ఢాంపావళి

30 Oct, 2016 13:06 IST|Sakshi
ఢాంపావళి

సినిమాకి ఓ స్టార్టింగ్.. ఓ ఎండింగ్.. ఉంటుంది.
మధ్యలో ఉన్న కామాలన్నీ కామెడీలే.
హీరో హీరోయిన్లు గొడవపడ్డా.. ప్రేమించుకున్నా..
హీరో విలన్లు తనుకున్నా... కొద్దిగా రిలీఫ్ ఇచ్చే కామాలే కామెడీలు.
ఫుల్‌స్టాప్‌కి క్లోజింగ్ ఉంటుందేమో కానీ కామాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి.
ఇదిగో ఈ రెండు కామాల్లాగా... వాళ్లకు హ్యాపీ దీపావళి..
‘సాక్షి’ పాఠకులకు హ్యాపీ ఢాం..పావళి.

టపాకాయలు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? 
శ్రీనివాసరెడ్డి : నా వీపు.

అదేంటి?
శ్రీనివాసరెడ్డి : అవునండీ... మా ఇంట్లో ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య... ఆఖరువాణ్ణి నేను. ఇంట్లో ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా కనపడేది నా వీపే. వంచి టపాటపా ఢాంఢామ్మని కొట్టేసి వాళ్ల పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయేవాళ్లు. అఫ్‌కోర్స్... నా అల్లరి కూడా ఆ లెవిల్‌లోనే ఉండేదనుకోండి. చెప్పులు వేసుకుంటుంటే చాలు ఎక్కడికి మాయమైపోతానో అని మా అమ్మ హడలిపోతుండేది. అంత బలాదూరు. నేనెంత పాపులర్ అంటే ఊళ్లో అడ్రస్ వెతుక్కుంటూ ఎవరైనా వస్తే అందరూ నన్నే చూపించేవాళ్లు. ప్రతి వీధి నాకు తెలుసు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చినవాళ్లని మీరెళ్లాల్సిన ఇంటివాళ్లకు ఆడపిల్ల వుందా అని అడిగేవాణ్ణి. ఉంది అనంటే పేరడిగేవాణ్ణి. పేరు చెప్పగానే ఆ ఫలానా గోపీ కలర్ మేడ అని టక్కున చూపించేసేవాణ్ణి. ఆడపిల్లలందరూ అంత కంఠోపాఠం.

మరి మీ సంగతి ప్రవీణ్
ప్రవీణ్ : టపాకాయలనగానే నాకు సిసింద్రీ గుర్తుకొస్తుంది. దానిని అంటిస్తే సర్రుమంటూ అంటుకుని సర్‌సర్‌మని ఎటెటో పోతుంది. ఒకసారి అంటిస్తే సర్‌మంటూ దారినపోతున్నవాళ్ల పంచెల్లోకి దూరింది. వాళ్లు కంగారుగా జంప్ కొట్టి నన్ను పట్టుకోవడానికి రన్నింగ్ మొదలెట్టారు. మనం దొరుకుతామా? పరార్.

దీపావళి అల్లరి ఏదైనా గుర్తుందా?
శ్రీనివాసరెడ్డి : లేకేమీ... ఉంది సుయోధనా. అవి ‘రాక్షసుడు’ సినిమా రిలీజైన రోజులు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక తెచ్చిన టపాకాయల్లో అందరికీ అన్నీ పోగా నా మొహాన కొన్ని నేల టపాకాయలు కొట్టారు. అయితే నేను ముందే తెలివిగా ఒక చిచ్చుబుడ్డి దాచిపెట్టుకొని దీపావళి ముగిసి అన్నీ అందరూ తగలెట్టేశారని నిర్థారించుకున్నాక నా దగ్గరున్న చిచ్చుబుడ్డీని చూపిస్తూ ఏడిపించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అని స్టయిల్‌గా హమ్ చేస్తూ ఆ చిచ్చుబుడ్డీ అంటిస్తే...  ఇంకేముంది.. ఢామ్ అని పేలింది. ఈ చేయి చూడండి (కుడి చేయి చూపిస్తూ) ఈ వేళ్లకు ఉన్న మచ్చ అప్పుడు పడినదే.

ప్రవీణ్: నాకు టపాకాయల కంటే కృష్ణవంశీ సినిమాల్లోలాగా దీపాలను ఇల్లంతా వెలిగించి పెట్టడం ఇష్టంగా ఉండేది. ఒకసారి ఆ దీపాలను వెలిగిస్తూ వాటితోనే ఇంగ్లిష్ ఎస్ లెటర్ వచ్చేలా చేశాను. మా ఫ్రెండ్స్ చూసి ‘స్వప్న’ గురించా ‘సూర్యకుమారి’ గురించా అని అడగడం మొదలుపెట్టారు. కాని నేను పెట్టింది మాత్రం హీరోయిన్ శాంతిప్రియ గురించి. ఆమె నటించిన తొలి సినిమా ‘మహర్షి’ నాకు అట్రాక్షన్. ఆ పోస్టర్‌లో స్టాప్ బోర్డ్ పట్టుకుని రిషికొండ బీచ్‌లో నిలబడిన శాంతిప్రియ స్టిల్ నా సినిమా రాకకు నాంది. ఆ విషయం తెలుసుకోకుండా మా ఫ్రెండ్స్ అందరూ గోలగోల చేసేసరికి బయటపడటానికి చచ్చే చావొచ్చింది.

ఆడపిల్లలని టపాకాయలతో పోల్చవచ్చా
శ్రీనివాసరెడ్డి : ఎందుకు పోల్చకూడదండీ? ఇప్పుడు మన రకుల్ ప్రీత్ ఉంది కదండీ. ఏఒన్ తారాజువ్వ. జుమ్ అని దూసుకుపోతోంది. సమంత కలర్ పూల చిచ్చుబుడ్డీ. వచ్చినప్పటి నుంచి స్థిరంగా బ్రైట్‌గా వెలుగుతూనే ఉంది.

ప్రవీణ్ : ‘అ... ఆ’ సినిమా షూటింగ్‌లో అనుపమ పరమేశ్వరన్‌ను గమనించానండీ. బాబోయ్... ఆ అమ్మాయి కాలు నేల మీద అస్సలు నిలవదు. భూచక్రమే అనుకోండీ.

సరే. ఇక మీ ఇంటి వెలుగు గురించి చెప్పండి.
శ్రీనివాసరెడ్డి : చెప్పేదేముందండీ... మా ఇంట్లో అన్నీ బజాజ్ లైట్లే. అవే మా ఇంటి వెలుగు.

అది కాదండీ మీ శ్రీమతి గురించి.
శ్రీనివాసరెడ్డి : ఓ ఆ వెలుగా... తను మా సొంత అక్క కూతురే. పేరు స్వాతి. చిన్నప్పుడు ఎత్తుకునేవాణ్ణి. తను గొప్పగా బతకాలని అమెరికా సంబంధం చేసుకోవాలని అనుకుంటే తను నేనే గొప్పవాణ్ణని నన్ను ఎంచుకుంది. టపాకాయ్లలో వెన్నముద్దలు అని ఒక టైప్ ఉంటాయి గుర్తుందా. అలాంటి కోటి వెన్నముద్దల కాంతి తను.

మరి మీ సంగతి?
ప్రవీణ్ : తను మా కజిన్ ఫ్రెండ్. నాకు ముందు నుంచి తెలుగుదనం ఉన్న అమ్మాయిని చేసుకోవాలని ఉండేది. అలాంటి అమ్మాయే తను. పెద్దలను వెళ్లి మాట్లాడమంటే మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు. నాకో కూతురు.

శ్రీనివాసరెడ్డి: నాక్కూడా ఒక కూతురు. చూశావా... మంచివాళ్లకు అంతా మంచే జరుగుతుంది. ఆడపిల్లలే పుడతారు.

ఏంటి... మీరిద్దరు మంచివారా?
ప్రవీణ్ : సినిమాల్లో హీరో ఫ్రెండ్స్‌గా ఉంటూ హీరో కోసం ఏ మంచికైనా రెడీ కదండీ.. అదన్నమాట. ఈసరదా పక్కన పెడితే ఆడపిల్ల కంటే అద్భుతం ఏముంటుంది. షూటింగ్ నుంచి ఇంటికెళ్లి పాపను చూసుకుంటే ఆ ఆనందమే వేరు.

శ్రీనివాసరెడ్డి : బాగా చెప్పావు. నా కూతురును చూసినా నాకు అదే సంతోషం. తను అచ్చు నా పోలిక. ఆన్‌లైన్ షాపింగ్‌లో రకరకాల వస్తువులు చూస్తూ ఫలానావి కొనండి అని మమ్మల్ని దబాయించేస్తుంటుంది.

శ్రీమతి అలిగితే ఎలా సముదాయిస్తారు?
శ్రీనివాసరెడ్డి : మా ఆవిడ ఎప్పుడూ అలగదండీ. ఫ్రెండ్స్‌తో ఉన్నా పార్టీలో ఉన్నా మధ్యమధ్య ఫోన్ చేసి విసిగించదు. ఆ విధంగా నేను లక్కీ అని అందరూ అంటుంటారు.

ప్రవీణ్: నా భార్య కూడా ఎప్పుడూ అలగలేదండీ.

శ్రీనివాసరెడ్డి: అంటే ఇతను పొద్దున్నే లేచి వంటంతా చేసి వచ్చేస్తాడండీ... ఇంకెందుకు అలుగుతుంది (నవ్వులు)

ఇల్లు ఇల్లాలు పిల్లలు సరే... మరి ఓ...
శ్రీనివాసరెడ్డి: ఓ..  అంటే ఇంగ్లిష్‌లో ఎమ్ ఎన్ తర్వాత వచ్చే ఓ నా...

కాదండీ.. ఫ్యాన్సూ... లేడీస్ ఫాలోయింగూ...
ప్రవీణ్: (లేచి నిలబడుతూ): బాబోయ్... నేను వెళతాను. ఇదేదో ఇరికించేలా ఉన్నారు.

శ్రీనివాసరెడ్డి: కూచో. ఎందుకు భయపడతావు. చూడండి... మాకు ఓ... లు పి క్యు ఆర్ ఎస్ టిలు తెలియవు. ఎప్పుడైనా కొందరు ఆడవాళ్లు ఫోన్ చేసి ఫలానా రోల్ బాగుందండీ అనగానే థ్యాంక్స్ చెప్పి పెట్టేస్తాం. అంతకు మించి వెళ్లం.

ప్రవీణ్: వెళ్తే బతుకుతావా ఏంటి?

ఒకవేళ మీరు రకుల్‌ప్రీత్‌కు ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు?
శ్రీనివాసరెడ్డి: రకుల్ ప్రీత్‌నా? ప్రపోజా? చేస్తే ఓకే అంటుందా?

ప్రవీణ్: అంటే ప్రపోజ్ చేసేద్దామనే?

శ్రీనివాసరెడ్డి: అహ... మనకు రకుల్ ఓకే అంటుందా అని డౌటు.

ప్రవీణ్: మనకేం తక్కువ. ఓకే అనొచ్చు. ఆ తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో పరిస్థితి ఏంటి. రోటి పచ్చడే.

పచ్చడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది చెప్పండి... మీ తిండి సంగతి ఏంటి?
శ్రీనివాసరెడ్డి: నేను ప్యూర్ నాన్‌వెజిటేరియన్‌నండీ. రొయ్యలు పీక మొయ్యా తింటాను.

ప్రవీణ్: నాకు ఉప్పుచేప ఇష్టం. లైఫ్ చప్పగా ఉండకూడదంటే ఉప్పుచేపే తినాలి.

సెట్‌లో మీరు అందర్నీ నవ్విస్తుంటారు కదా. మిమ్మల్ని నవ్వించేది ఎవరు?
ప్రవీణ్: కృష్ణ భగవాన్ గారండీ. ఆయన వేసే పంచ్‌లు అదిరిపోతాయి. మొన్నొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావ్‌రా అని అడిగారు. షూటింగ్‌లో గురూజీ అన్నాను. చూడ్డానికి వెళ్లావా చేయడానికి వెళ్లావా అన్నారు. చేయడానికే గురూజీ అన్నాను. ఏమైనా నువ్వు చాలా బిజీ అయిపోయావురా... ఏ సినిమాలో కనిపించవుగాని అని పంచ్ వేశారు. నా పరిస్థితి ఊహించుకోండి.

మీరు నవ్విస్తే అస్సలు నవ్వనివాళ్లు?
శ్రీనివాసరెడ్డి: హిందీ ఆర్టిస్ట్‌లండీ... జోక్ చేస్తే అస్సలు నవ్వరు. క్యా బోలా అంటారు.

ప్రవీణ్: ఒక్కోసారి అందరితో పాటు పెద్దగా నవ్వేసి ఆ తర్వాత తీరిగ్గా అడుగుతారండీ.. క్యాబోలా అని.

 
{స్కీన్ మీద మీకిష్టమైన కమెడియన్?
ఇద్దరూ: ఇంకెవరు బ్రహ్మానందమే.

మీకిష్టమైన కామెడీ సినిమాలు?
ఇద్దరూ: జంధ్యాల గారివి, ఇవివి గారివి, రాజేంద్రప్రసాద్ గారివీ అన్ని సినిమాలు.

హీరోయిన్లలో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న హీరోయిన్?
శ్రీనివాసరెడ్డి: సమంత.

ప్రవీణ్: శ్రీనివాసరెడ్డి ప్రెజెన్స్ సమంతకు చాలా ఇష్టం. పెంచుకుంటాను వచ్చెయ్ అని బతిమిలాడుతుంటుంది (నవ్వు). శ్రీనివాసరెడ్డి గొప్పతనం ఏమిటంటే తను ఎవరినీ హర్ట్ చేయకుండా నవ్విస్తాడు.


హీరోల్లో ఎవరు బాగా జోక్స్ వేస్తారు?
శ్రీనివాసరెడ్డి: మహేశ్‌బాబు... ఆయన కట్ చేసే జోకులు... మంచి మూడ్‌లో ఉండాలేగాని అందరినీ కూచోబెట్టుకుని ఒకటే జోకులు వేసి నవ్వుతాడాయన. ఆ మహేశ్‌బాబుని చాలా తక్కువ మందే చూసి ఉంటారు.

హీరోల్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్
ప్రవీణ్: రవితేజ, సునీల్

శ్రీనివాసరెడ్డి: తారక్‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాణ్ణి. ఆయన పెళ్లయ్యాక తరచూ కలవడం తగ్గింది.

మీ ఇద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు?
ఇద్దరూ: చాలా చేశామండీ. మొన్నటి ప్రేమమ్‌లో కూడా ఉన్నాం.

ప్రవీణ్: రాబోయే ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కలిసి చేశాం. అందులో శ్రీనివాస రెడ్డి హీరో. ‘అవును’ ఫేమ్ పూర్ణ హీరోయిన్. నేను తత్కాల్ అనే క్యారెక్టర్ చేశాను. ఒక కరీంనగర్ అబ్బాయికి కాకినాడ అమ్మాయికి మధ్య సాగే అందమైన ప్రేమ కథ అది. భాగ్యరాజా  స్టయిల్‌లో ఉంటుంది.

మీ ఇద్దరి యాక్టింగ్‌లో కామన్ ఎలిమెంట్ ఏమిటి?
శ్రీనివాసరెడ్డి: డైలాగ్ ఎంత వేగంగా చెప్పినా అక్షరం అక్షరం రిజిస్టర్ అవుతుంది. పెద్ద డైలాగ్ కూడా ఇబ్బంది లేకుండా చెప్తాం.

ఆరోగ్యానికీ యోగా ఏమైనా...
శ్రీనివాసరెడ్డి: ఓ ఎందుకు చేయనండీ. పేకాట ఆడతానండీ. 52 కార్డ్స్‌ని గుర్తు పెట్టుకుని అరేంజ్ చేసుకోని... అబ్బో చాలా ధ్యానంతో ముడిపడిన సంగతండి అది.

ప్రవీణ్: నేను నడుస్తానండీ. మా మధురా నగర్‌లో వాకింగ్ చేస్తాను.

మాకు బోర్ కొడితే సినిమా హాలుకి వెళతాం. మరి మీకు?
శ్రీనివాసరెడ్డి: ఇక్కడే హైదరాబాద్‌లో ఉన్న మా చిన్నక్క ఇంటికి వెళతానండీ. ఫ్యామిలీని తీసుకుని ఊళ్లకెళ్లడం అలాంటివి చేయను. మా వాళ్ల ఇళ్లే నాకు పెద్ద రిలాక్సేషన్.

ప్రవీణ్: మా అంతర్వేదికి పదహారు కిలోమీటర్ల దూరంలో కేసినపల్లి అనే ఊరు ఉందండీ. అక్కడికెళ్లిపోతాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికెళితే 24 గంటలూ కామెడీయే.

ఫైనల్‌గా దీపావళికి మీరిచ్చే మెసేజ్ ఏమిటి?
శ్రీనివాసరెడ్డి: ఎంత కష్టమొచ్చినా ఏడవకుండా కాకరపువ్వొత్తుల్లా నవ్వుతూ ఉండమనే.

ప్రవీణ్: చీకటి తర్వాత వెలుగు వస్తుందండీ. ఇంత పెద్ద అమావాస్యను మనం దీపాల వెలుగుతో ఓడిద్దామని అనుకుంటాం. ఆ ఆశ ఆత్మవిశ్వాసం ముఖ్యమండీ. అవి ఉంటే లైఫ్ హ్యాపీనే.

ధ్యాంక్యూ.. హ్యాపీ దీపావళి.
ఇద్దరూ: సాక్షి పాఠకులందరికీ హ్యాపీ దీపావళి.

‘జయమ్ము నిశ్చయమ్మురా’ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది?
శ్రీనివాసరెడ్డి: అది నిజంగా విచిత్రం అండి. ఈ కథ జేడీ చక్రవర్తిగారి దగ్గరకు వెళ్లింది. ఆయన్ను నేను పర్సనల్‌గా ఎప్పుడూ కలిసింది లేదు. నా సినిమాలు చూసి ఉంటారు కాబట్టి, ఈ కథ నాకైతే బాగుంటుందనుకున్నారట. అలా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది.

- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

మరిన్ని వార్తలు