కీర్తి కొలువు

6 Oct, 2019 02:47 IST|Sakshi

దసరా పండగ స్త్రీ శక్తిని చాటే పండగ. కీర్తీ సురేష్‌ నటిగా తన శక్తిని చాటింది. ‘మహానటి’లోని నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొంది తెలుగు సినిమా శక్తిని కూడా చాటింది. పురాణాలు చదివి శ్లోకాలు నేర్చుకుని అమ్మవారిని స్తుతించడం బాల్యం నుంచి ఆమెకు ఉన్న అలవాటు. బాల్యంలో బొమ్మల కొలువులో తానే ఓ బొమ్మలా కూర్చోవడం సరదా. కీర్తి సురేశ్‌ చెప్పిన పండగ విశేషాలు ‘సాక్షి’కి ప్రత్యేకం

చిన్నప్పుడు దసరా సమయంలో ‘బొమ్మల కొలువు’ పెట్టి చాలా సందడి చేసేవారని విన్నాం. ఆ విశేషాలు చెబుతారా?
కీర్తి: అవన్నీ చెప్పే ముందు గత ఏడాది దసరా సందడిని మిస్‌ అయ్యాను. ఈ దసరా సందడిని కూడా మిస్‌ అవుతున్నాను. ‘మైదాన్‌’ అనే హిందీ సినిమా షూటింగ్‌ కోసం ముంబైలో ఉన్నాను. నా ఫస్ట్‌ హిందీ సినిమా కావడంతో చాలా ఆసక్తిగా ఉంది. ముంబైలో అక్కడక్కడా అమ్మవారి విగ్రహాలు పెట్టి, చాలా బాగా పూజలు చేస్తున్నారు. అదంతా చూస్తుంటే మా ఇంటి పండగని మిస్సవుతున్న బాధ ఉంది.

చిన్నప్పటి నవరాత్రి జ్ఞాపకాలు..
చాలా ఉన్నాయి. అమావాస్య తర్వాతి రోజు నుంచి నవరాత్రులు మొదలవుతాయి. నిండు అమావాస్య రోజు మేం కుంభం పెడతాం. మాకు చాలా ఇంపార్టెంట్‌ అది. కుంభం పెట్టేటప్పుడు ‘లక్ష్మీ కల్యాణం, గౌరీ కల్యాణం’ పాటలు పాడటం ఆనవాయితీ. చాలా శ్రద్ధగా కుంభం పెట్టి, అక్కా (రేవతి), నేను పాటలు పాడేవాళ్లం. ఎలాంటి ఆటంకాలు లేకుండా మిగతా తొమ్మిది రోజుల పూజలు జరగాలని కోరుకుంటాం.

బొమ్మల కొలువు విశేషాలు?
మాది కేరళ అయినప్పటికీ నా చిన్నప్పుడు చెన్నైలో చదువుకున్నాను. చెన్నైలో బొమ్మల కొలువు సందడి చాలా బాగుంటుంది. కేరళలో అంత పాపులర్‌ కాదు. చెన్నైలో ఉన్నప్పుడు మాత్రం దాదాపు ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు ఏర్పాటు చేసేవాళ్లం. బొమ్మలు పెట్టడానికి మెట్లు ఏర్పాటు చేసే పనంతా అమ్మదే. నేను, మా అక్క చక్కగా  థర్మాకోల్‌తో పార్క్‌ రెడీ చేసేవాళ్లం. దానికోసం ఇసుక తెచ్చేవాళ్లం. చెట్ల బొమ్మలు కొనేవాళ్లం.

బొమ్మలన్నీ మీరు, మీ అక్కే కొనేవారా?
షాపింగ్‌ అంతా అమ్మదే. అయితే మేం ఏర్పాటు చేసిన పార్క్‌లో జంతువులు అవీ పెట్టడానికి మాత్రం బొమ్మలను నేనే కలెక్ట్‌ చేసేదాన్ని. ఆ చాక్లెట్‌ పేరు గుర్తుకు రావడంలేదు కానీ, అది కొంటే ఒక జంతువు బొమ్మ ఇచ్చేవారు. దాంతో పండగ సమయంలో ఆ చాక్లెట్లు బాగా కొనేదాన్ని. అలా బోలెడన్ని యానిమల్స్‌ కలెక్ట్‌ చేసి, బొమ్మల కొలువులో పెట్టేదాన్ని. సరదా కోసం నేనూ బొమ్మలా కూర్చునేదాన్ని.

ఇందాక అమావాస్య రోజు కుంభం పెట్టేటప్పుడు పాటలు పాడేవాళ్లం అన్నారు.. మీరు నేర్చుకున్నారా?
అవును. అమ్మ మాకన్నీ చాలా ఇంట్రస్ట్‌గా నేర్పించేది. మ్యూజిక్‌ క్లాసెస్‌కి వెళ్లేవాళ్లం. మా ఇంట్లో నవరాత్రులకు మేమే పాడేవాళ్లం. ఇరుగు పొరుగు పిలిచినప్పుడు వాళ్లింటికి వెళ్లి కూడా పాడేవాళ్లం. నాకు ముఖ్యంగా ‘ఎన్న తవమ్‌ సెయ్‌దేనో...’ (ఏ తపం చేశానో) పాట అంటే ఇష్టం. కృష్ణుడి పాట అది. మా ఇంటి పండగలో కచ్చితంగా ఆ పాట పాడాల్సిందే. చిన్నప్పుడు కృష్ణుడంటే ఉన్న ఇష్టం పెద్దయ్యాక కూడా తగ్గలేదు. అయితే నా ఇష్టదైవాల జాబితాలో ఆ తర్వాత సాయిబాబా, హనుమాన్‌ కూడా చేరిపోయారు.

మీకు తెలిసిన నవరాత్రుల విశిష్టత గురించి చెబుతారా?
తొమ్మిది రోజుల్లో ముఖ్యంగా మొదటి మూడు రోజులు లక్ష్మీదేవి, తర్వాతి మూడు రోజులు సరస్వతీదేవి, చివరి మూడు రోజులు పార్వతీదేవిని పూజిస్తాం. నవరాత్రి అంటే లెక్క ఇదే. నేను వయొలిన్, కీ బోర్డ్‌ నేర్చుకున్నాను. మధ్యలో వయొలిన్‌ ప్రాక్టీస్‌ మానేశాను. సరస్వతీ దేవి పూజ అప్పుడు ఆ రెండింటినీ, నా స్కూల్‌ బుక్స్‌ పెట్టేదాన్ని. మా అక్క ఏమో తన కాళ్ల గజ్జెలు, బుక్స్‌ పెట్టేది. మా అమ్మగారి గజ్జెలు, వీణ కూడా పెట్టేవాళ్లం. అమ్మవార్లను చాలా బాగా అలంకరించేవాళ్లం.

మరి మీరు, మీ అక్క ఎలా అలకరించుకునేవాళ్లు?
మా అమ్మగారికి చాలా శ్రద్ధ. పట్టు లంగాలు, జాకెట్టులు కుట్టించేది. లక్ష్మీదేవి అంటే ఎరుపు అని, ఆ రంగు డ్రెస్సులు కుట్టించేది. లక్ష్మీదేవి పూజ అప్పుడు అవి వేసుకునేవాళ్లం. సరస్వతీదేవి పూజ అప్పుడు తెలుపు రంగు, పార్వతీదేవికి ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుని, పూజించేవాళ్లం. మాకు నగలు బాగా పెట్టేది. వడ్డాణం కూడా పెట్టుకునేవాళ్లం. మా ఇద్దరి జుత్తు చాలా షార్ట్‌గా ఉండేది. మా అమ్మగారు చక్కగా ముడి వేసి, దాని చుట్టూ పువ్వులు పెట్టేవారు. పండగ వస్తోందంటే మేం గోరింటాకు కూడా పెట్టుకునేవాళ్లం.

పురాణాలు బాగా తెలుసా?
బాగా తెలుసు. మహాభారతంలో ఉన్న కథలన్నీ మా అమ్మగారు చెప్పారు. మహాభారతం మెయిన్‌ స్టోరీస్‌ నుంచి చిన్న కథల వరకూ అన్నీ చెప్పారు. ‘భగవద్గీత’లోని 18 అధ్యాయాలు మాకు తెలుసు. రామాయణం కూడా తెలుసు. నేను, అక్క రాముడు పెద్దా? లక్ష్మణుడు పెద్దా? పాండవులు ఎవరు? వంటి మహాభారతం, రామాయణానికి సంబంధించిన పోటీలకు వెళ్లేవాళ్లం. తమిళ్‌ ‘తిరక్కురళ్‌’ వచ్చు. దానికి సంబంధించిన పోటీలకు వెళ్లి బహుమతులు గెల్చుకుని వచ్చేవాళ్లం. అయ్యప్ప స్వామి కథలు తెలుసు. అవతారాల గురించి తెలుసు. బోలెడన్ని శ్లోకాలు వచ్చు. కనకధార, విష్ణు సహస్ర నామం, కందర్‌ షష్టి కవచం.. ఇలా అన్ని శ్లోకాలూ వచ్చు. ఇంట్లో ఖాళీ సమయాల్లో, కారులో వెళ్లేటప్పుడు మా అమ్మగారు ఇవన్నీ నేర్పించారు.

నవరాత్రి ప్రసాదాల గురించి?
ఈ తొమ్మిదిరోజులు తప్పకుండా చేయాల్సిన ప్రసాదం ‘సుండల్‌’. ఒక్కోరోజు ఒక్కో ధాన్యంతో సుండల్‌ చేస్తాం. ఒకరోజు బఠానీ సుండల్, పెద్ద శనగలతో, చిన్న శనగలతో, పచ్చిశెనగపప్పు సుండల్‌.. ఇలా రోజుకొకటి చేస్తాం. ముందు రోజు నానబెట్టి, తర్వాతిరోజు తాలింపు వేస్తాం. ఇంటికి వచ్చినవాళ్లకు తాంబూలంతో పాటు సుండల్‌ ఇస్తాం. ప్రసాదాల తయారీ అంతా అమ్మ పనే. తినడం మా వంతు (నవ్వు).
     ఓకే.. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీ ‘మహానటి తర్వాత మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మిస్‌ ఇండియా’తో పాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు..
ఇది కావాలని ప్లాన్‌ చేసింది కాదు. వరుసగా లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి చాన్స్‌ వచ్చింది. అన్ని కథలూ బాగున్నాయి. అందుకని కాదనలేకపోయాను. అంతేకానీ ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌కే పరిమితం కావాలనుకోవడంలేదు.


ఫైనల్లీ.. నవరాత్రి సందర్భంగా మీరేం చెప్పదలచుకున్నారు?
అమ్మవారు అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీలకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. స్త్రీ అంటేనే శక్తి. కానీ శక్తి లేనివాళ్లం అని చాలామంది అనుకుంటారు. ముందు మన శక్తిని మనం తెలుసుకోగలగాలి. మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూనే మనం సాధించాలనుకున్నది సాధించాలి.

దసరా పండగకి సంబంధించి అమ్మకి ఒక తీరని కోరిక ఉంది. చెన్నైలో చాలామంది బొమ్మల కొలువు ఏర్పాటు చేసి, ఒక రోజు అనుకుని అందర్నీ పిలుస్తుంటారు. ఇప్పటివరకూ అమ్మ అలా చేయలేదు. మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాం.. రండి అని ఆహ్వానించడమే. దాంతో ఒకేరోజు కాకుండా ఎవరి ఇష్టం వచ్చిన రోజు వాళ్లు వచ్చి వెళుతుంటారు. అలా కాకుండా ఒకరోజు అనుకుని, అందర్నీ పిలిచి గ్రాండ్‌గా చేయాలన్నది అమ్మ కోరిక. పెళ్లయ్యాక అక్క విదేశాల్లో ఉంటోంది. నేను సినిమాలతో బిజీ. మా ఇద్దరికీ కుదిరినప్పుడు అమ్మ ఇలా ఏర్పాటు చేయాలనుకుంటోంది. వచ్చే సంవత్సరం ట్రై చేస్తాం.
– డి.జి. భవాని

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా