వియ్‌ ఆర్‌ లక్కీ

9 Feb, 2020 04:49 IST|Sakshi
శ్రీకాంత్, ఊహ

వీళ్లెక్కడికి వెళ్లొచ్చినా.. గుడికి వెళ్లొచ్చినట్లే ఉంటుంది! వీళ్ల పెళ్లిరోజు సెలబ్రేషన్‌ కూడా గుడికి వెళ్లి రావడమే! పెళ్లయి ఇరవై మూడేళ్లయింది. ఎప్పుడు చూసినా.. అప్పుడే గుడి నుంచి వచ్చినట్లుగా ఫ్రెష్‌గా.. ప్రశాంతంగా ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్లాక.. ‘‘ఎలా సాగుతోంది మీ మ్యారీడ్‌ లైఫ్‌’’ అని అడగాలనిపించలేదు. ‘జస్ట్‌ మ్యారీడ్‌’లా కళ్లెదుట కనిపిస్తుంటే.. ఇక ప్రశ్నలేముంటాయ్‌? అయినా అడిగాం. ఇష్టాల్నీ, కష్టాల్నీ చెప్పమన్నాం. ‘వియ్‌ ఆర్‌ లక్కీ’ అన్నారు శ్రీకాంత్, ఊహ. ఏ విషయంలో వాళ్లు లక్కీ?! చదవండి.

► గత నెల పెళ్లి రోజు (జనవరి 20)ని ఎలా జరుపుకున్నారు?
ఊహ: మా పెళ్లి రోజు సెలబ్రేషన్‌ అంటే గుడికి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకోవడమే. ఈసారి తిరుపతి వెళ్లాం. ఆ తర్వాత షిరీడి వెళ్లాం.
శ్రీకాంత్‌: అవును.. ప్రతీ యానివర్సరీకి ఏదో ఒక గుడికి వెళ్తాం. ఒకసారి కాశీ వెళ్లాం. మేం ఇద్దరం ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోం. అయితే ముగ్గురు పిల్లల బర్త్‌డేలను మాత్రం వాళ్ల ఫ్రెండ్స్‌ని పిలిచి, గ్రాండ్‌గా చేస్తాం.

► ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. మొదట్లో ఉన్నంత ప్రేమ 23 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత కూడా ఉందా?
ఊహ: చెప్పాలంటే ప్రేమ ఇంకా పెరిగింది. ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం.. ఏ కపుల్‌ మధ్య అయినా ఈ రెండూ ఉంటే అంతా హ్యాపీగా వెళ్లిపోతుంది.
శ్రీకాంత్‌: అలాగే చిన్న చిన్న అలకలు కూడా.
ఊహ: అవి ఉంటేనే బావుంటుంది. మా మధ్య అవి కూడా ఉంటాయి. బాధ్యతల వల్ల మనుషులు ఇంకా దగ్గరవుతారు. అయితే బిగినింగ్‌ డేస్‌లో ఎలా ఉంటామో పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా  అలా ఉండలేం. రోజంతా ఎవరి బిజీలో వాళ్లు ఉండిపోతాం. మేం సరదాగా ఎక్కడుంటాం అంటే ఏదైనా పిక్నిక్‌కు వెళ్లినప్పుడో, ఫంక్షన్‌కు వెళ్లినప్పుడో.. అప్పుడు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తాం. అలకలు, బాధ్యతల వల్ల ప్రేమ పెరిగినట్లు ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు తెలుస్తుంది.. ఎవరి ఎఫెక్షన్‌ ఎంత ఉంటుందో.

► అలా ఆరోగ్యం బాగాలేని సందర్భాలేమైనా?
ఊహ: అప్పట్లో ఆయన కాలికి పెద్ద ఆపరేషన్‌ జరిగింది. షూటింగ్స్‌లో జరిగిన ప్రమాదాల్లో చాలాసార్లు దెబ్బలు తగిలాయి. ఆపరేషన్‌ చేయాలని డాక్టర్‌ అంటే పోస్ట్‌పోన్‌ చేసుకుంటూ వచ్చారు. జనవరి 20న మా పెళ్లయింది. హనీమూన్‌ వెళదామని ప్లాన్‌ చేసుకున్నాం. వెళ్లేముందు జస్ట్‌ డాక్టర్‌ చెకప్‌కి వెళ్లాం. టెస్ట్‌ చేసి వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. ట్రిప్‌ ఎప్పుడైనా వెళ్లొచ్చు అనుకుని హనీమూన్‌ క్యాన్సిల్‌ చేనుకున్నాం.
శ్రీకాంత్‌: అప్పుడు బాగా చూసుకుంది.
ఊహ: ఆయన కూడా అంతే. నాకు ఆరోగ్యం బాగా లేదంటే కేరింగ్‌గా ఉంటారు.

► జనరల్‌గా మీ ఇద్దరికీ ఎలాంటి విషయాల్లో గొడవలు వస్తుంటాయి?
ఊహ: పిల్లల విషయంలోనే వస్తుంది. నేనేమో స్ట్రిక్ట్‌గా ఉండాలంటాను. ఆయనేమో పోనీలే అంటారు.
శ్రీకాంత్‌: సీరియస్‌ గొడవలు ఏం ఉండవు.

► మీ ప్రేమ ఎలా మొదలైంది?
ఊహ: ఇప్పటికి ఆలోచించినా అర్థం కాదు. ఇష్టం అంతే.  
శ్రీకాంత్‌: మేం ఇద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. ఫస్ట్‌ నుంచి కూడా ఒకరంటే ఒకరికి సాఫ్ట్‌ కార్నర్‌ ఉండేది. అలా ప్రేమ మొదలైంది.

► ఒకరిలో ఒకరికి నచ్చిన క్వాలిటీస్‌ ఏంటి?
ఊహ: నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరితో సరదాగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకుని యాక్సెప్ట్‌ చేస్తారు. ఇంకేం కావాలి?
శ్రీకాంత్‌: తనది సర్దుకుపోయే మనస్తత్వం. కోపం వచ్చినా  మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తుంది. అందరూ కావాలనుకుంటుంది. అందరితో ప్రేమగా ఉంటుంది.

► మీది సర్దుకుపోయే స్వభావం అన్నారు శ్రీకాంత్‌గారు. మరి.. అత్తగారింట్లో సర్దుకుపోయి ఉండాల్సి వచ్చిందా?
ఊహ: మా పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సర్దుకుపోవాల్సిన అవసరం రాలేదు. వాళ్ల ఇంట్లో అమ్మాయిలానే చూసుకుంటారు. అత్తయ్య మామయ్య అని పిలవను. అమ్మానాన్న అనే పిలుస్తాను.
శ్రీకాంత్‌: సర్దుకుపోవాల్సి వచ్చి ఉంటే 23 ఏళ్లు ప్రయాణం కొనసాగేది కాదేమో.
ఊహ: మాది జాయింట్‌ ఫ్యామిలీ.
శ్రీకాంత్‌: నాకు జాయింట్‌ ఫ్యామిలీ ఇష్టం. మా అమ్మా నాన్న మాతోనే ఉంటారు.

► మీరు మీ అత్త, మామలను బాగా చూసుకుంటున్నారు. మరి మీ అమ్మా, నాన్నలను శ్రీకాంత్‌గారు ఎలా చూసుకుంటారు?
ఊహ: నాకంటే బాగా చూసుకుంటారు. మా అమ్మా, నాన్నలను అత్తయ్య, మామయ్య అనరు. నేను తన అమ్మానాన్నని పిలిచినట్లే ఆయన కూడా అత్తమామలను అమ్మానాన్నా అనే పిలుస్తారు.

► మీది ప్యూర్‌ వెజ్‌ ఫ్యామిలీ. వీళ్లు నాన్‌వెజ్‌. ఇబ్బందిగా ఉంటుందా?
ఊహ: ఫస్ట్‌ కొన్ని నెలలు ఇబ్బందిగా ఉండేది. నా పక్కన ఎవరైనా కూర్చుని నాన్‌వెజ్‌ తిన్నా నాకు కడుపులో తిప్పేది. గుడ్డు మాత్రం తినేదాన్ని. అది కూడా వారానికి రెండు రోజులే. మిగతా రోజులన్నీ ఆ వ్రతం ఈ వ్రతం ఉండేవి. ఒకసారి అత్తయ్యవాళ్లు అమెరికా వెళ్లారు. వాళ్లు ఉన్నన్ని రోజులు నాన్‌ వెజ్‌ వండేవారు. నాకు మా సైడ్‌ వంటకాలు అన్నీ వచ్చు కానీ ఆంధ్రా స్టయిల్‌ వంటలు రావు. ఈయన ఇబ్బంది పడేవారు. బయట నుంచి తెప్పించుకునేవారు. లైఫ్‌ లాంగ్‌ ఇలా అయితే ఇబ్బంది అవుతుంది కదా అని నాన్‌వెజ్‌ వండాలని డిసైడ్‌ అయ్యాను. మా వంట మనిషిని పక్కన పెట్టుకుని రెసిపీ బుక్‌ చూస్తూ, ముక్కుకి కర్చీఫ్‌ కట్టుకొని దూరంగా నిలబడి కుక్‌ చేశాను. అలా మెల్లిమెల్లిగా వండటం స్టార్ట్‌ చేశాను. అయితే వండుతున్న ప్రతిసారీ ‘అయ్యో పాపం’ అని వండుతాను. కానీ ఇప్పటికీ నాన్‌వెజ్‌ తినను.

► మీరు మలయాళీ. మరి కేరళ వంటకాలు కూడా అలవాటు చేశారా?
ఊహ: మాది కేరళ అయినా పుట్టింది, పెరిగిందీ చెన్నైలోనే. మా ఫుడ్‌ ఎక్కువ సాంబార్‌ బేస్డ్‌ ఉంటుంది. ఇంట్లో అవి కూడా చేస్తాం.
శ్రీకాంత్‌: అన్ని రకాల వంటలు చేస్తుంది. నాన్‌వెజ్, వెజ్‌.. ఏదైనా బాగా వండుతుంది.
   
► కుక్‌ ఉంటారు కదా. అయినా మీరే చేస్తారా?
ఊహ: కుక్‌  ఉంటారు. కానీ పిల్లలకు కావాల్సినవి ఎక్కువగా నేనే చేస్తాను. రోషన్, మేధ (పాప పేరు), రోహన్‌ ముగ్గురి టేస్ట్‌ వేరు. రోషన్, మేధది సెపరేట్‌ డైట్‌. ఇద్దరూ ఏది పెడితే అది తినరు. మా చిన్నోడు రోహన్, ఈయన ఒకేలా తింటారు. కొంచెం పులిహోర టైపు వంటలవీ రోహన్‌ బాగా తింటాడు.

► ఓకే... మీరు చేసిన చిత్రాల్లో ‘పెళ్లాం ఊరెళితే’ ఒకటి. అందులో భార్య ఊరెళితే గర్ల్‌ఫ్రెండ్‌తో స్పెండ్‌ చేస్తారు.. మరి?
ఊహ: (మధ్యలో అందుకుంటూ) నేను ఊరెళ్లినా ఒకటే. లేకపోయినా ఒకటే.
శ్రీకాంత్‌: ఎక్కువగా ఫ్రెండ్స్‌తో ఉంటాను. అందరూ మగ స్నేహితులే (నవ్వుతూ).
ఊహ: నేను లేకుండా ఉండలేరు.
శ్రీకాంత్‌: తను ఇంట్లో ఉంటేనే ఫ్రీగా ఉంటుం ది. తను లేనప్పుడు ఫ్రెండ్స్‌తో కూర్చుంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్‌. తనుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్‌ (నవ్వుతూ).
ఊహ: ఖాళీ సమయాల్లో ఆయన బయటకు వెళ్లరు. వాళ్ల ఫ్రెండ్స్‌ ఇంటికే వస్తుంటారు.  

► మీరు ఒక హీరోయిన్‌గా చేసిన ‘ఆయనకి ఇద్దరు’ సినిమాలో మీ భర్త పాత్రను మరో అమ్మాయి (రమ్యకృష్ణ) వెంటాడుతుంది. ఆ సిట్యువేషన్‌ని ఎలా టాకిల్‌ చేయాలో తెలియక తడబడుతుంటారు. రియల్‌ లైఫ్‌లో అయితే?
ఊహ: (పెద్దగా నవ్వుతూ) ఛాన్సే లేదండి. ఆయన మీద నాకున్న నమ్మకం అది. ఇక్కడ ఆయనకి అంత లేదు. ఈ క్వొశ్చన్‌ నన్ను అడగాల్సిన అవసరమే లేదు. శ్రీకాంత్‌గారి గురించి సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు.
శ్రీకాంత్‌: నాతో నటించిన హీరోయిన్స్‌ అందరూ ఉమ (ఊహ అసలు పేరు)కు ఫ్రెండ్సే. వాళ్ల ఇళ్లకు మేం వెళ్తాం, మా ఇంటికి వస్తుంటారు. రోజా నన్ను ‘అన్నయ్యా’ అంటుంది. ‘నువ్వు నన్ను అన్నయ్యా అంటే నీతో డ్యూయెట్‌ ఎలా చేస్తాను’ అనేవాణ్ని. సంగీత కూడా అంతే. దాదాపు అందరం ఫ్యామిలీలానే ఉంటాం. చిరంజీవిగారు వాళ్లు ఎయిటీస్‌ బ్యాచ్‌ అని రీయూనియన్‌ చేసుకుంటున్నారు. ఆ తర్వాత 90స్‌ బ్యాచ్‌ మాది. మేమందరం కూడా అలా కలవాలని ట్రై చేసి, ఓసారి చెన్నైలో కలిసాం. తర్వాత అందరం బిజీ బిజీగా ఉండి 1980స్‌ బ్యాచ్‌లా ప్రతి ఏడాదీ కలవలేకపోతున్నాం.

► కెరీర్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని సినిమాలు మానేశారు. ఆ విషయంలో ఏదైనా బాధగా ఉందా?
ఊహ: ఏమీ అనిపించలేదు. లైఫ్‌లాంగ్‌ ఎలానూ హీరోయిన్‌గా ఉండలేం. జీవితానికి ముఖ్యంగా కావాల్సింది మ్యారీడ్‌ లైఫ్‌. ఏ సమయంలో అయినా పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాల్సిందే. ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం బెటర్‌. మంచి పేరుతో ఇండస్ట్రీ బయటకి వచ్చినట్టు ఉంటుందనిపించింది.
   
► అమలగారు, నదియాగారు.. ఇలా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. మీక్కూడా ఆ ఉద్దేశం ఏమైనా ఉందా?
ఊహ: ముగ్గురు íపిల్లలు ఉన్నారు. నాకు వాళ్లతోనే సరిపోతోంది.
శ్రీకాంత్‌: టీవీలో చేయమని చాలాసార్లు అడిగారు. చేయనని చెప్పింది.

► ఓకే.. ఇన్నేళ్లూ మీడియా ముందుకు రాని మీరు మీ పెద్దబ్బాయి రోషన్‌ హీరో అయినప్పుడు వచ్చి, మాట్లాడారు...
శ్రీకాంత్‌: (మధ్యలో అందుకుంటూ) అవునండీ.. నా సినిమాలకు కూడా రాలేదు.
ఊహ: అప్పుడు ఈయన జోక్స్‌ కూడా చేశారు. నా సినిమాల ఇంటర్వ్యూ అప్పుడు పిలిస్తే వచ్చేదానివి కాదు. మీ అబ్బాయి సినిమా కాబట్టి వస్తున్నావు అనేవారు. మనం పని చేసిన ఇండస్ట్రీలో మన అబ్బాయి కూడా వచ్చి పని చేయడం ఆ ఫీలింగ్‌ భలే ఉంటుంది. ఆ ఫీలింగే వేరు.

► మీ ముగ్గురు పిల్లల పెంపకం గురించి... ముగ్గుర్ని పెంచడం కష్టంగా ఉంటుందా?
ఊహ: కష్టం అనుకుంటే ఒకరిద్దరు ఉన్నా పెంచలేం. హ్యాపీగా పెంచితే వాళ్లే పెరిగిపోతారు. పిల్లల పెంపకాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. సినిమాలు మానేశాను కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలే లోకం. షూటింగ్‌ ముగించుకొని ఈయన వస్తే ఈయన.
శ్రీకాంత్‌: నాకు గుర్తున్నంతవరకూ నేను పిల్లల స్కూల్‌కి వెళ్లింది ఒకే ఒక్కసారి. స్కూల్‌కి తీసుకెళ్లడం, ట్యూషన్స్‌కి తీసుకెళ్లడం.. అన్నీ తనే. పిల్లల విషయంలో నేను చాలా తక్కువ పట్టించుకున్నట్లే.

► ‘రుద్రమదేవి’ సినిమాలో మీ పాప కూడా యాక్ట్‌ చేసింది కదా. కంటిన్యూ చేస్తారా?
శ్రీకాంత్‌: తనకి ఇంట్రస్ట్‌ లేదు. ఆ సినిమాలో చిన్నపిల్లల క్యారెక్టర్‌ అని చేసింది. అంతే. తను బాగా చదువుతుంది. బాస్కెట్‌ బాల్‌ నేషనల్‌ ప్లేయర్‌. మా చిన్నబ్బాయి రోహన్‌కి కూడా సినిమా హీరో అవ్వాలని ఉంది.
ఊహ: రోహన్‌ ప్రభుదేవాతో ఓ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్‌లో ఆ సినిమా రిలీజవుతుంది.

► మాకు తెలిసి శ్రీకాంత్‌గారు బాగా ఖర్చు పెడతారు.. అది నిజమేనా?
శ్రీకాంత్‌: ఇద్దరం ఖర్చు విషయంలో ఒకేలా ఉంటామనే చెప్పాలి. దగ్గరివాళ్ల పెళ్లిళ్లు అంటే బాగా ఇస్తుంది. ఇక అవసరం అని వస్తే ఎవరినీ కాదనదు. ఇద్దరం కూడా అవసరం అనుకున్నచోట ఎంతయినా వెనకాడం. నా ఖర్చులంటే పెద్దగా ఏముంటాయి? ఫ్రెండ్స్‌తో బాగా ట్రావెల్‌ చేస్తుంటాను. అదే నా ఖర్చు.
ఊహ: సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నట్లు ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉంటాం. అయితే మా పెళ్లయిన రోజు నుండి ఇంతవరకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. డబ్బు ఉంది కదా అని కొంతమంది కాసినోలకు వెళతారు. ఆయన అలాంటివి చేయరు.

► సినిమా ఇండస్ట్రీలో అప్‌ అండ్‌ డౌన్స్‌ మామూలే. డౌన్స్‌ వచ్చినప్పుడు మీరెలా సపోర్ట్‌ చేస్తారు?
ఊహ: మన టైమ్‌ బాగున్నప్పుడు పైన ఉంటాం. లేదంటే కొంచెం కిందకు దిగుతాం. మనం పైకి వెళ్లినప్పుడు ఎంత బాగా యాక్సెప్ట్‌ చేసుకున్నామో, కిందకు వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలి. మనకు మనం ఆలోచించుకుని సెటిల్డ్‌గా ఉంటే బావుంటుంది. ఈయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే... తన ఫీలింగ్స్‌ని బయటకు చూపించరు. హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకుంటారు కానీ డల్‌ మూమెంట్స్‌ని బయటపెట్టరు. అయితే నేను కనిపెట్టేస్తాను. కానీ అది బయటకు చెప్పకుండా ఆయనతో మూమూలుగానే ఉంటాను. మెయిన్‌గా పిల్లలు కూడా ఈ విషయంలో సపోర్ట్‌ చేస్తారు. మేమిద్దరం ఆ విషయంలో అదృష్టవంతులం. మా పెద్దబ్బాయి రోషన్‌ సిట్యువేషన్‌ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తాడు. పాప పదో తరగతి. చాలా జాగ్రత్తగా ఉంటుంది. మా చిన్నబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు.
శ్రీకాంత్‌: అలాంటి టైమ్స్‌లో వాళ్లకంటే నేను ఎక్కువ ధైర్యంగా ఉండాలి.
   
► ఏమైనా కావాలంటే పిల్లలు ఎవర్నడుగుతారు?
ఊహ: దాదాపుగా నన్నే అడుగుతారు. ఏదైనా పెద్ద బడ్జెట్‌ అయితే ఆయన దగ్గరికి వెళతారు. టెన్షన్‌ పడుతూ వెళతారా, వాళ్లు టెన్షన్‌ పడ్డంత సేపు కూడా ఈయన ఉండరు. వెంటనే ఓకే అంటారు. (నవ్వుతూ). పిల్లలు కొంచెం డల్‌గా ఫేస్‌ పెడితే చాలు. వాళ్లకి నచ్చినది దొరికినట్లే. కానీ, మా పిల్లల్లో నచ్చేది ఏంటంటే దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకోరు. ఇలా మనం బాధగా ఫేస్‌ పెడితే నాన్న ఏదైనా చేసేస్తారు అనే మెంటాలిటీ లేదు. అది మంచి విషయం. మేం చాలా లక్కీ. నాన్నని ఏదైనా అడగాలంటే ఓ రోజంతా ఆలోచిస్తారు. అడుగుదామా? వద్దా? అని.

► సరే.. మీ ఇంట్లో ఎవరు డామినేటింగ్‌?
ఊహ: ఇద్దరం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాం.
శ్రీకాంత్‌: తనే డామినేటింగ్‌ (నవ్వులు).
ఊహ: అవును.. మరి ఇల్లు మొత్తం పట్టించుకోవాలి కదా.  
శ్రీకాంత్‌: అంటే నేను షూటింగ్‌లు అని పనుల్లో తిరుగుతూ ఉంటాను. ఆ టైమ్‌లో ఇంటికి అది కావాలి? ఇది కావాలి? అని ఆలోచిస్తే అవుట్‌. ఎప్పుడూ ఇంటి టెన్షన్‌ అనేది మన దగ్గరికి రాకూడదు. నాకా టెన్షన్‌ లేదు. ఒక్కోసారి సడెన్‌గా నైట్‌ షూటింగ్‌ అంటారు. ఏం ఆలోచించకుండా ఓకే అనేస్తాను. ఎందుకంటే నాకు ఇంటి టెన్షన్‌ లేదు.  

► రోషన్‌ మళ్లీ స్క్రీన్‌ మీద ఎప్పుడు కనపడతాడు?
శ్రీకాంత్‌: ఈ ఇయర్‌ అనుకుంటున్నాం.

► ఫైనల్లీ.. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకున్న గిఫ్ట్‌ల గురించి?
శ్రీకాంత్‌: ఏముంటాయి? పాపల బొమ్మలో, బాబుల బొమ్మలో ఇచ్చుంటాను.
ఊహ: అవునండీ.. నాకు బొమ్మలంటే చాలా ఇష్టం. టెడ్డీబేర్‌లు ఇచ్చేవారు. పెళ్లయ్యాక కూడా అవి కొనిచ్చారు.
శ్రీకాంత్‌: బంగారపు గొలుసులు అవీ ఇచ్చేవాణ్ని.. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఇక ఏముంటుంది?
ఊహ: అవును.. ఏముంటుంది? (నవ్వులు).

► మీ ప్రేమను ఇంట్లో ఒప్పించడానికి కష్టపడ్డారా?  
శ్రీకాంత్‌: చాలా ఈజీగా అయిపోయింది.
ఊహ: మాది లవ్‌ మ్యారేజా? అరేంజ్డ్‌ మ్యారేజా అని చాలామంది సందేహపడ్డారు. అంత స్మూత్‌గా జరిగింది.
శ్రీకాంత్‌: ఎంగేజ్‌మెంట్‌ జరిగేవరకూ ఎవరికీ తెలియదు.

► మీరు ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో ఎవరూ కనిపెట్టలేదా?
ఊహ: కొంచెం క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్‌ వరకూ తెలుసు.
శ్రీకాంత్‌: మా ఇంట్లోవాళ్లకి, వాళ్ల ఇంట్లో వాళ్లకి తెలుసు. కానీ మేమిద్దరం బయటకు వెళ్లడం లాంటివి ఏం చేయలేదు. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. ఫంక్షన్స్‌ అప్పుడు మా ఇంటికి పిలిచేవాణ్ణి. అక్కడ అందర్నీ పరిచయం చేసేవాణ్ణి.

► ఇద్దరికీ దైవభక్తి ఎక్కువే అన్నమాట?
శ్రీకాంత్‌: తనకి చాలా ఎక్కువ. పూజలు తెగ చేసేస్తుంది. నేను గుడికి ఎక్కువ వెళ్తుంటాను.
ఊహ: ఈ మధ్యే ఆయనకి భక్తి ఎక్కువయింది.
శ్రీకాంత్‌: ఐదేళ్ల నుంచీ భక్తి ఎక్కువైంది. ఎక్కువగా వీలు దొరుకుతోంది కాబట్టి గుళ్లను సందర్శిస్తున్నాం.

► ఉపవాసాలు అవీ చేస్తుంటారా?
ఊహ: చిన్నప్పటినుండి పూజలు, ఉపవాసాలు అల వాటే. మంగళవారం, శుక్రవారం ఉపవాసం ఉంటాను. శనివారం పిల్లలు కూడా నాన్‌–వెజ్‌ తినరు. ఈయనకు ఆ పట్టింపులేవీ ఉండవు. అలా అని బాగా ఫుడ్డీ కాదు. 

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు