మూడు వేల పున్నములు

13 Nov, 2019 03:31 IST|Sakshi

వేడుక

తుర్లపాటి పద్మావతి 86 ఏళ్లు. అడిదం బాలాత్రిపుర సుందర స్వరాజ్య రాజ్యలక్ష్మి 88 ఏళ్లు. మల్లంపల్లి రమా జయలక్ష్మి 90 ఏళ్లు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లకు వీరి కుటుంబ సభ్యులు ఈ నెల 15న విజయవాడలో ‘సహస్ర చంద్ర దర్శన వేడుక’ జరుపుతున్నారు. సహస్ర చంద్ర దర్శనం అంటే.. వెయ్యి పున్నములను చూసిన వయసును కలిగి ఉండటం. ముగ్గురు కాబట్టి మూడు వేల పున్నముల సంబరం ఇది!! ఈ సందర్భంగా వీరిని ‘సాక్షి’ పలకరించింది.

మల్లంపల్లి రమా జయలక్ష్మి
అన్నయ్య తరవాత మేం ఎనిమిది మంది ఆడపిల్లలం. మా చిన్నప్పుడే నాన్నగారు పోయారు. నేను ఐదో అమ్మాయిని. మా పెద్దక్కయ్య పెళ్లి అయిన కొత్తల్లోనే అన్నయ్య కన్ను మూయడంతో, నా మీద కుటుంబ బాధ్యత పడింది. నేను ఎస్‌ఎస్‌ఎల్‌సి చదివాను.  టైప్‌ నేర్చుకుని, ఉద్యోగంలో చేరాను. ఇంటి బాధ్యతల కారణంగా నేను పెళ్లి చేసుకోలేదు. నాలుగో బావగారు నన్ను పిడబ్లు్యడి ఆఫీసులో టైపిస్టుగా చేర్పించారు. అక్కడ నేను ఒక్కర్తినే అమ్మాయిని. సూపరింటెండెంట్‌ పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగి, ఆ పదవిలోనే రిటైర్‌ అయ్యాను.

ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాను. సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమం గురించి విన్నాను కాని, ఎన్నడూ చూడలేదు. మా చెల్లెలి కొడుకు ఇలాంటి కార్యక్రమం మా ముగ్గురికి కలిపి చేయడం చాలా సంతోషంగాను, ఆశ్చర్యంగానూ ఉంది. ఎలా జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. మా తరంలో మేం ముగ్గురమే మిగిలాం. కుటుంబాలు పూర్వపు పద్ధతిలో ఉంటేనే బాగుంటుంది. అలా ఉండటం వల్లే ఈ రోజు మాకు ఈ పండుగ జరుగుతోందని నేను అనుకుంటున్నాను.

తుర్లపాటి పద్మావతి
ఏలూరులో గవర్నమెంటు స్కూల్‌లో చదువుకున్నాను. స్నేహితులతో స్కిప్పింగ్, త్రోబాల్‌ ఆడేదాన్ని. మేం అందరం ఆడపిల్లలమే అయినా నాన్నగారు ఎన్నడూ విసుక్కునేవారు కాదు. బాల్యమంతా చాలా సంతోషంగా, యాక్టివ్‌గా గడిచింది. స్కూల్‌లోనే కోలాటాలు, గొబ్బి పాటలు అన్నీ నేర్చుకునేవాళ్లం.  చిన్నప్పడు అక్కచెల్లెళ్లు కొట్టుకోవడం సహజమే కదా. ఇప్పుడు ఈ పండుగలాంటి కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మేం కలలో కూడా ఊహించని వేడుక.

మా అక్కయ్య కొడుకు చేస్తున్నాడు. పెళ్లయ్యాక సంసారం బాధ్యతలు, అత్తగారు, మావగారు, ఆడపడుచులు..  ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించడం, కష్టసుఖాలు పంచుకోవడం... ఉమ్మడి కుటుంబంలో అలవాటయ్యాయి. ఇప్పుడే పండుగ జరగబోతోందంటే ఆనందంతో నా కళ్లు చెమరుస్తున్నాయి
 
అడిదం స్వరాజ్య రాజ్యలక్ష్మి  

మా అబ్బాయి మాకు సహస్ర పూర్ణ చంద్ర దర్శన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు మా పెద్దక్కయ్య పెద్ద కొడుక్కి జరిగినప్పుడు ఈ కార్యక్రమం చూశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మాకు జరుగుతోంది కాబట్టి ఆనందంగా ఉంది. మా అక్కచెల్లెళ్ల మధ్యన ఉండే అనుబంధం కారణంగానే మా అబ్బాయి మా వాళ్లను కూడా కన్నతల్లిలాగే చూసుకుంటాడు. ఈ విధంగా ముగ్గురికి ఒకేసారి ఈ పండుగ బహుశా.. అరుదుగా జరుగుతుందేమో.
సంభాషణ: వైజయంతి పురాణపండ
 ఫొటోలు: విజయకృష్ణ, సాక్షి, విజయవాడ

ముగ్గురమ్మలు
ముగ్గురు అమ్మలకు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటినుండి ఉమ్మడి కుటుంబాలలో పెరగటం, కష్టం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చిన్నప్పటి నుండి అనుభవించటం, ఆ సమయంలో అమ్మ కష్టపడి కుటుంబాన్ని నడిపించటం... ఈ కారణాలన్నిటితో పెద్దల మంచి చెడులు చూడాలన్న తపన నాలో కలిగింది. వాళ్ల సంతోషమే నా సంతోషం. వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందం, పసి పిల్లల కళ్లల్లో ఆనందం ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్లే నాకు పిల్లలు.  
అడిదం కృష్ణమోహన్‌
(అడిదం రాజ్యలక్ష్మి కుమారుడు)

మరిన్ని వార్తలు