ఫైబ్రాయిడ్స్‌ సమస్య... తగ్గేదెలా?

14 Sep, 2017 00:10 IST|Sakshi
ఫైబ్రాయిడ్స్‌ సమస్య... తగ్గేదెలా?

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్సతో వాటిని తొలగించాలని, అయితే భవిష్యత్తులో మళ్లీ రావచ్చని అంటున్నారు. దాంతో ఆందోళనగా ఉంది. హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? – మాధవి, చిత్తూరు

గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు.

కారణాలు: ఫైబ్రాయిడ్స్‌ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.

లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం.. లక్షణాలను గమనించవచ్చు.

చికిత్స: జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌


బాబుకు ఆస్తమా... నయమవుతుందా?
మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం, పిల్లికూతలతో బాధపడుతున్నాడు. ఇప్పుడు వర్షాకాలం. ఎప్పుడు హాస్పిటల్‌లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు చికిత్స ఉందా?  - శ్రీప్రసాద్, ఖమ్మం
 
ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్‌) ఎక్కువగా తయారవుతుంది. అది ఊపిరిని అడ్డుకుంటుంది. దాంతో వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది.

కారణాలు: ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ పరిస్థితులు, చల్లగాలి ∙వైరస్‌లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు ∙వంశపారంపర్యం మొదలైనవి.

వ్యాధి నిర్ధారణ: ఎల్‌ఎఫ్‌టీ (లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, రక్తపరీక్షలు.

చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్‌ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్‌ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్‌ ఆల్బ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. తగిన మందులు వాడితే హోమియో ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌


తరచూ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌... ఎందుకిలా?
నా వయసు 35 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. ఈ సమస్య తరచూ వస్తోంది. డాక్టర్‌ను కలవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?  - సోదరి, హైదరాబాద్‌

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి.

కారణాలు : సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై అనే బ్యాక్టీరియా తరచూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మరో కారణం. అవి  మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందడానికి దోహదపడి ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లోనూ ఇది సాధారణం.

లక్షణాలు : మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం.

చికిత్స : యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

 

మరిన్ని వార్తలు