హైపోథైరాయిడిజమ్‌ తగ్గుతుందా?

16 Jan, 2017 23:35 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 34 ఏళ్లు.ఈ మధ్య  నేను బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్‌ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్‌ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – కుసుమ, భువనగిరి
మానవ శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్‌ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్‌ అనేది మానవ శరీరంలో థైరాయిడ్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో  బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్‌ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్‌ వస్తుంది.
థైరాయిడిజమ్‌ నుంచి తగినంత మోతాదులో హార్మోన్‌ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్‌ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) అవసరం. అయోడిన్‌ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు: ∙ బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్‌

నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్‌ యాంటీబాడీస్, థైరాయిడ్‌ స్కానింగ్, అల్ట్రాసౌండ్‌.

చికిత్స: హైపోథైరాయిడిజమ్‌ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌

తరచూ మూత్రంలో మంట.. ఎందుకిలా?
నెఫ్రాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 36 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట  ఉంటోంది. ఇలా మాటిమాటికీ జ్వరం, మంట రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? – నీరజ, కాకినాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్‌ యూరిన్‌ ఇన్ఫెక్షన్‌’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్‌ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్‌ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఒకసారి మీరు షుగర్‌ టెస్ట్‌ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్‌ ఇచ్చిన యాంటీబయాటిక్‌ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్‌ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్‌ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్‌ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి.

నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?
– ప్రవీణ్‌కుమార్, పాలకొండ
 

మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్‌ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ ఇబ్బంది (గ్లోమెరూలో నెఫ్రైటిస్‌ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోండి. మూత్రపరీ„ý  కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్‌ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్‌ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్‌ టెస్ట్‌ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్‌ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.

నా వయసు 28 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? – మనోహర్, కోదాడ
ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్‌ టెస్ట్‌ అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు బాగా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్‌ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి.

నా వయసు 62 ఏళ్లు. షుగర్‌వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. రెండేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను.  ఫిస్టులా ఆపరేషన్‌ కూడా అయ్యింది. డయాలసిస్‌ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. డయాలసిస్‌ కాకుండా ఇంకేమైనా పద్ధతులున్నాయా? – భూమయ్య, కరీంనగర్‌
ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్‌ వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్‌ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్‌ క్యాథ్‌ ద్వారా డయాలసిస్‌ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్‌ డయాలసిస్‌ (కంటిన్యువస్‌ ఆంబుల్యేటరీ పెరిటోనియల్‌ డయాలసిస్‌–సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్‌ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ బాగుంటుంది. హోమ్‌ డయాలసిస్‌కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్‌ డయాలసిస్‌ కంటే తక్కువ. కాబట్టి ఒకసారి మీ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి ఈ వివరాలు తెలుసుకోండి.

డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌

స్టెమ్‌సెల్‌ థెరపీ అందుబాటులోకి వచ్చిందా?
న్యూరో కౌన్సెలింగ్‌


నేను గత 15 ఏళ్లుగా పక్షవాతం (పెరాలసిస్‌) వ్యాధితో బాధపడుతున్నాను. అయితే పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్‌ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు వార్తాపత్రికల్లో చదివాను. ఈ చికిత్స ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలు ఎంత మెరుగ్గా ఉంటాయన్న విషయాలను వివరంగా తెలియజేయగలరు. – శివకుమార్‌ రావు, కాళహస్తి
ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా  మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. ఇలాంటి సమయంలో గతంలో మనం నేర్చుకున్న అవశాలను తిరిగి పొందడానికి దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. దాంతో మనం పోగొట్టుకున్న అంశం మళ్లీ మనకు దక్కుతుంది. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్‌ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు.
సాధారణంగా 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియ విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలుగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలుగను రూపొందించడం అన్నమాట.

ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలాకాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఫలితాలు అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. ఇంకా చికిత్స వరకూ రాలేదు.

డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌ రెడ్డి
సీనియర్‌ న్యూరాలజిస్ట్‌
సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం.12
బంజారాహిల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు