రాకారంలో కట్ చేసి, చల్లారనివ్వాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్ చేయాలి.

 

బిసి బేళ బాత్
కావల్సినవి: అన్నం - కప్పు; కందిపప్పు - అర కప్పు
పసుపు - పావు టీ స్పూన్; నీళ్లు - 6 కప్పులు
ఉప్పు - తగినంత; నూనె - అర టీ స్పూన్
క్యాబేజీ తరుగు - కప్పు; వంకాయయ - 1; బీన్స్ - 5 (సన్నగా తరగాలి


మిశ్రమం తయారీకి...
బిసి బెలా బాత్ పొడి - 4 టేబుల్ స్పూన్లు (ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, లవంగాలు, మిరియాలు, అనాసపువ్వు, యాలకులు, మరాఠీమొగ్గ, మెంతులు, గసగసాలు, పచ్చికొబ్బరి.. తగినన్ని తీసుకొని, వేయించి, పొడి చేసుకోవాలి) ఎండుకొబ్బరి - ముప్పావు కప్పు; చింతపండు - నిమ్మకాయ పరిమాణం బెల్లం తరుగు - టీ స్పూన్; నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు


పోపుకి...
నూనె - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్
కరివేపాకు - రెమ్మ; ఇంగువ - చిటికెడు

తయారీ
అన్నం- ఉడికిన పప్పు, (బియ్యం-పప్పు కలిపి ఒకేసారి ఉడికించవచ్చు) కూరగాయలు, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె, 6 కప్పుల నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. మిశ్రమం అంతా గుజ్జుగా అయ్యేంతవరకు ఉడికించాలి. నీళ్లు పడితే మరికొన్ని కలుపుకోవచ్చు. బిసిబేళ బాత్ పొడి, కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమంలో 2 కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు కలిపి కడాయిలో పోసి ఉడికించాలి. దీంట్లో బెల్లం తరుగు వేసి కలుపుతూ 5 నిమిషాలు ఉంచాలి.

 
మిశ్రమం చిక్కగా అయ్యాక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువతో పెట్టిన పోపు మిశ్రమాన్ని మెత్తగా ఉడికిన అన్నం-పప్పు మిశ్రమంలో వేసి కలిపి, దించాలి. వడ్డించేముందు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

 

వాంగీ బాత్
అన్నం ఇతర కూరగాయలతో కలిపి చేసే వంటకాలు కర్ణాటకలో విరివిగా చూడచ్చు. వాటిలో వంకాయతో చేసే వాంగీ బాత్ చాలా ప్రసిద్ధం.



కావల్సినవి
అన్నం - 2 కప్పులు; ఉల్లిపాయ - 1
శనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీ స్పూన్
నూనె - టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 4
ధనియాల పొడి - టీ స్పూన్
ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
వంకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - తగినంత

 
తయారీ

కడాయిలో నూనె వేసి, వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, కొబ్బరి పొడి వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయ తరుగు వేసి వేగాక, వంకాయ ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు వేసి 2-3 నిమిషాలు వేగనిచ్చి, అందులో అన్నం వేసి కలపాలి. విడిగా చిన్న మూకుడులో నూనె వేసి, జీలకర్ర, 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, రెమ్మ కరివేపాకు వేసి పోపు పెట్టి, ఈ మిశ్రమాన్ని వాంగీబాత్‌లో కలపాలి. అలంకరణకు చివరగా కొద్దిగా కొత్తిమీర వేయచ్చు. వడ్డించడానికి వాంగీబాత్ సిద్ధం.

 

 చికెన్ ఘీ రోస్ట్
మాంసాహార వంటకాలలో నెయ్యితో చేసే ఈ వంటకం కన్నడిగుల ప్రత్యేకం.
కావల్సినవి: చికెన్ ముక్కలు - కేజీ 
పెరుగు - అర కప్పు; పసుపు - అర టీ స్పూన్
నిమ్మరసం - టీ స్పూన్
ఉప్పు - తగినంత బెల్లం తురుము - టీ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 10
పండుమిరపకాయలు - 3; నల్ల మిరియాలు - 5
లవంగాలు - 5; మెంతులు - టీ స్పూన్
జీలకర్ర - అర టీ స్పూన్
ధనియాలు - టేబుల్ స్పూన్
వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్
చింతపండు గుజ్జు - 5 టేబుల్ స్పూన్లు

 
తయారీ

గిన్నెలో శుభ్రపరిచిన చికెన్ ముక్కలు వేసి పెరుగు, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి, మూత పెట్టి 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు వేయించి, చల్లారాక పొడి చేసుకోవాలి. దీంట్లో చింతపుండు గుజ్జు, వెల్లుల్లి వేసి మిశ్రమాన్ని మెత్తగా నూరాలి. మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, స్టౌను హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నుంచి చికెన్ ముక్కలను తీసి కాగుతున్న నెయ్యిలో వేసి కలపాలి. చికెన్ ముక్కలు దేనికది విడిపోయేంతవరకు మంట అలాగే ఉంచి, తర్వాత తగ్గించాలి.తయారుచేసుకున్న చింతపండు గుజ్జు మిశ్రమం చికెన్‌లో వేసి 25-30 నిమిషాలు ఉడికించాలి. చివరగా కరివేపాకు వేసి దించాలి.

 
కర్టెసీ:  జి.వి.రమేష్, షెఫ్ నొవొటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్

 

మరిన్ని వార్తలు