గొంతునొప్పితో గుండెకూ చేటు!

2 Jan, 2017 23:52 IST|Sakshi



కౌన్సెలింగ్‌

మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు గొంతు నొప్పి అంటుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి అది రుమాటిక్‌ ఫీవర్‌ అని, ఇదొక రకం గుండె సమస్య అని చెప్పారు. చూడటానికి జలుబు లా చిన్న సమస్యగా  అనిపించే ఇది గుండె సమస్య లాంటి పెద్ద సమస్య ఎలా పరిణమించింది? దయచేసి వివరించండి. – గోపాల్‌రావు, హైదరాబాద్‌
గొంతునొప్పికీ....గుండె జబ్బుకూ సంబంధం ఉంటుందన్న మాట వినడానికే కాస్త నమ్మకం కలిగించేదిగా లేదు కదా. అయితే చిన్నారులకు బాగా జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా పరిగణించకూడదు. ఎందుకంటే అది కొందరిలో జలుబు, గొంతునొప్పితో వ్యక్తమయ్యే ఆ లక్షణాలు స్ట్రెప్టోకోకస్‌ పీయోజెన్స్‌ వల్ల టాన్సిలైటిస్‌కూ, ఆ తర్వాత రుమాటిక్‌ ఫీవర్‌కూ దారి తీసే అవకాశం ఉంది. ఈ రుమాటిక్‌ ఫీవర్‌ సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా 5 – 10 ఏళ్ల పాటు రుమాటిక్‌ ఫీవర్‌ కొనసాగితే, అది గుండె వాల్వ్స్‌పై దుష్ప్రభావం చూపి గుండెకు నష్టం చేస్తుంది.

దీనికి తొలి దశలో యాంటీబయాటిక్స్‌తో చాలా చాలా  చిన్నదైన తగిన చికిత్స అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించినప్పటికీ చాలా మంది చిన్నారులకు వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ అవసరం కూడా పడవచ్చు. అలాగే రక్తం పలుచబార్చే మందులు జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి వారిలో ఆడ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు ప్రెగ్నెన్నీ వస్తే అది కూడా ఒక సమస్యగా పరిణమించవచ్చు. అందుకే గొంతునొప్పితో జలుబును పోలి ఉండే ఒక మామూలు సమస్యనూ చిన్న సమస్యగా పరిగణించకూడదు. మీరు చెప్పిన అంశాలను బట్టి ఇది ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మీరు వెంటనే దగ్గర్లోని గుండె నిపుణులను సంప్రదించండి.

డాక్టర్‌ కృష్ణప్రసాద్, చీఫ్‌ కార్డియోవాస్క్యులర్‌ థొరాసిక్‌ సర్జన్‌
అండ్‌ డైరెక్టర్,మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు