చేతుల వరకూ పాకే మెడనొప్పి... ఎందుకిలా?

7 Sep, 2017 00:15 IST|Sakshi
చేతుల వరకూ పాకే మెడనొప్పి... ఎందుకిలా?

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 58. కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకుగురయ్యాయని చెప్పారు. మందులు వాడితే తగ్గుతోంది, ఆపేస్తే నొప్పి వస్తోంది. నా సమస్య హోమియో మందులతో శాశ్వతంగా తగ్గుతుందా?– సీహెచ్‌ వెంకటేశ్వరరావు, ఖమ్మం

మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. దీనినే సర్వైకల్‌ స్పైనల్‌ ఆర్థరైటిస్‌ అని కూడా అంటారు.

కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశముంది.

లక్షణాలు:సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.

నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్‌–రే సర్వైకల్‌ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు.
హోమియో చికిత్స: జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించి మెడనొప్పిని పూర్తిగా తగ్గేలా చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌


సోరియాసిస్‌ తగ్గుతుందా?
నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని పూతమందులు, మాత్రలు వాడినా పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? -  సురేశ్, నిజామాబాద్‌


సోరియాసిస్‌ చాలా మందిని బాధపెడుతున్న సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతం మంది స్త్రీ, పురుషులు దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చాలామంది దీన్ని కేవలం చర్మసమస్యగా భావిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ సమస్య. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పరిణమించడం వల్ల వచ్చే సమస్య.

ఇందులో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతోపాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడతాయి. ఇలా పొరలుగా ఏర్పడటం వల్ల వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న దద్దుర్ల వస్తాయి. దురద కూడా ఉంటుంది. సోరియాసిస్‌ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అంటారు.

కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం.

లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కూడా అవుతుంది.

నిర్ధారణ పరీక్షలు: స్కిన్‌ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్‌–రే పరీక్షలు.

చికిత్స: సోరియాసిస్‌ నివారణ/చికిత్సలకు హోమియో ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధి విషయంలో వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌


ఒత్తిడితో గుండెపోటు ఎందుకు వస్తుంది?
కార్డియాలజీ కౌన్సెలింగ్స్‌

నా వయసు 38 ఏళ్లు. ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మార్కెటింగ్‌ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా చేస్తున్నాను. ఆఫీసులో టార్గెట్లు, ఇంట్లో టీనేజీ అబ్బాయి చదువుతో బాగా ఒత్తిడికిలోనవుతున్నాను. స్ట్రెస్‌ వల్ల గుండెజబ్బులు వస్తాయని విన్నాను. అసలు స్ట్రెస్‌తో గుండెజబ్బులు ఎందుకు వస్తాయి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి. – సురేశ్‌కుమార్, విజయవాడ
పెరిగే ఒత్తిడి నేరుగా గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఆధునిక నగర జీవితంలో కొంత ఒత్తిడి సహజమే. అయితే ఆఫీసులో పని, కుటుంబ కలహాలు, పిల్లల భవిష్యత్తు, ఆప్తుల అనారోగ్యవం వంటివి ఒత్తిడిని మరికొంత పెంచుతుంటాయి. ఉద్యోగస్తుల్లో ఒత్తిడికి సంబంధించి ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. పై అధికారుల ప్రవర్తన, నిర్వణశైలి, సహచరుల మధ్య పోటీ వంటి వాటితో పాటు ఏ క్షణమైనా ఉద్యోగం పోతుందన్న ఆందోళన వంటి అంశాలు మిగతావారితో పోలిస్తే గుండెపోటు ముప్పును 20 శాతం పెంచుతున్నట్లు తేలింది. ఒత్తిడి... గుండెపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం.

సాధారణంగా ఒత్తిడి శరీరంలో అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. దాంతో అవయవాలలో వాచే తత్వం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం, రక్తంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గడం వంటిటి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిరంతరాయం ఉండే ఒత్తిడి గుండెకు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఒత్తిడి, విచారం వల్ల నిద్ర దూరం అవుతుంది. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో లోటుపాటు పెరుగుతాయి. ఈ రకమైన మార్పులన్నీ కలిసి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మొదట చేయాల్సిందల్లా ఒత్తిడితో గుండెకు ప్రమాదం ఉందన్న అంశాన్ని గుర్తించడమే.

అలాగే గుండె వ్యాధులకు కారణమయ్యే అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబయాకం వంటి వాటికి చికిత్స తీసుకుంటూ ఉండాలి. ఇక రోజూ కనీసం ముప్ఫయి నిమిషాల పాటు వ్యాయామం గుండె ఆరోగ్యంతో పాటు పూర్తిస్థాయి ఒంటి ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. అలాగే యోగా, ధ్యానం వంటివి ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు సహాయపడతాయి.
డాక్టర్‌ టి. శశికాంత్, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్,
యశోద హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు