మన నైపుణ్యమే  మనకు గుర్తింపు

9 Dec, 2019 02:03 IST|Sakshi

పరిచయం  నీరజ గొడవర్తి, పారిశ్రామికవేత్త

నా జీవితాన్ని నాలుగు సెగ్మెంట్‌లుగా విభజించుకున్నాను. మొదటిది  నా ప్రొఫెషన్, రెండు భార్యగా తల్లిగా నా ఇంటి బాధ్యత, మూడవది నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి దోహదం చేసే నా ప్యాషన్,  నాలుగవది సాటి మహిళల కోసం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సామాజిక బాధ్యత. ప్రొఫెషన్‌లో మన సర్వీస్‌ నూటికి నూరు శాతం ఇవ్వగలగాలంటే మన పర్సనల్‌ స్పేస్‌ను సంతృప్తి పరుచుకుంటూ ఉండాలి.

తొమ్మిది  భారతీయ భాషల్లో త్యాగరాజ కృతులు పాడినా, ఇంట్లో సీతారామ కల్యాణం చేసినా అవన్నీ నా సంతోషం కోసమే. పారిశ్రామికవేత్తగా  కష్టపడేది నన్ను నేను గెలిపించుకోవడం కోసం. లా నన్ను నేను  గెలిపించుకోవడం సాధ్యమయ్యేది నన్ను నేను సంతోషంగా ఉంచుకున్నప్పుడే. ఈ చిన్న చిట్కా తెలిస్తే జీవితంలో అసంతృప్తులు  ఉండవన్నారు నీరజ గొడవర్తి. ఇటీవలే ఎమినెంట్‌ ఉమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డు అందుకున్న నీరజ తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.

‘‘మాది మద్రాసులోని తెలుగు కుటుంబం. మా తాతగారు మద్రాసు నుంచి బాపట్ల వచ్చి స్థిరపడ్డారు. మా నాన్న అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగరీత్యా తెలంగాణలో పెరిగాను. పెళ్లితో పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. సంగీతంలో ప్రవేశం ఉన్న కుటుంబం కావడంతో నేను కూడా కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న క్రమశిక్షణ నాలో ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆ క్రమశిక్షణే జీవితాన్ని సక్రమంగా చక్కదిద్దుకునే నైపుణ్యాన్నిచ్చింది. టైప్, షార్ట్‌ హ్యాండ్‌ అర్హతలు కూడా ఉండడంతో బీకామ్‌ పరీక్షలు రాసిన వెంటనే ఓ పెద్ద కంపెనీలో అకౌంట్స్‌ విభాగంలో ఉద్యోగం వచ్చింది. చదువు మాత్రమే సరిపోదు, లైఫ్‌ స్కిల్స్‌ కూడా ఉండాలని నాకు తెలిసిన సందర్భం అది.

ఉద్యోగం చేస్తూనే కరస్పాండెన్స్‌లో పీజీ చేశాను. ఎనిమిదేళ్ల ఉద్యోగానుభవం నాకు పెళ్లి తర్వాత నా భర్త కంపెనీని నిర్వహించడంలో చాలా బాగా దోహదం చేసింది. మావారి ఏకశిలా కెమికల్స్‌ లిమిటెడ్‌లో మొదట కంప్యూటర్‌ విభాగం బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు అదే కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... సక్సెస్‌కి ఎప్పుడూ షార్ట్‌ కట్‌ ఉండదు. కంపెనీ మనదైనా సరే, అందులో ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవాలంటే మన శ్రమ, మనం కంపెనీకి ప్రయోజనకరంగా ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. అంతేతప్ప మనలో అంకితభావం, పట్టుదల, నైపుణ్యం లేకపోతే పెద్ద బాధ్యతలు అప్పగించే సాహసాన్ని భర్త కూడా చేయడు. 

మొక్కలు పెంచాను
మా బాబు కోసం మూడేళ్లపాటు నా కెరీర్‌లో గ్యాప్‌ తీసుకున్నాను. అప్పుడు నాకు టైమ్‌ వృథా చేస్తున్నానా అనిపించేది. అప్పుడు హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. బాబు స్కూల్‌కెళ్లడం మొదలైన తర్వాత బంజరుగా పడి ఉన్న రెండెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చే బాధ్యత తీసుకున్నాను. అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లో చూసిన బటర్‌ ఫ్లై పార్క్‌ను దృష్టిలో పెట్టుకుని పొలం మధ్యలో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంతోపాటు సీతాఫలం, గోరింటాకు, అశ్వత్థ, రుద్రాక్ష, ఖర్జూరం, అంజూర్‌ చెట్లు వేశాను. హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి రెండేళ్లు అవార్డు అందుకున్నాను. హార్టికల్చర్‌ అవార్డుకి గీటురాయి ప్రధానంగా ఒక్కటే. మనం పెంచిన ప్రతి చెట్టుకీ ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. చూడడానికి అందంగా కనిపించడం కోసం క్రోటన్స్‌ నాటానంటే ఒప్పుకోరు. పువ్వులు, కాయలు, ఔషధ గుణాల వంటి ఉపయోగకరమైనవే అయి ఉండాలి. గార్డెన్‌కి నేను రోజూ చేయాల్సిందేమీ లేదిప్పుడు. కంపెనీ పనులు చూసుకుంటున్నాను. 

ఒకప్పటి పురుష సామ్రాజ్యం
పరిశ్రమ నిర్వహణలో ఉన్న మహిళలు సక్సెస్‌బాట పట్టిన తమ విజయాలను చూసుకుని సంతోషపడితే సరిపోదు. తమ వంతుగా సామాజిక బాధ్యతను చేపట్టి తీరాలి. ఎందుకంటే ఓ దశాబ్దం వరకు కూడా ఇది పూర్తిగా మగవాళ్ల సామ్రాజ్యం. ఇప్పుడు మహిళలు ముందుకు వస్తున్నారు. ముందుతరం మహిళాపారిశ్రామిక వేత్తలు తాము నడిచిన దారితో కొత్తవారికి మార్గదర్శనం చేయగలగాలి. పరిశ్రమ నిర్వహణలో దాగిన మెళకువలను కొత్త వారికి నేర్పించాలి. కేవలం అందుకోసమే కోవే (కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా) లో మెంబర్‌గా చేరాను. ఇందులో వందల సంఖ్యలో మహిళలున్నారు. తమ పరిశ్రమలను విజయవంతంగా నడిపించుకుంటున్న వాళ్లు దాదాపుగా ఎనభై మంది ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు పెట్టి కొత్తవాళ్లకు దిశానిర్దేశం చేయడం, కుటీర పరిశ్రమలు నడుపుతున్న వాళ్ల ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం కోసం కోవే మార్ట్‌లు నిర్వహించడం నాకు చాలా సంతృప్తినిస్తున్నాయి. సమాజంలో ఒకింత విస్తృతమైన పరిచయాలు ఉండడంతో నోటి మాట ద్వారా మా కోవే నెట్‌వర్క్‌లో ఉన్న మహిళలకు ఆర్డర్‌లు ఇప్పించగలుగుతాం. అవసరం ఉన్న వాళ్లకు– సర్వీస్‌ ఇవ్వగలిగిన వాళ్లకు మధ్య వారధిగా పని చేయడం అన్నమాట. ఇందుకోసం ఓ పది నిమిషాల ఫోన్‌ కాల్‌ మినహా మాకు ఖర్చయ్యేది ఏమీ ఉండదు. సక్సెస్‌ బాటలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను నేను కోరేది ఒక్కటే... మీరు ఎక్కిన నిచ్చెన మెట్లు మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చాయి. తొలి అడుగు ఎలా వేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మహిళలెందరో ఉన్నారు. వారికి చేయి అందించండి.

ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది
కొత్త తరం యువతులు ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ చదువుకుని కూడా గృహిణిగా ఉండిపోయిన వాళ్లలో చాలా మంది పిల్లలు పెద్దయ్యే కొద్దీ జీవితంలో తెలియని వెలితి ఫీలవడాన్ని చూస్తున్నాం. ఈ వ్యాక్యూమ్‌ అనేది ఎవరికి వాళ్లు ఏర్పరుచుకునేదే. వాళ్లకు నేను చెప్పగలిగిన చిన్న సలహా ఏమిటంటే... ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి, దానినే మీకు గుర్తింపుగా మలుచుకోండి. ఇంటిని అందంగా అలంకరించడం, చక్కగా చీర కట్టుకోవడం, రుచి వంట చేయడం... ప్రతిదీ ఇప్పుడు మార్కెట్‌ వస్తువులే. స్నేహితులకు, బంధువులకు హాబీగా చేసివ్వచ్చు. ఆర్థిక అవసరాలుంటే వీటినే ఉపాధిగా మార్చుకోవచ్చు. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. గడచిన తరం మహిళలకు ఇన్ని అవకాశాల్లేవు. ఇప్పుడు అవకాశాలకు ఆకాశమే హద్దు’’.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : గాలి అమర్‌

పూలకు పాట

ఇకబెనా ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ ఆర్ట్‌ గురించి ఒక ఫ్రెండ్‌ చెప్పింది. ఆ కళను నేర్చుకోవడమే కాకుండా అందులో అడ్వాన్స్‌ కోర్సు కూడా చేశాను. ఇకబెనా మీద పాట రాసి, స్వయంగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేసి రెండేళ్ల కిందట హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఏషియన్‌ రీజనల్‌ కాన్ఫరెన్స్‌లో పాడాను. కోవే మహిళలను ఉత్తేజితం చేయడానికి కూడా పాట రాశాను. మార్కులు తక్కువగా వచ్చాయని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, దిశ సంఘటన మీద కూడా పాట రాశాను. మనసులో అలజడి రేగినప్పుడు పాట రాయడం, మనసు బాగున్నప్పుడు పూలు అలంకరించుకోవడం, కీర్తనలు పాడడం ఇవన్నీ నాకు జీవితం మీద ఇష్టాన్ని పెంచే పనులు. ఏ ఉద్వేగాన్నీ అణుచుకోకూడదు. ఉద్వేగం ఏదో ఒక కళ రూపంలో బయటకు తీసుకురావాలి. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఫలవంతంగా జీవించగలుగుతాం.
– నీరజ గొడవర్తి,  ఎమినెంట్‌ ఉమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌  అవార్డు గ్రహీత

మరిన్ని వార్తలు