తరచూ జలుబు... తగ్గేదెలా?

26 Jan, 2017 23:26 IST|Sakshi
తరచూ జలుబు... తగ్గేదెలా?


ఇఎన్‌టి కౌన్సెలింగ్‌

నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాను. జలుబు టాబ్లెట్‌ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – చిన్నారావు, ఏలూరు  
మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్‌ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్‌ టాబ్లెట్‌ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్‌ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి.

నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్ని సార్లు కింద కూడా పడిపోయాను. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. బీపీ, షుగర్‌ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్‌ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా, పరిష్కారం సూచించండి. – పద్మనాభప్రసాద్, విజయవాడ  
మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్‌ పొజిషనల్‌ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్‌ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్‌ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో  ఓటోలిత్‌ అనే కణాలు, హెయిర్‌ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్‌ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్‌ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్‌ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది.

డాక్టర్‌ ఇ.సి. వినయకుమార్‌
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు