ఇమేజింగ్‌ డాటర్‌

29 Sep, 2019 01:59 IST|Sakshi

కొత్తదనాన్ని డిజైన్‌ చెయ్యడానికి విజన్‌ ఉన్న డిజైనర్‌ చాలు. పాతదనాన్ని డిజైన్‌ చెయ్యడానికి మాత్రంఇమేజ్‌ని, ఇమాజినేషన్‌ని కలిపే ప్రతిభ ఉండాలి. కళ్లముందు కనిపించే ఇమేజ్‌ని రెండు శతాబ్దాల వెనకటి ఇమాజినేషన్‌తోమ్యాచ్‌ చేసిన అమేజింగ్‌ డిజైనర్‌ సుస్మిత. చిన్నప్పుడు నాన్న రెడీ చేయించిన ఈ అమ్మాయి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా ఇప్పుడు నాన్నను ‘సైరా’ కోసం రెడీ చేసింది! నరసింహారెడ్డిలా నాన్నను ఇమాజిన్‌ చేసిన ఈ ‘ఇమేజింగ్‌’ డిజైనర్‌తో  ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

‘రాధే గోవిందా...’ అంటూ అప్పట్లో ‘ఇంద్ర’ సినిమాలో పాటకు మీ నాన్నగారు వేసుకున్న డ్రెస్సులు ట్రెండీగా ఉన్నాయి. మీకది ఫస్ట్‌ సినిమా కదా?
సుస్మిత : అవును. 2002లో ఆ సినిమా వచ్చింది. పదహారేళ్ల క్రితం ట్రెండ్‌కి తగ్గట్టుగా నాన్నగారి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాను. ట్రెండ్‌ని మాత్రమే కాదు.. నాన్న స్టైల్‌కి తగ్గట్టు డిజైన్‌ చేస్తుంటాను. యాక్చువల్‌గా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా నాకది ఫస్ట్‌ మూవీ. కాంప్లిమెంట్స్‌ వచ్చాయి.

ఇప్పుడు మీరు మీ డాడీకి స్టయిలింగ్‌ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడైనా మీ నాన్నగారు మిమ్మల్ని రెడీ చేసిన సందర్భాలున్నాయా?
(నవ్వుతూ). నాన్నగారు మా చిన్నప్పుడు ఫుల్‌ బిజీగా ఉండేవారు. మాతో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసే వీలు లేకుండా పోయింది. అయితే మమ్మల్ని ఆయన పూర్తిగా రెడీ చేయకపోయినా మా అమ్మగారు రెడీ చేసిన తర్వాత ‘ఇది బావుంది, ఇలా బాలేదు. మార్చు’ అని చెప్పేవారు. అమ్మకి ఇన్‌పుట్స్‌ ఇస్తూ ఉంటారు.

మీ స్టయిలింగ్‌పై మీ నాన్న అభిప్రాయం?
నాన్నగారి దగ్గర ఉన్న మంచి విషయం ఏంటంటే.. తన కూతురే కదా అని ఏం చేసినా బాగుందని కాంప్లిమెంట్‌ ఇచ్చేయరు. కాంప్లిమెంట్‌ ఎంత బాగా ఇస్తారో, మిమర్శ కూడా అలానే చేస్తారు. బాగా లేకపోతే ‘వేరే ఆప్షన్‌ చూపించు’ అంటారు. అందుకే నాన్నగారితో  వర్క్‌ చేయడం చాలా బావుంటుంది. ఆయన ఇచ్చే విమర్శ కూడా విలువైనదే. ‘సైరా’లో ఒక 45 లుక్స్‌ ఉంటాయి. అందులో 6–7 సార్లే చిన్న చిన్న మార్పులు కోరారు.

చిరంజీవిగారి కోసం ఎన్ని కాస్ట్యూమ్స్‌ తయారు చేశారు?
నాన్నకే  సుమారు 100 నుంచి 120 కాస్ట్యూమ్స్‌ చేశాం. ఇంకా అమితాబ్‌గారు, నయనతార, తమన్నా కూడా ఉన్నారు. సుదీప్, సేతుపతి, జగపతిబాబు, రవికిషన్‌లకు ఉత్తరా మీనన్‌ డిజైన్‌ చేశారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లే సుమారు 50 మందికి పైగా ఉన్నారు. సాధారణంగా కాస్ట్యూమ్స్‌ సూట్‌కేసుల్లో తీసుకెళ్తాం. ఈ సినిమా కాస్ట్యూమ్స్‌ మాత్రం పెద్ద పెద్ద ట్రంకు పెట్టెల్లో డీసీఎం వ్యానులో తీసుకెళ్లేవాళ్లం. కొన్ని కాస్ట్యూమ్స్‌ని మడతపెట్టకూడదు. అలాగే హ్యాంగర్‌కి తగిలించి, జాగ్రత్తగా లొకేషన్‌కి తీసుకెళ్లేవాళ్లం.

నాన్నగారి లుక్‌ చూసి మీ అమ్మగారు ఏమన్నారు?
నాన్నగారి తలకట్టు, మీసం అయితే అమ్మకు  చాలా నచ్చింది. అమ్మకి ఇది స్పెషల్‌ సినిమా. ఎందుకంటే నాన్న, నేను, చరణ్, ఈ కంపెనీ సీఈఓ మా పెద్దమ్మ వాళ్ల అమ్మాయి విద్య.. ఇలా అందరం ఈ సినిమాకి పని చేశాం. నేను అనుకున్న విధంగా నగలు ఎవరు డిజైన్‌ చేస్తారనే సందిగ్ధ సమయంలో మా అమ్మ సురేఖ ‘మంగత్రాయ్‌’ను సంప్రదించమని చెప్పారు. వెంటనే ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ గుప్తాను కలిశా. నేను గీసిన కొన్ని డిజైన్స్‌ ఇచ్చా. నేను అనుకున్నట్లు నగలు డిజైన్‌ చేశారు.

చిరంజీవిగారి కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ ఒప్పుకున్నాక ఆయనేమో ఆ షూటింగ్‌కి చరణ్‌ ‘రంగస్థలం’ షూటింగ్‌కి వెళుతుంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీలయ్యారట..
అవును. ‘ఖైదీ నంబర్‌ 150’ పూర్తవ్వక ముందే రంగస్థలం మొదలైంది. నాన్న, చరణ్, నేను రెడీ అయి వెళుతుంటే అమ్మకి స్పెషల్‌ మూమెంట్‌లా అనిపించేది. ‘రంగస్థలం’ పూర్తవ్వకముందే ‘సైరా’ స్టార్ట్‌ అయింది. ఈసారి మేం ముగ్గురం ఒకే సినిమాకి అంటే ఆవిడకి చాలా ఆనందం అనిపించింది.

ఖైదీ నంబర్‌ 150’ కమర్షియల్‌ ఫార్మట్‌. ‘రంగస్థలం’ మీకు అలవాటు లేని డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌. అదో చాలెంజ్‌ అయితే ‘సైరా’ హిస్టారికల్‌. ఈ సినిమాలో మీరెలా భాగమయ్యారు?
చిరంజీవిగారి పర్సనల్‌ స్టయిలింగ్, బాడీ లాంగ్వేజ్‌ తెలిసి ఉన్న కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అయితే బెస్ట్‌ అనుకున్నారు. డాడీ పర్సనల్‌ స్టయిలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో నేనెప్పుడూ ఉంటాను. ‘సైరా’ సినిమాకు అంజు మోడీ అనే డిజైనర్‌ని తీసుకున్నారు. సినిమాకు కావాల్సిన మూడ్, కలర్‌ పాలెట్‌ అంతా ఆమె డిజైన్‌ చేశారు. ఆ తర్వాత ఆమెకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటంతో కంటిన్యూ చేయలేకపోయారు. అప్పుడు నరసింహారెడ్డి పాత్రకు సంబంధించిన డిజైనింగ్‌ తీసుకోవాల్సి వచ్చింది. నేను కొన్ని డిజైన్‌ చేశాను. ‘మిగతా లీడ్‌ రోల్స్‌కి (నయనతార, సుదీప్, తమన్నా, అనుష్క) కూడా నువ్వెందుకు చేయకూడదు?’ అని చరణ్‌ అడిగాడు. సాధారణంగా పెద్ద స్టార్స్‌ అందరికీ పర్సనల్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ ఉంటారు. ఈ సినిమాలో కొన్ని లీడ్‌ పాత్రలన్నీ ఒకే సింక్‌లో ఉండాలి. వేరు వేరు డిజైనర్స్‌ని ఒక చోటుకి రప్పించి అందరితో ఒకలాంటి స్టయిల్‌లో  చేయించడం ప్రాక్టికల్‌గా కుదరదు. ‘నీకు స్టోరీ మొత్తం తెలుసు. కథకు ఏం కావాలో తెలుసు. వాళ్లకి కూడా నువ్వే డిజైన్‌ చేయి’ అన్నాడు చరణ్‌. వాళ్లందరూ పెద్ద పెద్ద స్టార్స్‌. దాంతో నాకు చిన్నపాటి ప్రెషర్‌ అనిపించింది. కొన్ని డిస్కషన్స్‌  తర్వాత చేయగలననిపించింది.

కంటిన్యూస్‌గా దాదాపు మూడు సమ్మర్స్‌ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాయి..
(నవ్వుతూ). ‘రంగస్థలం’ షూటింగ్‌ని రాజమండ్రిలో మంచి ఎండల్లో చేశాం. దాదాపు అందరం ట్యాన్‌ అయిపోయాం. కొందరైతే కళ్లు తిరిగి కూడా పడిపోయారు. అలా ఒక సమ్మర్‌ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ‘సైరా’కి వచ్చేసరికి రెండు సమ్మర్లు చూశాం. ఫుల్‌గా ఎండలోనే షూటింగ్‌ చేశాం. ఫ్యాబ్రిక్‌లో ఎక్కువ ఖాదీ, కాటన్, ఖాదీ సిల్క్‌ ఉపయోగించాం. ఖాదీ స్క్రీన్‌ మీద బాగా కనిపిస్తుంది. కంటికి సరిగ్గా అర్థం కాకపోయినా స్క్రీన్‌ మీద అర్థం అవుతుంది. సరిగ్గా చేయకపోతే ఈజీగా దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా చేనేత ఫ్యాబ్రిక్స్‌ వాడాం. ఇది హిస్టారికల్‌ సినిమా కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకూ సెట్లోనే ఉండాల్సి వచ్చింది. కష్టమే అయినా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సంతృప్తి ఉంటుంది.

నరసింహారెడ్డిగారికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువ  కదా... చారిత్రాత్మకంగా కరెక్ట్‌గా ఉంటూ, కమర్షియల్‌ మీటర్‌ను ఆర్టిస్టిక్‌గా ఎలా బ్యాలన్స్‌ చేశారు?
పరిశోధన బాగా చేశాం. నరసింహారెడ్డిగారి మీద ఎక్కువ సమాచారాన్ని ఎవరూ పేపర్‌ మీద పెట్టలేదు. కొన్నే ఉన్నాయి. మేం చేసిందేంటంటే.. 1800 కాలంలో ప్రజలు ఎలాంటి బట్టలు వేసుకునేవారు? ఎలాంటి రంగులు వాడేవారు? స్త్రీల చీరకట్టు ఎలా ఉండేది? మగవాళ్ల పంచెకట్టు ఏంటి అనే విషయాలను తీసుకొని డిజైన్‌ చేశాం. స్వాతం త్య్రోద్యమ సమయంలో నాటి ఉద్యమకారుల్ని ఉహించుకుని నరసింహారెడ్డి ఇలా ఉంటారనే విధంగా 400కి పైగా స్కెచ్‌లు వేసుకున్నా. ఫైనల్‌గా 40 స్కెచ్‌లు ఎంపిక చేసుకుని ఆ లుక్‌ వచ్చేలా శ్రమించా. కమర్షియల్‌గానూ ఉండాలి. లేదంటే డాక్యుమెంటరీ ఫీలింగ్‌ వస్తుంది. అక్కడ నా అనుభవం ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్పగలను. స్క్రీన్‌ మీద ఏది బాగా కనిపిస్తుంది, ఏది ఎబ్బెట్టుగా ఉంటుందో నాకు ఐడియా ఉంది. ప్రతి లుక్‌కి ఓ బ్యాకప్‌ పెట్టుకున్నాను. ఒక షెడ్యూల్‌లో ఐదు డ్రెస్‌ చేంజ్‌లు ఉంటే, ఒకటికి మూడు పెట్టుకునేదాన్ని.

చరణ్‌ మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పగించారు.. అయితే ప్రాక్టికల్‌గా పని మొదలుపెట్టాకే మనమీద మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది కదా... ఆ నమ్మకం మీకెప్పుడు కలిగింది?
ఫస్ట్‌ షెడ్యూల్‌లో రెండు మూడు సీన్లు చేసేటప్పటికే నేను క్యారెక్టర్‌ని అర్థం చేసుకుంటున్నానని తెలిసిపోయింది. బాగా చేయగలం అనే కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అయితే అందరికీ ఎలా వస్తుందా అనే డౌట్‌ ఉండేది. రషెస్‌ చూశాక నమ్మకం కలిగింది.

కాస్ట్యూమ్స్‌ మెటీరియల్‌ ఎక్కడి నుంచి తెప్పించారు?
ఇందులో వాడినవన్నీ ఎక్కువ మన దేశంలోనివే. అమితాబ్‌గారికి వాడినవాటిలో కొన్నింటిని ఢిల్లీ నుంచి తెప్పించాం. లేడీస్‌కి మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం చీరలు వాడాము. పాత్రల కాస్ట్యూమ్స్‌ చూస్తే షాప్‌లో నుంచి తీసుకొచ్చి వేసుకున్నట్టు ఉండదు. ఆ పాత్రలు ఎప్పుడూ కట్టుకునే బట్టల్లానే ఉంటాయి. కాస్ట్యూమ్‌ ఆథెంటిసిటీ ఈ సినిమాలో వందశాతం ఉంటుంది.  

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎంత సంతృప్తికరంగా ఉన్నారు?
చాలా సంతోషంగా ఉన్నాను. అందరం మనస్ఫూర్తిగా కష్టపడి చేసిన సినిమా ఇది.

చారిత్రాత్మక సినిమాలు చేసేటప్పుడు రంగుల్లో కొన్ని పరిమితులు ఉంటాయి కదా?
అవును. ఇది వార్‌ సినిమా కాబట్టి ఒక బ్రౌన్‌ కలర్‌ టోన్‌ ఉంటుంది. అందుకోసం కొన్ని కలర్స్‌ వాడకూడదు. ఈ సినిమాలో ప్రాథమిక రంగులేవీ వాడలేదు. (రెడ్, బ్లూ, ఎల్లో) ఏవీ వాడలేదు. అవి స్క్రీన్‌ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కాస్ట్యూమ్స్‌ ఎప్పుడూ కథలో కలసిపోవాలని నేను నమ్ముతాను. ఈ రంగులు మామూలుæ కమర్షియల్‌ సినిమాలకైతే ఫర్వాలేదు. ఇలాంటి సినిమాలకు వాడితే కథలో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. ఆ పాత్ర ఎలాంటి మూడ్‌లో ఉన్నారో కూడా కాస్ట్యూమ్స్‌ ద్వారా తెలియజేయాలి.

కాస్ట్యూమ్స్‌ అంటే కెమెరా, దర్శకుడు, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం ఉండాలి. ఈగోలు ఉండటం సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటారు?
డైరెక్టర్, ఆర్ట్‌డైరెక్టర్, కెమెరామేన్, కాస్ట్యూమ్స్‌ ఈ నాలుగింటినీ క్రియేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ అంటారు. క్రియేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ కలసి పని చేయాలి. నేను అందరితో సింక్‌లో ఉండి చేయాలనుకుంటాను. క్రియేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈగోలు కామన్‌. చరణ్‌ నన్ను అక్కగా ఈ సినిమా చేయమనలేదు. ఒక నిర్మాతగా నన్ను డిజైనర్‌గా ఈ సినిమాలో భాగమవ్వమన్నాడు. హోమ్‌ వర్క్‌ బాగా చేస్తాను. అది తనకి తెలుసు. ‘ఖైదీ నంబర్‌ 150, రంగస్థలం, సైరా’ వరుసగా కెమెరామేన్‌ రత్నవేలుతో మూడో సినిమా. ఆయన సూచనలు ఉపయోగపడ్డాయి. ఒకవేళ సెట్‌లో ఎవరితో అయినా అభిప్రాయభేదాలు వస్తే అది ఆ రోజు వరకే. ఎందుకంటే అవి వ్యక్తిగత విభేదాలు కావు. కొన్నిసార్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికే టైమ్‌ పడుతుంది. దర్శకుడు మనసులో ఏముందో అర్థం చేసుకుంటే పని సులువు అవుతుంది.

‘సైరా’ శ్రమతో కూడుకున్న సినిమా అన్నారు. ఎందుకు ఒప్పుకున్నానా అనే సందర్భాలు?
అలా అనుకుంటే ఈ ఫీల్డ్‌లో ఉండలేం. నేను చిరంజీవిగారి కూతుర్ని కదా నేను పని చేయడమేంటి? మనం పని చేయించుకోవచ్చు కదా అని పని చేస్తే మనల్ని చూసి పని చేసేవాళ్లు కూడా పాడైపోతారు. వాళ్లను కూడా చెడగొట్టినవాళ్లం అవుతాం. వాళ్లతో పని చేయించాలంటే నేనూ అలానే పని చేయాలి. రాత్రి ఎంతైనా సరే నేను వాళ్ల వెనకే ఉండాలి. నేనే ఉన్నానంటే వాళ్లు కూడా ఉండాల్సిందే. అలా పని పూర్తి చేసేదాన్ని. పని చేస్తూ, చేయిస్తూ ఉంటేనే పని జరుగుతుంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా నేను ఈ పనులన్నీ చేస్తున్నానంటే మీరు కూడా చెయొచ్చు అని మా టీమ్‌లో అమ్మాయిలకు చెబుతుంటాను. ఇదే కష్టపడే సమయం.. ఉపయోగించుకోవాలని చెబుతుంటాను.

మీ ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేశారు. బయట వాళ్లతో చేయాలనుకోవడం లేదా?
ఇక్కడ ఇన్ని అవకాశాలు దొరికాయి. ఇంతకంటే ఎక్కువ చేయలేం. నాకు 9 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప ఉన్నారు. పనిని, ఇంటిని బ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేస్తే ఆ బ్యాలెన్స్‌ ఖచ్చితంగా పోతుంది.

ప్రత్యేకంగా ఎవరైనా యాక్టర్‌కి స్టయిలింగ్‌ చేయాలనుకుంటున్నారా?
అమితాబ్‌గారితోనే మరో సినిమా చేయాలనుంది. ఆయన చుట్టూ పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఆయన స్థాయికి నేను చాలా చిన్న డిజైనర్‌ని. అయినా గౌరవించారు. ‘నువ్వు చిన్నయినా పెద్దయినా నువ్వు ఒక పని చేస్తున్నావు. దానికి గౌరవం ఇస్తాను. నీ పని నీకు బాగా తెలుసు. నువ్వు అనుకున్న కలర్సే తీసుకురా. వేసుకుంటాను’ అని ఆయన అన్నారు. దాంతో సౌకర్యంగా అనిపించేది. ఏదైనా చెప్పినప్పుడు ఓ కొత్త నటుడిలా చాలా శ్రద్ధగా వింటారు. సినిమాలో అమితాబ్‌గారి క్యారెక్టర్‌ కీలకమైనది. ఆయనకి 15 నుంచి 18 కాస్ట్యూమ్స్‌ ఉంటాయి.

‘సైరా’ 1800 కాలం. ఈ సినిమా తర్వాత కొరటాల శివగారి డైరెక్షన్‌లో మీ నాన్నగారు చేయబోతున్నారు. 1800 నుంచి ఇప్పుడు 2020కి మీరు వర్క్‌ చేయాలి...
యస్‌. ఇంత వేరియేషన్‌ అంటే చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నాకు హీరో పాత్ర వరకూ చెప్పారు. నాన్నగారి పాత్ర కాకుండా కొన్ని ముఖ్యమైన పాత్రలకు కూడా లుక్‌ డిజైన్‌ చేయమన్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా కోసం మేం ఒక లుక్‌ని డిజైన్‌ చేశాం. అదే ఫైనల్‌ కాదు. ఇంకొన్ని లుక్స్‌ ఉన్నాయి.

మీ వృత్తే కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేయడం. రోజూ ప్రత్యేకంగా రెడీ అవుతారా?
ఒక్కోసారి టైమ్‌ ఉండదు. దొరికింది వేసుకొని షూటింగ్‌కి పరుగు పెట్టడమే (నవ్వుతూ).

డిజైనర్‌గా మారడానికి మీ స్పూర్తేంటి?
సినిమాయే నా స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూనే పెరిగాను. గంటలకొద్దీ షూటింగ్‌లు చూసేదాన్ని. అలా చూస్తూ ఉండిపోగలను. సినిమాకి, ఫ్యాషన్‌కి కలిపేది కాస్ట్యూమ్స్‌. అందుకే దీన్ని ఎంచుకున్నాను.

150 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో చిరంజీవి కనిపించారు. ఆయన లుక్స్‌లో మీ ఫేవరెట్‌ ఏది?
‘కొదమసింహం’. ఆ సినిమాలో కౌబాయ్‌ లుక్‌ భలే ఇష్టం. ‘కొండవీటి దొంగ’ కూడా ఇష్టం. ‘చంటబ్బాయి’ సినిమా నా ఫేవరెట్‌.

నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు?
అవును. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరుతో స్టార్ట్‌ చేశాను. ప్రస్తుతం డిజిటల్‌ కంటెంట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. నేను డిజిటల్‌ కంటెంట్‌ బాగా చూస్తుంటాను. మా ఆయన ఊరికే కంప్లయింట్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన్నే ఈ బిజినెస్‌లోకి దించేశాను. ఆయన ఫైనాన్స్‌ చూసుకుంటారు.

కాస్ట్యూమ్‌ డిజైనర్, ఇద్దరి పిల్లలకు అమ్మగా, ఇప్పుడు నిర్మాతగా ఎలా మ్యానేజ్‌ చేస్తున్నారు.. ఫ్యామిలీని మిస్సవుతున్న ఫీలింగ్‌?
నేను చెన్నైలో ఉంటాను. ‘సైరా’ కోసం హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యాను. పిల్లల్ని అక్కడ వదిలి నేనిక్కడ పని చేయడం కుదరదు. పిల్లలతో వచ్చాను. మా ఆయన చెన్నై టు హైదరాబాద్‌ ట్రావెల్‌ చేశారు. అది హెల్ప్‌ అయింది. ప్యాకప్‌ అయిన తర్వాత పిల్లలతో ఉండేదాన్ని. నైట్‌ షూటింగ్‌ అప్పుడు వాళ్లు స్కూల్‌కి వెళ్లే ముందు కనబడేదాన్ని. అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్‌ చేశాను. మా అమ్మ, నా భర్త నా పెద్ద సపోర్ట్‌. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ ఉన్నారు. వర్క్‌ పరంగా ఇబ్బందిగా ఉంటే మా ఆయన ఉంటారు. మెడిటేషన్‌ చేయించకుండానే మెడిటేషన్‌ చేసినట్టు కూల్‌ చేసేస్తారు.              

మీరు ఏ పని చేసినా మీ బ్యాక్‌గ్రౌండ్‌ తాలూకా ప్రెషర్‌ కచ్చితంగా ఉంటుంది కదా?
మేమెలా పెర్ఫార్మ్‌  చేస్తాం అనే విషయంలో ఎప్పుడూ ఒక ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్‌తో పని చేయకూడదు. ఈ ఒత్తిడితో పని చేస్తే ఎక్కడో చోట మిస్‌ అయిపోతాం. అనుకున్న అవుట్‌పుట్‌ ఇవ్వలేం. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. మమ్మల్ని అలానే పెంచారు. మీరు అదీ ఇదీ అన్నట్టు పెంచలేదు. అందరిలానే. నేనెప్పుడూ సెలబ్రిటీని అనుకోను. నా సొంతంగా నేనేదైనా సాధించినప్పుడు నేను కూడా సెలబ్రిటీయే అని భావిస్తాను. అప్పటి వరకూ నేను కూడా అందరిలానే వర్కింగ్‌ మామ్‌నే.

కమర్షియల్, పీరియాడిక్, ఇప్పుడు హిస్టారిక్‌ సినిమా చేశారు. అన్నింట్లో ఏది ఈజీ.. ఏది టఫ్‌?
‘సైరా’ చాలా శ్రమతో కూడుకున్న సినిమా. అంత శ్రమ ఉంది కాబట్టి అందులో చాలా చాలెంజ్‌లు ఉన్నాయి. చాలెంజ్‌లు ఎదురైనప్పుడు మన పని మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంటుంది. షెడ్యూల్స్‌ ఎంత చాలెంజింగ్‌గా, క్రేజీగా ఉంటేనే అంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనకు చాలా నేర్పిస్తాయి.

మరి.. రెమ్యూనరేషన్‌ ఎంత ఇచ్చారు?
(నవ్వుతూ) చరణ్‌నే అడగండి.

►ఫ్యాషన్‌ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా  రెండేళ్లుగా ఎంత కష్టపడ్డాననేది ఈ సినిమా ద్వారా నిరూపితం కానుంది. ‘యాజ్‌ ఏ ఫ్యాన్‌ ఐ కాంట్‌ వెయిట్‌ ఫర్‌ ద మూవీ’ (ఆనంద బాష్పాలతో). నరసింహారెడ్డి ఎలా ఉంటాడో కూడా తెలియని ప్రపంచానికి ఈ సినిమా ద్వారా స్వయానా నేను నాన్నని డిజైన్‌ చేసి చూపించబోతున్నా. 
– గౌతమ్‌ మల్లాది

మరిన్ని వార్తలు