వద్దంటే వద్దన్నారు!

4 Jul, 2018 00:38 IST|Sakshi

‘సాక్షి’తో మిస్‌ ఇండియా  2018 అనుకృతీవాస్‌ 

‘‘పందొమ్మిదేళ్లకే ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ గెలుపొందా. ‘అందాల పోటీలా! అంగాంగ ప్రదర్శనలా.. వద్దంటే వద్దు..’ అన్నారు మా బంధువులంతా. పోటీలకు వెళ్లకుండా అడ్డుకున్నారు కూడా. ఇప్పుడు సాధించాను. కౌగిలించుకుని అభినందిస్తున్నారు’’ అని ఎంతో సంతోషంగా చెబుతున్నారు అనుకృతీ వాస్‌. ఆమె గురించి మరికొన్ని విశేషాలు.  

ఇప్పటికైతే పక్కనపెట్టేశా!
అమ్మ లేకపోతే నేను లేను. ఒంటరి అమ్మ నా కోసం పోరాడి నా విజయానికి కారణమైంది. నా లక్ష్యాన్ని గౌరవించింది. ‘డ్రెస్‌ అలా వేయద్దు.. ఇలా ఉండొద్దు.. మేకప్‌తో ఊళ్లు తిరగొద్దు’ అని మా అమ్మమ్మ మమ్మల్ని అడ్డుకునేది. కానీ.. అమ్మ నన్ను నమ్మింది. దాని ఫలితమే ఇది.  నా కృషి, పట్టుదల కూడా నాకు తోడయ్యాయి. ఇప్పటి యువతకు ఒకటే చెపుతున్నా. గోల్స్‌ పెట్టుకోండి. వాటిని సాధించండి. అది ఏ రంగమైనా! నా ముందున్న లక్ష్యం విశ్వసుందరిగా మిస్‌ వరల్డ్‌ కిరీటం కైవసం చేసుకోవటమే. చాలా శ్రమించాలి. ఇందుకోసం చదువును కూడా పక్కన పెట్టి కసరత్తు చేస్తున్నా.

మన తీరు మారాలి
సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ పై చాలా అపోహలు ఉన్నాయి. అవి మారాలి. నేను ట్రాన్స్‌ జెండర్‌ ఎడ్యుకేషన్‌కు సాయపడతా. వారికి  సాయం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.  భారతదేశంలో చైల్డ్‌ అబ్యూస్‌పై కూడా చాలా అవగాహన అవసరం. ఇందుకు అన్ని రంగాల వారు ప్రాధాన్యం ఇవ్వాలి. 

హిందీ నేర్చుకుంటున్నా
మిస్‌ ఇండియా అంటే బాహ్య అందం కాదు. అంతఃసౌందర్యం. ఫ్యాషన్‌ ఫీల్డ్‌పై సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. టెక్నాలజీ, ఫ్యాషన్, మోడల్‌ రంగంపై ముందు అవగాహన పెంపొందించుకోవాలి. సరైన ప్రోత్సాహం, అవగాహన ఉండాలి. తమిళనాడు నుండి గెలవటం చాలా గొప్పగా ఫీలవుతున్నా. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. తమిళ్‌.. మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచేందుకు నాకు ప్లస్‌గా నిలిచింది. ఇప్పుడు హిందీ కూడా నేర్చుకుంటున్నా. 

ఇప్పుడే చెప్పలేను
నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. చాలా దూరం వెళ్లాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. రేపు ఏ రంగంలోకి వెళ్తానో ఇప్పుడు చెప్పలేను. నేను సైంటిస్ట్‌ కావచ్చు లేక మరేదైనా కానీ! ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ‘మిస్‌ వరల్డ్‌ మిస్‌ ఇండియా’. ఈ పోటీల్లో ధనవంతులే గెలుస్తారనే అపోహ ఉండేది. నాతో అది తొలగి ఉంటుంది. 

అనుకృతీవాస్‌
నచ్చిన టాపిక్‌ : ఫుడ్డు
నచ్చిన ప్రదేశం : పుదుచ్చేరి
ఇష్టాలు : ప్రయాణాలు
నచ్చిన నటుడు : అందరూ
ఇష్టమైన వ్యక్తి : అమ్మ
చదువు : చెన్నై లయోలాలో బి.ఎ. (ఫ్రెంచ్‌) సెకండ్‌ ఇయర్‌.
మనకు తెలియనివి : అనుకృతి అథ్లెట్, బైక్‌ రేసర్‌ కూడా.
అమ్మాయిలకు ఇచ్చే సలహా : మీరు మీలా ఉండండి. మీక్కావలసింది ఎప్పటికైనా సాధించుకోగలరు. 
– సంజయ్‌ గుండ్ల,  సాక్షి టీవీ, చెన్నై 

మరిన్ని వార్తలు