మొండి గోడలు

28 Oct, 2017 23:30 IST|Sakshi

తమిళ మూలం: ఆదవన్‌ దీక్షణ్య       
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

ఇల్లు ఖాళీ చేసుకుని ఇంకెక్కడికైనా వెళ్లిపోదామా అన్న  సంశయంతోటే ఇతను ప్రశ్నించాడు. చిలక కూడా అదే ఆలోచనతోనే ఉన్నట్టుంది.  ఇల్లు మారటం వాళ్లకేమీ కొత్త అనుభవం కాదు. మారటానికి గల కారణమే ప్రతిసారీ మారుతుంది. వీళ్లు చెప్పే కారణాలు విన్న ఎవరూ కూడా... ‘ఇలాగంతా తవ్వుకుంటూ, కెలుక్కుంటూ ఉంటే ఎక్కడా ఒక్కచోట కూడా శాశ్వతంగా ఉండలేరు. సర్దుకుని ఉండటానికి అలవాటు పడండి’ అని విసుగ్గా సలహా ఇవ్వగలరు. ఇంతకు ముందున్న ఇంట్లో కూడా ఇలాగే జరిగింది. విశాలమైన రోడ్డు మలుపులో ఒక్కో అంతస్తులో మూడు చొప్పున మొత్తం తొమ్మిది ఇండ్లున్నాయి. కింది భాగాన రోడ్డునూ, తూర్పు దిక్కునూ చూసేలా ఉన్న ఒక ఇల్లూ, వాహనం నిలిపేందుకు స్థలమూ ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ ఇల్లు ఒక బ్రోకర్‌ ద్వారా వీళ్లకు దొరికింది. వాస్తు, రాశి – దిన ఫలాలు అన్న వాటిపై నమ్మకమున్నవాళ్లు... ఉత్తరం లేదూ తూర్పు ముఖం ఉన్న ఇండ్లనే ఎంచుకుంటారు.

అందుకనే అలాంటి ఇండ్లకు పోటీ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎందుకో ఇక్కడ అన్నీ భిన్నంగా అనిపించింది. ఈ భవన నిర్మాణం పూర్తికాక మునుపే మిగతా ఎనిమిది ఇండ్లకూ పది నెలల అద్దె అడ్వాన్స్‌గా ఇచ్చి, కాచుకొని ఉండి మరీ అద్దెకు దిగారు. కానీ ఈ కిందున్న ఇల్లు మాత్రం ఖాళీగానే ఉండటం... తక్కిన ఇండ్లతో పోల్చినపుడు అద్దె ఐదు వందలు తక్కువగానే ఉండటం... వీళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంటిని ఏ లోపమూ లేకుండా కట్టారు. మిద్దె ఇండ్లల్లో కింద కాపురం ఉండేవాళ్లకు సౌకర్యాల కన్నా ఇబ్బందులే ఎక్కువ ఉండటంతో ఎవరూ అద్దెకు దిగటానికి ఇష్టపడలేదేమో అనుకున్నారు. కాపురానికొచ్చేశారు.అక్కడివాళ్లతో కలిసి ఉండటానికీ, కలివిడిగా ఉండటానికీ, ఇల్లు అలవాటు కావటానికీ... కొంత కాలం అవసరమైంది! పైన ఉండే కాపురస్తులు ఎదురుపడితే చిన్నగా నవ్వి పక్కకు వెళ్లేవాళ్లు. వాళ్లు నవ్వారా, నవ్వు మరిచిపోయారా అని నిర్ణయించుకునే లోపు దాటుకొని వెళ్లిపోయేవాళ్లు. అది తప్ప వాళ్లల్లో ఎవరితో ఇంకా స్నేహం కాలేదు. వాళ్ల ఇండ్లకు వెళ్లి స్నేహం చేసే పరిస్థితికి వీళ్లకూ సమయం చాలటం లేదు.

ఆఫీసుకూ, ఇంటికీ తిరగటమే – ఇరుగుపొరుగుతో సాన్నిహిత్యానికి అడ్డంకిగా మారింది.అయితే జీవరాణి, నూతన్‌లు రోడ్డుకు అటువైపున్న ఇండ్లల్లోని పిల్లలతో అప్పటికే స్నేహం చేసుకున్నారు. బొమ్మలు పెట్టుకునీ, ‘పోగో’ ఛానెల్‌ చూస్తూ, పిల్లల ఆటలు కొనసాగాయి. రోడ్డు పొడవుకూ కూల్చివేయబడ్డ గోడల మధ్య ఈ పిల్లలిద్దరూ అటువైపు వెళితే భోజన సమయానికి కూడా ఇంటికి రాకుండా ఆటల్లో మునిగిపోతున్నారు. ఇంటి పనులకంటూ ఉన్న ఒక స్త్రీ దీని గురించి ఫిర్యాదు చెయ్యటానికి తయారుగా ఉంది. అంతా మూడవ వారపు చివరకు చేరుకుంది. చిలకా, ఇతనూ ఆఫీసు నుండి ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి ఇంటి యజమాని అక్కడికొచ్చాడు. ఆయన తానుగా అక్కడికి రాలేదనీ, అక్కడున్నవాళ్లల్లో ఎవరో ఆయన్ను రప్పించారనీ ఆయన మాటల ద్వారా గ్రహించటానికి వీలైంది. ‘సౌకర్యాలన్నీ బాగున్నాయా? సమస్యలేమైనా ఉన్నాయా?’... వంటి సంప్రదాయ విచారణలన్నీ ముగిశాక, ఆయన నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘‘రోడ్డుకు అటువైపు ఉన్నవాళ్లు ఎవరో, ఏమిటో ముందుగా మీకు చెప్పకపోవటం నా తప్పే! నేనే చెప్పి ఉండాల్సింది.

ఆ బ్రోకరూ మీకు చెప్పినట్టు లేడు! సరే, అంబేద్కర్‌ నగర్‌ అన్న ఆ ఏరియా పేరు చూసి మీకు మీరుగా తెలుసుకుని తప్పుకుంటారని చూస్తే అదీ జరగలేదు. అటువైపున్న మనుషుల వాసనే ఇటువైపుకు రాకూడదు. మంచికీ చెడ్డకూ వాళ్ల ముఖాలను చూడాల్సి వస్తుందేనని ఎవరూ బాధ పడకూడదనే రోడ్డుకు అడ్డుగా గోడ కట్టాము. ఇవ్వాళా, నిన్నా కాదు, యాభై అరవై ఏళ్లుగా ఉన్న గోడ. ఆ గోడ మాత్రం ఉండుంటే తూర్పు వాకిలి ఉండే ఈ ఇంటికి నువ్వా నేనా అంటూ పోటీపడుతూ మనుషులు వచ్చేండేవాళ్లు. కానీ, ఇంత కాలమూ నోరు మూసుకుని ఉన్నవాళ్లు అక్కడ ‘ఉత్తరాపురం’ అన్న ఊళ్లో గోడను కూల్చారని తెలిసినప్పటి నుండి ఇదీ వివక్ష గోడేనని కేకలు పెట్టి కూల్చేశారు.గోడ కూల్చాక కూడా ఈ భారత్‌ నగర్‌ మనుషులు ఎవరూ అటువైపున్న మనుషులతో సంబంధం పెట్టుకోకూడదన్న గట్టి నిర్ణయంతో కఠినంగానే ఉంటున్నాం.  

అలాగంతా కట్టుదిట్టంగా ఉంటుంటే ఇప్పుడు ఏమైందో చూశారా? మీ పిల్లలు ఆ పిల్లల్ని ఇంటి లోపలికే తీసుకొచ్చేశారు. ఎవరింటికి వెళ్లాలి, ఎవర్ని ఇంటి లోపలికి రానివ్వాలన్న పద్ధతులన్నీ పిల్లలకు తెలియవు, పెద్దవాళ్లే చెప్పించి పెంచాలి. ఈరోజు మీ ఇంట్లోకి దూరిన ఆ శనిగాళ్లు రేపు మిగతా ఇండ్లల్లోకీ రారంటే, తర్వాత ఎవరు సార్‌ ఈ ఇండ్లల్లోకి అద్దెకొస్తారు. ఇక మీదటైనా ఈ రాకపోకల్ని ఆపి ఉండేటట్టు చూడండి. మీరు నాలుగక్షరాలు చదివినవాళ్లు. ఇరుగుపొరుగు కాపురముంటున్నవాళ్లు ఇబ్బందిపడేలా నడుచుకోకూడదన్నది మీకు తెలియని విషయమేం కాదు. చూసి వాళ్ళను అనుసరించి వెళ్లండి...’’‘అనుసరించి వెళ్లండి’ అన్న ఉపదేశాన్నో, ఉత్తర్వునో వినకుండా ఒక్కరోజైనా గడుస్తుందా అన్న ప్రశ్నే వీళ్లకు కలిగింది. ఎందుకూ, ఏమిటీ, ఎవరితో ఎలా ఉండాలో అని కాకుండా... ‘అనుసరించి వెళ్లండి’ అని చెప్పేవాళ్ల సావాసాన్ని వదులుకోవటమే ఇద్దరికీ సమ్మతమైంది.

ఇంకేముందీ, ఇంకో ఇల్లు చూడమని అదే బ్రోకర్‌తో చెప్పారు. ఇల్లు ఎలా ఉండాలని అడిగిన బ్రోకర్‌తో ఇతను చెప్పిన ఒకే నిబంధన, ఇరుగుపొరుగున ఉన్నవాళ్లు ‘అంటు... దోషం’ అన్న భావనలతో ముఖం చిట్లించుకోనివాళ్లై ఉంటే మంచిది అన్నది ఒక్కటే! చెప్పిన వారానికంతా ఏడెనిమిది ఇండ్లను చూపించాడు బ్రోకర్‌. ముందు భాగాన గాలీ, వెలుతురు స్పష్టంగా వచ్చే దృశ్యాన్ని చూసి హెవెన్లీ హోమ్‌ లే ఔట్‌లో మిద్దింట్లో, ఉమ్మడి కుటుంబాలలో లేని ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు చిలకకు బాగా నచ్చింది. కాంపౌండు గోడలతో, గట్టి తలుపులతో ఆ వరుసలో పక్కపక్కన ఇండ్లు ఉండటంతో పిల్లలే అసహనానికి గురయ్యారు.
 
 అద్దెకొచ్చిన మరుసటి వారంలోనే పెద్దదాని పుట్టినరోజు వస్తుండటంతో ఆ లోపే మిగతా పనులన్నీ ముగించి, ఇంటిని Ô]æుభ్రం చెయ్యమని చిలక కోరటంతో, పనిమనిషి అన్నీ Ô]æుభ్రం చేసింది. అవమానింపబడ్డ స్పృహతో తొందర తొందరగా ఇంటిని ఖాళీచేసి ఇక్కడికి కాపురానికొచ్చామన్న విషయాన్ని మర్చిపోవటానికీ, ఇరుగుపొరుగు వాళ్లను ఆహ్వానించి, పరామర్శించి వాళ్లతో స్నేహంగా ఉండటానికీ... కూతురి పుట్టినరోజు ఒక మంచి అవకాశమని భావించింది చిలక. ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొన్న కూతురితో పాటు ఇరుగుపొరుగు ఇండ్లకు చాక్లెట్లు ఇవ్వటానికి వెళ్లారు పనిమనిషీ, నూతన్‌లు. సాయంత్రం కేక్‌ కట్‌ చెయ్యటానికి పిల్లలతోపాటు రమ్మని వీళ్లు పిలిచిన ఆహ్వానాన్ని అంగీకరించి దాదాపు అన్ని ఇండ్లల్లోని వాళ్లూ వచ్చారు. మరుసటిరోజు సాయంకాలం ఆఫీసు నుండి ఇతను ఇయటికి రాగానే, ఇతని కోసమే టీకొట్టు దగ్గర ఎదురు చూస్తున్నాడు బ్రోకర్‌.

నిన్న ఈయన్ను కూడా ఇంటికి ఆహ్వానించాల్సింది, తప్పిపోయాడే అన్న ఆలోచనతో దగ్గరికొచ్చిన ఇతనితో, ‘‘నిన్న ఇంట్లో బాగా హడావిడి జరిగినట్టుంది...’’ అన్నాడాయన. ‘‘అలాగంతా ఏమీ ఆడంబరంగా జరగలేదు. మామూలుగా మా కుటుంబంలో మత సంబంధమైన పండుగలేవీ జరుపుకోము. కానీ పుట్టినరోజుల్ని మాత్రం కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటాం. కొత్తగా అద్దెకొచ్చిన మేము ఇరుగుపొరుగు వ్యక్తుల్ని ఆహ్వానించి, వాళ్లతో సాన్నిహిత్యాన్ని పెంచుకునేందుకు దాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాం, అంతే!’’ అన్నాడు. ‘‘అంతేనని మీరు చెబితే సరిపోయిందా? అటు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? నిన్న ఫంక్షన్‌కు వచ్చిన ఎవరో మీ గురించి ఏం చెప్పారో తెలియటం లేదు, వెంటనే మిమ్మల్ని ఇంటిని ఖాళీ చెయ్యమని ఇంటి ఓనర్‌ ఒంటి కాలిమీద నిలబడ్డాడు.’’

ఇంటిని ఖాళీచేసి వెళ్లిపోయే నిర్ణయాన్ని ఎప్పుడూ వీళ్లు తీసుకోవటమే సర్వసాధారణం. ఈ ఇంటికి సంబంధించినంతవరకూ ఓనర్‌ ముందు పడ్డాడు.  ‘‘సార్, నిన్న రాత్రి ఇంటి ఓనర్‌ నాకు ఫోన్‌ చేసి, నువ్వు తీసుకొచ్చి నా ఇంట్లో అద్దెకు దించావే... వాళ్లు ఏమిటోళ్లు’’ అని అడిగాడు. ఆ విషయం గురించి నేనేమీ వాళ్లను అడగలేదని చెప్పాను. ‘‘కమీషన్‌ దొరుకుతుందంటే ఎవరో, ఏమిటో కూడా అడగకుండా అడ్డమైనవాళ్లనంతా తీసుకొచ్చి నా ఇంట్లో దింపుతావా?’’ అంటూ ఎంతో ఆవేశంగా గట్టిగట్టిగా అరిచాడు. అగ్రకులం కాని వాళ్లను తీసుకొచ్చి అద్దెకు దించి ఇంటిని గబ్బు గబ్బు చేసేశారని ఇరుగుపొరుగు ఇంటివాళ్లు నాకు ఫోన్‌ చేసి దుమ్మెత్తి పోశారు.

 ఈ నెల అద్దె కూడా వద్దు, వాళ్లను వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పండి అని వేడుకున్నాడు’’ అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. ‘‘పలానా జాతి వాళ్లమని చెప్పేటట్టుగా ఇంట్లో మేము ఏ ఆధారాన్నీ ప్రదర్శించుకోము. అయినప్పటికీ మేము అగ్రకులం కాదని దేన్ని బట్టి అంటున్నారట?’’ అని అడుగుతున్నప్పుడు ఇతని గొంతు చాలా బలహీనంగా ధ్వనించింది. ‘‘ఏంటి సార్‌ మీరు, భలే అమాయకులుగా ఉన్నారు. అల్మారాలో పేర్చిపెట్టి ఉన్నారటగా అంబేద్కర్‌ పుస్తకాల్ని. అది చాలదా మీరెవరో తెలియటానికి?’’ అని అంటున్నప్పుడు బ్రోకర్‌ కూడా వాళ్లతో కలిసిపోయినట్టుగా అనిపించింది ఇతనికి.

తాను ఒక వెనకబడిన జాతివాడే. కొని పేర్చి ఉన్న పుస్తకాలను చూసి ఇరుగుపొరుగు వాళ్లు చూపిస్తున్న వివక్ష అర్థం పర్థం లేనిదని చెప్పి ఈ ఇబ్బంది నుండి బయటపడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటే... తనమీద తనకే అసహ్యం కలిగింది ఇతనికి. సమస్య రానంతవరకూ అభ్యుదయవాదిగా కనిపిస్తే, ఏదో ఒక ఇక్కట్టు ఎదురైతే ఎదుర్కోవటానికి భయపడి అగ్రజాతివాడిగా మారిపోతున్నవాళ్ల ‘వేషధారులు’ అని మునుపొకసారి తాను రాసిన వ్యాసం, తనకే సరిపోయే విధంగా అనిపించటం నీచంగా అనిపించింది ఇతనికి. తనలోని ఈ తడబాటు బ్రోకర్‌ గమనించకూడదని కంగారుపడ్డాడు.కొంతసేపు ఇద్దరూ మౌనం వహించారు. ‘‘సార్, సాధారణంగా ఇల్లు కావాలంటూ వచ్చే వాళ్లది ఏ జాతో, ఏ కులమో చూచాయిగా తెలుసుకుని యజమాని దగ్గర చెప్పేస్తాం. వీలు కాకపోతే నేరుగానే అడిగేస్తాం. మీరు మనుషులు కాస్త తెల్లగా, పేరు కాస్త కొత్తగా ఉన్నందువల్ల అడగటం ఎందుకులే అనిపించింది. ఇలాంటి సమస్య లేని ఒక ఇంటిని మీకు రెండు మూడు రోజుల్లో చూసి పెట్టటం నా బాధ్యత. నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు వెంటనే ఈ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేయండి.’’ ‘‘ఉన్నపళంగా మీకు ఏ సమాధానమూ చెప్పలేకపోతున్నా. నాకొక వారం గడువివ్వండి’’ అన్నాడు ఇతను.

అట్టపెట్టెల్లో నుండి తీసి అమర్చిన పుస్తకాలు ఉన్నది ఉన్నచోటే ఉన్నాయి. మధ్యలో చిలక కొన్న పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఆమె ఎంతో సెలెక్టివ్‌గానే పుస్తకాలను కొంటుంది. ఇతనైనా కనిపించిందంతా కొంటాడు. ఉదయం విడుదలయ్యే పుస్తకాన్ని సాయంకాలం లోపు చదివి పూర్తిచేసేటంతగా ఇతనొక గొప్ప పాఠకుడు. ఇతని వల్ల చదవటానికి వీలుకాని పుస్తకం అంటూ ఏదైనా ఉందంటే అది ఇంకా ప్రచురణ కానటువంటిదే అయ్యుంటుంది. కానీ అంబేద్కర్‌ సీరీస్‌ పుస్తకాలను ఇతను కొనటం ఆ విధంగా జరిగింది కాదు. చెప్పాలంటే చిలకే ఇతని చేత వాటిని కొనిపించింది. కానీ అంబేద్కర్‌ పుస్తకాల వల్ల ఇలాంటి ఒక ఇక్కట్టు వస్తుందని అప్పుడు ఇతను గ్రహించలేకపోయాడు.

బ్రోకర్‌ చెప్పిన విషయాన్ని చిలకకు చెప్పాలా, వద్దా అన్న సందిగ్ధం ఇతణ్ణి ఇబ్బందిపెట్టింది. ఆమెతో చెప్పకుండా ఈ సమస్యకొక పరిష్కారం లభించదని భావించి తడబడుతూ ఎలాగో విషయాన్ని చెప్పేశాడు. ‘జీవరాణి’ పుట్టినరోజు పండుగకు మామూలుగానే వచ్చిన ఇరుగుపొరుగు ఆడవాళ్లు, వచ్చాక... ఎందుకు ఆసహజంగా సీట్లలో కూర్చున్నారు? ఇంట్లో ఉన్న ఏ వస్తువు వాళ్లను మార్చింది? ఫలహారం, కాఫీ, మంచినీళ్లు అంటూ ఏమీ తీసుకోకుండా వాళ్లు నిరాకరించటానికి గల కారణం ఏమిటీ? బలవంతంగా కేక్‌ మాత్రం తీసుకొన్న ఒకళ్లిద్దరూ కూడా దాన్ని అయిష్టంగానే నోట్లో పెట్టుకున్నది ఎందుకు? అంటూ ఆమెను దహించి వేస్తున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించింది. ఇక ఆలస్యం చెయ్యఖ్ఖర్లేదు. ఇంటిని మారుద్దాం అంది.

బహిరంగంగా వేరుచేస్తూ నిలబడ్డ అడ్డు గోడల కన్నా మనసుల్లో ఒక్కొక్కరూ కట్టుకొని ఉన్న ఈ మాయా కుడ్యాల గట్టిదనంతో మోది, గుద్దుకొని ఓడిపోవటం వీళ్లకు అవమానంగా కూడా అనిపించింది. ఏ ఇంటికి వెళ్లినా ఇలాంటి అసమానత, నిరాకరణలనే ఎదుర్కోవలసి ఉంటుందని బాగానే గ్రహించారు. అయితే అందుకని చిలక చెప్పిన నిర్ణయాన్ని ఇతను వెంటనే అంగీకరించలేక తికమకపడ్డాడు. ఇప్పుడే కాదు, పెళ్లికి ముందు కూడా ఆమె ఇలాంటి ఒక ఆలోచననే చెబుతుండేది. ప్రతీసారీ ఇల్లు మారేటప్పుడల్లా ఆమె ఈ ఆలోచన బలంగా కూడా చేప్పేది. ఇతనే ఆలోచించటానికి ఇంకా సమయం కావాలి అంటూ చెప్పి వాయిదా వేస్తూ చిలక దగ్గర తనను తాను తక్కువ చేసుకుంటూ వస్తున్నాడు.

ఇంకా నీలో ఉండే మగతనమో, లేదూ జాతీయవాదో నా ఆలోచన అంగీకరించనీయకుండా నిన్ను అడ్డుకుంటున్నాడా?... అన్నట్టుగా చిలక తన దృష్టిని సారించినపుడు... ఇతను తన తడబాటు, అలజడిని దాచుకోవటానికి వీలుకాక ఇబ్బందిపడ్డాడు. ఈ మారు సమయం అడగటానికి బదులుగా తనంతట తానుగా కొన్ని నిర్ణయాలను తీసుకోవలసిన నిర్బంధానికి ఇతను గురయ్యాడు.మనవాళ్లు కాకపోతే ఇక్కడికి కాపురానికొస్తారా అని వీళ్లూ, వాళ్ల మనుషులుగా లేకపోతే అక్కడికి అద్దెకు వెళ్లేవాళ్లా అని వాళ్లూ వాదులాడుకుంటూ ఉండటాన్ని పట్టించుకోకుండా చిలకా, ఇతను అంబేద్కర్‌ నగర్‌ నుండి ఇప్పుడు ఆఫీసుకు వెళ్లొస్తున్నారు. జీవరాణి, నూతన్‌లు అంబేద్కర్‌ నగర్‌ పిల్లల తోటి హాయిగా ఆడుకుంటున్నారు. అంబేద్కర్‌ కాని మిగతావాళ్ల పుస్తకాలు అల్మారాలో బొత్తిగా పేర్చి ఉండటం గురించి ఇక్కడ ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలూ లేవు.

మరిన్ని వార్తలు