నడవాలంటే నరకమే..!

16 Nov, 2016 00:06 IST|Sakshi
నడవాలంటే నరకమే..!

 హోమియో కౌన్సెలింగ్

నా వయసు 40 ఏళ్లు. పొద్దున లేవగానే నడవటం అంటే నరకం కనిపిస్తుంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. దీనికి హోమియో పరిష్కారం చెప్పండి. - సునీత, హైదరాబాద్
వయసు పెరుగుతున్న కొద్దీ అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా దెబ్బ తింటుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తాయి. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది.

కారణాలు: డయాబెటిస్  ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడంతక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో)

లక్షణాలు: మడమలో పొడిచినట్లుగా నొప్పి  ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం  కండరాల నొప్పులు

చికిత్స: హోమియోలో మడమనొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రూస్‌టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

డాక్టర్ మురళి  కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి,  హైదరాబాద్


రొమ్ము తొలగిస్తారనే ఆందోళనే వద్దు!
క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 46 ఏళ్లు. పన్నెండేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఈమధ్యనే ఎడమవైపు రొమ్ములో ఏదో తేడా వచ్చినట్లు గమనించాను. డాక్టర్‌ను కలిస్తే పరీక్ష చేసి మ్యామోగ్రామ్ చేయాలన్నారు. అసలు ఏమైందని అడిగాను. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చేమోనని, బయాప్సీ చేస్తే తెలుస్తుందని అన్నారు. ఇదే విషయం నాకు బాగా దగ్గరివారితో చెబితే రొమ్ము తొలగిస్తారేమోనని అన్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.  - ఒక సోదరి
గతంలో కేవలం పెద్ద వయసు మహిళలు, 50 ఏళ్లు పైబడిన స్త్రీలే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడేవారు. కానీ గతం కొంతకాలంగా 30 ఏళ్లు చిన్న వయసు వారు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా వివాహాలు ఆలస్యంగా కావడం, బిడ్డలకు పాలు పట్టకపోవడం, హార్మోన్లలో మార్పుల వంటివి ముఖ్యమైనవి. ఇవే కాకుండా ఆధునిక జీవనశైలి, కొలెస్ట్రాల్, స్థూలకాయం, కుటుంబ నేపథ్యం, రేడియేషన్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీనిని గుర్తించడం కూడా ఒక్కోసారి కష్టంగా మారుతుంటుంది. చాలామంది స్త్రీలు తమ రొమ్ములో గడ్డలను గమనిస్తారు. కానీ నొప్పి లేకపోవడంతో అశ్రద్ధ చేస్తుంటారు. అయితే అలా చేయకూడదు. రొమ్ముల్లో గడ్డ కనిపించినా, అక్కడి చర్మభాగంలో మార్పులు (అంటే నల్లగా, ఎర్రగా మారడం), రొమ్ముపై సొట్టలు పడటం, వాటి పరిమాణంలో తేడాలు రావడం వంటి మార్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని కలిసి పరీక్షలతో వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి.

ఇక మీ విషయానికి వస్తే మీరు వెంటనే మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి. అందులో మీకు క్యాన్సర్ ఉందా, లేదా అన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ ఉందని అనుమానం వస్తే బయాప్సీ లేదా ఎఫ్‌ఎన్‌ఏసీ లాంటి చిన్న నీడిల్ పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్‌ను నిర్ధారణ చేయవచ్చు. మీరు పెద్ద హాస్పిటల్స్‌కు వెళ్లి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్‌ను సంప్రదించడం. వారు క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో పరీక్షించి దానికి తగ్గట్లు చికిత్స అందిస్తారు. క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పటికీ మీరు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు నిపుణులైన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు భయపడుతున్నట్లుగానే చాలామంది మహిళల్లో కూడా అనుమానాలున్నాయి. కానీ అది కేవలం అపోహ మాత్రమే. మీ రొమ్మును ఏమాత్రం తీయకుండానే, దాని పరిమానాన్ని కూడా తగ్గించకుండానే సర్జరీ నిర్వహించి, క్యాన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించవచ్చు. కానీ రొమ్ముతో పాటు దాని చుట్టుపక్కల (శాటిలైన్ లీజన్స్) మచ్చలుంటే క్యాన్సర్ అక్కడ కూడా వ్యాపించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే పాక్షికంగా రొమ్మును తొలగించాల్సి రావచ్చు. అయితే అప్పుడు కూడా రొమ్ములో ఏర్పడ్డ ఖాళీ భాగాన్ని చుట్టుపక్కల ఉండే కండరం, ఇతర రొమ్ము భాగాలను సర్దుబాటు చేసి, రొమ్మును సంపూర్ణంగా కనిపించేలా చేస్తారు. లేదా సిలికాన్ ఇంప్లాంట్స్ ద్వారా కూడా రొమ్ము ఆకృతిని సరిదిద్దవచ్చు. రొమ్ములో ఏర్పడిన గడ్డలన్నీ చాలావరకు క్యాన్సర్ కాకపోవచ్చు కూడా. అయితే అవి క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవడం అత్యవసరం. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా, నిర్భయంగా డాక్టర్‌కు చూపించుకోండి.

డాక్టర్ కె.శ్రీకాంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

మరిన్ని వార్తలు