హైపో థైరాయిడిజమ్‌ తగ్గుతుందా?

19 Dec, 2016 23:42 IST|Sakshi
హైపో థైరాయిడిజమ్‌ తగ్గుతుందా?

హోమియో కౌన్సెలింగ్‌


నా వయసు 33 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్‌ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్‌ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా?      – శకుంతల, రాజమండ్రి
మానవ శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్‌ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్‌ అనేది మానవ శరీరంలో థైరాయిడ్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో  బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్‌ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్‌ వస్తుంది.
థైరాయిడిజమ్‌ నుంచి తగినంత మోతాదులో హార్మోన్‌ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్‌ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) అవసరం. అయోడిన్‌ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్‌

నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్‌ యాంటీబాడీస్, థైరాయిడ్‌ స్కానింగ్, అల్ట్రాసౌండ్‌.

చికిత్స: హైపోథైరాయిడిజమ్‌ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు  హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి
హైదరాబాద్‌

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... ఆపరేషన్‌ తప్పదా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్‌


నేను నెల రోజుల క్రితం హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్‌ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. – ఉష, కొత్తగూడెం
మీరు చెప్పినదాని ప్రకారం మీకు అసింప్టమాటిక్‌ గాల్‌స్టోన్‌ డిసీజ్‌ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్‌బ్లాడ్‌ర్‌లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారిలో నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు.


నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్‌ సైజు పెరిగిందని చెప్పారు.  లివర్‌ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – మనోహరరావు, కోదాడ
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్‌ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్‌ సైజ్‌ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్‌ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్‌–బి, హెపటైటిస్‌–సి వంటి ఇన్ఫెక్షన్స్‌ వల్ల కూడా లివర్‌ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ.

ముందుగా మీలో లివర్‌ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి.

నా వయసు 43 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. మూడు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – దామోదర్‌రావు, కాకినాడ
మీ లేఖలో మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ కావచ్చని  అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది.

డాక్టర్‌ భవానీరాజు,
సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు