ఏటంతారేటి!

24 Jun, 2016 23:17 IST|Sakshi
ఏటంతారేటి!

ఏముందండీ అంటానికి?! నార్త్ కోస్టు ఫుడ్డు. గాలి మళ్లక తప్పదు. చప్పరించినా, లొట్టలేసుకున్నా సికెన్ పీసు, పీతల వేపుడు.. ఆవ చేప.. బలేగుంటాయి. ఏతంటారేటి?

 

కోవా పూరీ
కావల్సినవి: కోవా - 200 గ్రా.లు  మైదా - అర కేజీ డ్రై ఫ్రూట్స్(బాదం, జీడిపప్పు) పొడి - 30 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత బెల్లం - అర కేజీ  నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

 
తయారీ: ఒక గిన్నెలో మైదా వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి, పక్కనుంచాలి. మరో గిన్నెలో కోవా, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకులపొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి. మైదా పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలా వత్తి, కోవా మిశ్రమాన్ని దాంట్లో కూరాలి. (కజ్జికాయల మాదిరి చేయాలి). బాణలిలో నూనె కాగాక, అందులో వేసి అన్నివైపులా బాగా వేయించి తీయాలి. మరొక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగించాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలపాలి. ముదురు పాకం వచ్చాక వేయించి సిద్ధంగా పెట్టుకున్న కోవా పూరీలను వేసి, కలిపి, తీయాలి.

 

లక్ష్మీ చారు
కావల్సినవి: తరవాణి/కలి నీళ్లు  (బియ్యం రెండోసారి కడిగిన 2 కప్పుల నీళ్లు ఒక కుండలో పోసి రెండు రోజుల పాటు ఉంచినవి. దీంట్లో అరకప్పు గంజి కూడా కలపాలి) - కప్పు వెల్లుల్లి - 4 రెబ్బలు వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు  కరివేపాకు - 3 రెమ్మలు  చింతపండు - నిమ్మపండంత. ఉప్పు - తగినంత  పచ్చిమిర్చి - 4 (నిలువుగా చీరాలి)  పసుపు - 1/2 టీ స్పూన్ మిరియాల పొడి - అర టీ స్పూన్ ఎండుమిర్చి - 2 జీలకర్ర- ఆవాలు - టీ స్పూన్  నూనె - టేబుల్ స్పూన్

 
తయారీ: మూకుడులో నూనె వేసి, కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి+ముద్ద, పసుపు వేసి కలపాలి. చింతపండు రసం, సరిపడా కలి/తరవాణి నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మిరియాల పొడి, కొత్తిమీర వేసి దించాలి. ఈ చారు అన్నంలోకి వడ్డించాలి.

 

జీడిపప్పు చికెన్ పలావ్
కావల్సినవి: జీడిపప్పు - 100 గ్రా.లు చికెన్ - 100 గ్రా.లు బియ్యం - 200 గ్రా.లు;  కొబ్బరి పాలు - కప్పు  ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 4  అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ గరం మసాలా (యాలకులు, లవంగాలు, సాజీర, అనాసపువ్వు ) - 2 టీ స్పూన్లు  ఉల్లిపాయలు - 4 (2 ఉల్లిపాయలను తరిగి, వేయించి పక్కనుంచాలి) నెయ్యి - 2 టీ స్పూన్లు  నూనె - 50 గ్రా.లు; బిర్యానీ ఆకు - 2 కొత్తిమీర - చిన్న కట్ట

 

పుదీనా - కప్పు
తయారీ: బియ్యం అరగంట సేపు నానబెట్టాలి. ఒక మందంపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు కలపాలి. ఉల్లిపాయ తరుగు వేసి వేగాక అల్లం-వెటల్లుల్లి పేస్ట్ కలపాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి ఉప్పు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులు వేసి కాస్తవేగనివ్వాలి. దీంట్లో బియ్యానికి సరిపడా నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా వేసి మరిగించాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికి నీళ్లు తగ్గాక నెయ్యి, ఇంకాస్త కొత్తిమీర వేసి కలపాలి. మంట తగ్గించి అన్నం పూర్తిగా ఉడకనిచ్చి దించాలి. దీనికి ఉలవచారు కాంబినేషన్ రుచిగా ఉంటుంది.

 

స్టఫ్డ్ క్రాబ్స్
కావల్సినవి: పీతలు (బోన్‌లెస్) - 4 పీత మాంసం - 200 గ్రా.లు  జీడిపప్పు - 50 గ్రా.లు అల్లం తరుగు - టీ స్పూన్  వెల్లుల్లి తరుగు - టీ స్పూన్  కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చిమిర్చి - 4  గుడ్డు - 1; ఉప్పు - సరిపడా  నూనె - వేయించడానికి తగినంత  మొక్కజొన్న పిండి - టీ స్పూన్

 
తయారీ:
పీతల డిప్పలను తీసి, లోపలి గుజ్జు భాగాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. డిప్పలను వేడి నీటితో కడిగి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో క్రాబ్ మీట్, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, గుడ్డు సొన, ఉప్పు, పచ్చిమిర్చి, మొక్కజొన్న పిండి.. అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పీతల డొప్పల మధ్యలో పెట్టి, మూసి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. ఏదైనా సాస్‌తో వడ్డించాలి.

 

సొరకాయ మటన్ పులుసు
కావల్సినవి:  చింతపండు - 2 నిమ్మకాయల పరిమాణం అంత  (కప్పు గుజ్జు తీయాలి); సోరకాయ - సగ భాగం (పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి) మటన్ - 200 గ్రా.లు; బెంగుళూరు మిర్చి - 100 గ్రా.లు  ఉల్లిపాయ - 2 (సన్నగా తరగాలి); కరివేపాకు - 2 రెమ్మలు కొత్తిమీర - చిన్న కట్ట; అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్  వెలుల్లి రెబ్బలు - 4 ; కారం - 2 టీ స్పూన్లు  నూనె - 3 టేబుల్ స్పూన్లు; గరం మసాలా - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత

 
తయారీ: మటన్‌లో అర టీ స్పూన్ పసుపు వేసి, కొద్దిగా ఉడికించాలి. మందపాటి గిన్నెను స్టౌ మీద పెట్టి నూనె పోసి మిర్చి తరుగు, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయతరుగు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి, కలిపి మగ్గనివ్వాలి. తరువాత మటన్ ముక్కలు, చింతపండు పులుసు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి ఉడికించాలి. ముక్క ఉడికాక దించాలి.

 

బేబీకార్న్ వడలు
కావల్సినవి: బేబీ కార్న్ తరుగు - కప్పు మొక్కజొన్న గింజలు - కప్పు  (కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి)  పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత పుదీనా - చిన్న కట్ట; ఉల్లిపాయలు - 4 (నిలువుగా తరగాలి) ఉప్పు - తగినంత; శనగపిండి - 50 గ్రా.లు బియ్యప్పిండి - 50 గ్రా.లు; అల్లం-వెల్లుల్లి ముక్కలు - అర కప్పు

 
తయారీ: ఒక గిన్నెలో బేబీకార్న్ తరుగు, మొక్కజొన్న గింజల ముద్ద, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, పుదీన, ఉల్లిపాయ తరుగు, శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి, చేత్తో అదిమి కాగిన నూనెలో వేసి రెండువైపులా బాగా వేయించి, తీయాలి.

 

ఆవకాయ చేప
కావల్సినవి: ఆవకాయ -  3 గరిటెలు; చేపలు (బోన్‌లెస్) - 200 గ్రా.లు నూనె - వేయించడానికి తగినంత; మైదా - కప్పు; మొక్కజొన్న పిండి - కప్పు  ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; మిరియాల పొడి - టీ స్పూన్  కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); పచ్చిమిర్చి - 4; గుడ్డు - 1 అల్లం-వెల్లుల్లి ముద్దు - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు  ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)

 
తయారీ: ముందుగా చేపలను శుభ్రపం చేసి, ఒక గిన్నెలో వేసి అందులో గుడ్డు సొన, ఉప్పు, మిరియాలపొడి, కారం, అల్లం-వెల్లుల్లి ముద్ద, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగాక ఈ చేప ముక్కలను పకోడీల మాదిరి వేయించి తీసి పక్కన పెట్టాలి. తరువాత మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అల్లం-వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవకాయ పచ్చడి వేసి కలపాలి. దీంట్లో వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.

 

అరటి ఆకు కోడి
కావల్సినవి: చికెన్ (బోన్‌లెస్) - 200 గ్రా.లు; అరటి ఆకు - 1 గరం మసాలా - అర టీ స్పూన్; జీలకర్ర పొడి - అర టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట)  పుదీన - కప్పు (చిన్న కట్ట); కారం - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్; నిమ్మరసం - టీ స్పూన్; ఉప్పు - తగినంత

 
తయారీ: ముందు చికెన్, గరంమసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి ఉడికించాలి. దీంట్లో నిమ్మరసం కలపాలి. తరువాత పుదీనా, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. రసం అంతా ఇంకిపోయేంతవరకు ఉంచి శుభ్రపరిచిన అరటి ఆకులోకి తీసి, అన్నివైపులా మడిచి, నిప్పుల మీద కాల్చి, తీయాలి. లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కూడా ఉడికించవచ్చు.

 

మునగాకు పప్పు

కావల్సినవి: పెసరపప్పు - 100 గ్రా.లు; కందిపప్పు - 100 గ్రా.లు మునగాకు - కప్పు; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రెబ్బలు - 6 జీలకర్ర - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చిమిర్చి - 4  కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); ఉల్లిపాయల- 1(సన్నగా తరగాలి)  చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 పసుపు - అర టీ స్పూన్ ; ధనియాల పొడి - టీ స్పూన్

 
తయారీ: కుకర్‌లో పెసరపప్పు, కందిపప్పు వేసి కడిగి, తగినన్ని నీళ్లు పోసి, పసుపు నూనె వేసి ఉడికించి పక్కనుంచాలి. ఒక కడాయిలో నూనె పోసి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. పసుపు, చింతపండు రసం పోసి, మునగాకు వేయాలి. ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉడికించి పప్పులో కలపాలి. చివరగా కొత్తిమీర వేసి, మరికాసేపు ఉడికించి దించాలి. వేడి వేడిగా అన్నం, చపాతీలోకి వడ్డించాలి.

మరిన్ని వార్తలు